IND vs AUS 1st test: ప్రాక్టీస్ కు పచ్చిక పిచ్ లు ఇచ్చి అసలు మ్యాచ్ కు వచ్చేసరికి స్పిన్ పిచ్ లు ఇస్తారని ప్రాక్టీస్ మ్యాచ్ లు వద్దనుకున్నారు. స్పిన్ ను దీటుగా ఎదుర్కోవడానికి నెట్స్ లో విపరీతంగా ప్రాక్టీస్ చేశారు. భారత్ ను మానసికంగా కుంగదీయడానికి కవ్వింపు మాటలు మాట్లాడారు. అయితే ఇవేవీ భారత్ విజయాన్ని ఆపలేకపోయాయి. ఆస్ట్రేలియా పరాజయాన్ని అడ్డుకోలేకపోయాయి. ప్రపంచాన్ని జయించినా భారత గడ్డపై గెలుపు అంత సులువు కాదంటూ మరోసారి నిరూపితమైన వేళ.. తొలి టెస్టులో ఆసీస్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. స్పిన్ ఆడటంలో మరోసారి తమ బలహీనతను బయటపెట్టుకున్న కంగారూలు మూడో రోజుకే చాప చుట్టేశారు. భారత స్పిన్నర్లు విజృంభించిన వేళ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు.
స్పిన్నర్లు తిప్పేసిన వేళ తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘనవిజయం సాధించింది. 223 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. అశ్విన్, జడేజా, అక్షర్ ల ధాటికి 91 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
ఐదేసిన అశ్విన్
223 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు కుదురుకోనివ్వలేదు. ఈ సిరీస్ ముందు వరకు సూపర్ ఫాంలో ఉన్న ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను స్లిప్ లో కోహ్లీ క్యాచ్ తో ఔట్ చేసిన అశ్విన్.. వికెట్ల పతనానికి తెరలేపాడు. ఆ తర్వాత ఏ దశలోనూ ఆస్ట్రేలియా కోలుకోలేదు. అశ్విన్ బౌలింగ్ లో కోహ్లీ క్యాచ్ జారవిడవటంతో బతికిపోయిన వార్నర్ అవకాశాన్ని ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేదు. 41 బంతుల్లో 10 పరుగులు చేసిన వార్నర్ అశ్విన్ బౌలింగ్ లోనే ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత లబూషేన్ (28 బంతుల్లో 17)ను జడేజా వెనక్కు పంపాడు. ఆ తర్వాతంతా అశ్విన్ విశ్వరూపమే చూపించాడు. వరుసగా వికెట్లు పడగొట్టాడు. యాష్ ధాటికి రెన్ షా (7 బంతుల్లో 2), హ్యాండ్స్ కాంబ్ (6 బంతుల్లో 6), అలెక్స్ క్యారీ (6 బంతుల్లో 10) పెవిలియన్ కు క్యూ కట్టారు. ఈ 3 వికెట్లు ఎల్బీ రూపంలోనే రావడం గమనార్హం. ఆ తర్వాత మిగతా పనిని జడేజా, అక్షర్, షమీలు లు పూర్తి చేశారు. రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ 5, జడేజా 2, షమీ 2, అక్షర్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
రాణించిన బ్యాటర్లు
పేసర్లు ఆరంభించారు. బ్యాటర్లు రాణించారు. స్పిన్నర్లు చుట్టేశారు. ఇదీ తొలి టెస్టులో భారత్ ఆట సాగిన తీరు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 177 పరుగులకే ఆలౌట్ చేసింది. రవీంద్ర జడేజా 5 వికెట్లతో చెలరేగగా.. అశ్విన్ 3 వికెట్లు తీసుకున్నాడు. సిరాజ్, షమీలు తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఆసీస్ బ్యాటర్లలో లబూషేన్ (49), స్మిత్ (37), హ్యాండ్స్ కాంబ్ (31), అలెక్స్ క్యారీ (36) పరుగులతో రాణించారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 400 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో టీమిండియాకు 223 పరుగుల ఆధిక్యం లభించింది. రోహిత్ శర్మ (120) సెంచరీతో రాణించగా.. అక్షర్ పటేల్ (84), అశ్విన్ (70), షమీ (37) పరుగులతో ఆకట్టుకున్నారు.
రోహిత్ రికార్డ్
ఈరోజు సెంచరీతో రోహిత్ శర్మ పలు రికార్డులను చేరుకున్నాడు. రెండేళ్ల తర్వాత శతకం బాదిన హిట్ మ్యాన్ కెప్టెన్ గా అన్ని ఫార్మాట్లలో సెంచరీలు బాదిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా కెప్టెన్ గా టీ20, వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో శతకాలు చేసిన మొదటి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.