IND vs AUS 1st Test:  ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (212 బంతుల్లో 120), ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (170 బంతుల్లో 66 నాటౌట్), అక్షర్ పటేల్ (102 బంతుల్లో 52 నాటౌట్) లు రాణించటంతో ఆస్ట్రేలియా పై పైచేయి సాధించింది. ముఖ్యంగా ఆఖరి సెషన్ లో సంపూర్ణ ఆధిపత్యాన్నిప్రదర్శించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది. మొత్తం 144 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 


వికెట్ నష్టానికి 77 పరుగులతో రెండో రోజు ఆట కొనసాగించిన భారత ఇన్నింగ్స్ ను రోహిత్ శర్మ, అశ్విన్ లు వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును నడిపించారు. కొన్ని బంతులు పరీక్షించినప్పటికీ పట్టుదలగా క్రీజులో నిలిచారు. ఆస్ట్రేలియా సహనాన్ని పరీక్షిస్తూ.. అడపాదడపా బౌండరీలు కొడుతూ ఇన్నింగ్స్ ను నిర్మించారు. ఈ జోడీ వికెట్ ఇవ్వకుండా దాదాపు గంటన్నరపాటు బ్యాటింగ్ చేసింది. రెండో వికెట్ కు 42 పరుగులు జోడించారు.  అయితే తొలి రోజు రాహుల్ వికెట్ తీసిన మర్ఫీ అశ్విన్ (62 బంతుల్లో 23) ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కు పంపాడు. ఆ వెంటనే పుజారా (14 బంతుల్లో 7)ను కూడా క్యాచ్ ఔట్ ద్వారా మర్ఫీనే పెవిలియన్ చేర్చాడు. దీంతో భారత్ 17 పరుగుల తేడాతో 2 వికెట్లు కోల్పోయింది. దీంతో 3 వికెట్లకు 151 పరుగులతో లంచ్ కు వెళ్లింది.


కెప్టెన్ రోహిత్ సెంచరీ


లంచ్ తర్వాత కెప్టెన్ రోహిత్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఓవైపు కోహ్లీ (26 బంతుల్లో 12), సూర్యకుమార్ (20 బంతుల్లో 8) వికెట్లు త్వరగానే కోల్పోయినప్పటికీ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసిన హిట్ మ్యాన్ 171 బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడు. టెస్టుల్లో హిట్ మ్యాన్ కు ఇది 9వ సెంచరీ. రోహిత్ కు రవీంద్ర జడేజా చక్కని సహకారాన్ని అందించాడు. అయితే టీ విరామం అనంతరం 120 పరుగుల వద్ద రోహిత్ ఔటయ్యాడు. తర్వాత శ్రీకర్ భరత్ (10 బంతుల్లో 8) త్వరగానే నిష్క్రమించినప్పటికీ జడేజా, అక్షర్ పటేల్ లు మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. ప్రస్తుతం భారత్


జడేజా- అక్షర్ పటేల్ భాగస్వామ్యం


మూడో సెషన్ లో ఆటంతా జడేజా, అక్షర్ పటేల్ లదే. సెంచరీ అనంతరం రోహిత్ వెనుదిరిగాడు. ఆ తర్వాత అరంగేట్ర ఆటగాడు శ్రీకర్ భరత్ 10 పరుగులకే ఔటయ్యాడు. ఆసీస్ బౌలర్ల జోరు చూస్తే టీమిండియాను చుట్టేస్తారేమో అనిపించింది. అయితే జడేజా- అక్షర్ ల ద్వయం వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. జడేజా అప్పటికే క్రీజులో కుదురుకోగా.. అక్షర్ కూడా ఆచితూచి ఆడాడు. స్పిన్నర్లను కాచుకుంటూ, పేసర్లను ఎదుర్కొంటూ ఈ జోడీ ఒక్కో పరుగు చేర్చుతూ స్కోరు బోర్డును నడిపించింది. మొదట వికెట్ కాపాడుకోవడానికి సమయం తీసుకున్నా.. ఆ తర్వాత బ్యాట్ ఝుళిపించారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ అర్ధసెంచరీలు పూర్తిచేసుకున్నారు. వీరిద్దరూ 8వ వికెట్ కు అజేయంగా 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం జడేజా (66), అక్షర్ పటేల్ (52) పరుగులతో క్రీజులో ఉన్నారు. 


రోహిత్ రికార్డ్


ఈరోజు సెంచరీతో రోహిత్ శర్మ పలు రికార్డులను చేరుకున్నాడు. రెండేళ్ల తర్వాత శతకం బాదిన హిట్ మ్యాన్ కెప్టెన్ గా అన్ని ఫార్మాట్లలో సెంచరీలు బాదిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా కెప్టెన్ గా టీ20, వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో శతకాలు చేసిన మొదటి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 


టాడ్ మర్ఫీ అదిరే అరంగేట్రం


ఆస్ట్రేలియా అరంగేట్ర ఆటగాడు టాడ్ మర్ఫీ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. ఈ ఆస్ట్రేలియా యువ ఆఫ్ స్పిన్నర్ 5 వికెట్లతో చెలరేగాడు. ఈ క్రమంలోనే డీబట్ మ్యాచ్ లోనే 5 వికెట్లు తీసిన నాలుగో ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ గా నిలిచాడు.