IND vs AUS ODI Series: వచ్చే నెలలో భారత్ తో జరగనున్న 3 వన్డే మ్యాచ్ ల సిరీస్ కు క్రికెట్ ఆస్ట్రేలియా 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గాయాలతో ప్రస్తుత టెస్ట్ సిరీస్ కు దూరమైన ముగ్గురు కీలక ఆటగాళ్లు వన్డే జట్టులోకి వచ్చారు. ఆల్ రౌండర్లు గ్లెన్ మాక్స్ వెల్, మిచెల్ మార్ష్, జై రిచర్డ్ సన్ లు వన్డే స్క్వాడ్ లో చోటు దక్కించుకున్నారు. వీరి రాకతో ఆస్ట్రేలియా జట్టు మరింత బలంగా మారనుంది. 


భారత్ తో వన్డే సిరీస్ కు ఆస్ట్రేలియా జట్టుకు పాట్ కమిన్స్ నాయకత్వం వహించనున్నాడు. గాయంతో మిగిలిన రెండు టెస్టులకు దూరమైన విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు కూడా వన్డే జట్టులో స్థానం లభించింది. అలాగే స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్ కూడా జట్టులో ఉన్నారు. 


భారత్ తో వన్డే సిరీస్ కు ఆస్ట్రేలియా జట్టు 


పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, ఆష్టన్ అగర్, అలెక్స్ కారీ, కామెరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబూషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, జై రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.


బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టు


ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు భారత్ లో బోర్డర్- గావస్కర్ సిరీస్ లో ఆడుతోంది. ఇప్పటికే ఈ సిరీస్ లో 2 మ్యాచ్ లు ముగిశాయి. ఈ రెండింటిలోనూ ఆస్ట్రేలియా ఓటమి పాలయ్యింది. స్పిన్ పిచ్ లపై ఆడలేక 3 రోజుల్లోనే విజయాన్ని భారత్ కు అప్పగించేసింది. మూడో టెస్ట్ మార్చి 1 నుంచి ఇండోర్ వేదికగా జరగనుంది. 


ఈ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనలిస్టులను దాదాపు నిర్ణయించనుంది. ఈ రేసులో ఆస్ట్రేలియా ఇప్పటికే అగ్రస్థానంలో ఉంది. భారత్ తో మిగిలిన 2 టెస్టులు ఓడిపోయినా ఆసీస్ కు ఫైనల్ చేరుకునే అవకాశం ఉంది. అలాగే ఆస్ట్రేలియాపై 2 టెస్టులు గెలిచిన టీమిండియా తన రెండో స్థానాన్ని మరింత మెరుగుపరచుకుంది. ఆసీస్ పై ఇంకొక్క విజయం సాధించినా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ 2 మ్యాచులు ఆస్ట్రేలియా గెలిచినా భారత్ కు ఫైనల్ ఛాన్స్ ఉంది. అయితే అది ఈ సీజన్ లో మిగిలిన న్యూజిలాండ్- శ్రీలంక, దక్షిణాఫ్రికా- వెస్టిండీస్ సిరీస్ లపై ఆధారపడి ఉంటుంది. 


జూన్ 7 నుంచి డబ్ల్యూపీఎల్ ఫైనల్


ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూపీఎల్) 2021-23 ఫైనల్‌కు సంబంధించిన తేదీలను అంతర్జాతీయ క్రికెట్ (ఐసీసీ) కౌన్సిల్ ప్రకటించింది. ఫైనల్ మ్యాచ్ లండన్ లోని ఓవల్‌ మైదానంలో జూన్ 7 నుంచి 11 వరకు జరుగుతుంది. జూన్ 12ను రిజర్వ్ డేగా కేటాయించారు. ఈ మేరకు ఐసీసీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.