Australia vs India 1st ODI | ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ ఓటమితో మొదలుపెట్టింది. తొలి వన్డేలో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా భారత్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ వన్డే మ్యాచ్ కు వరుణుడు పలుమార్లు అంతరాయం కలిగించాడు. వర్షం కారణంగా ఒక్కో ఇన్నింగ్స్‌కు 26 ఓవర్లకు కుదించారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. DLS పద్ధతి ప్రకారం, ఆస్ట్రేలియాకు 131 పరుగులు టార్గెట్ ఫిక్స్ చేయగా.. ఆతిథ్య జట్టు సులభంగా ఛేజ్ చేసింది. తొలి వన్డే విజయంతో 3 వన్డేల సిరీస్ లో ఆతిథ్య జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది, మిగిలిన మ్యాచ్‌లు అక్టోబర్ 23న అడిలైడ్‌లో, అక్టోబర్ 25న సిడ్నీలో జరగనున్నాయి.
భారత టాపార్డర్ ఫెయిల్.. రాణించిన రాహుల్, అక్షర్
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా బౌలర్లు పరిస్థితులను సద్వినియోగం చేసుకున్నారు. పేస్ కు అనుకూలించే పెర్త్ పిచ్ మీద నిప్పులు చెరిగారు మిచెల్ స్టార్క్, హేజిల్ వుడ్, ఎల్లిస్. ఆసీస్ బౌలర్లు ఎదురుదాడికి దిగే అవకాశం ఇవ్వకుండా ప్రారంభంలోనే భారత్ టాప్ ఆర్డర్‌ను కూల్చారు. రోహిత్ శర్మ 8 పరుగులు చేసి అవుట్ కాగా, కింగ్ విరాట్ కోహ్లీ ఒక్క పరుగు కూడా చేయకుండానే డకౌట్ అయి విలియన్ చేరాడు. కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 10 పరుగులు చేయగా, మరో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 11 పరుగులకు ఔటయ్యాడు.
పలుమార్లు వర్షం అంతరాయం..
వర్షం అంతరాయం కలిగించిన తొలి వన్డేలో భారత్ ఆరంభం నుంచి ఇబ్బంది పడింది. ముఖ్యంగా ఆసీస్ పేసర్లు వాతావరణం అనుకూలించడంతో అటు పేస్ తో పాటు స్వింగ్ రాబట్టి భారత బ్యాటర్లను తిప్పలుపెట్టారు. పలుమార్లు వర్షం పడటం సైతం భారత్ కు కలిసిరాలేదు. బ్యాటర్లు క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడ్డారు. వర్షం వల్ల ఎక్కువ సమయం వృధా కావడంతో మ్యాచ్ 26 ఓవర్లకు ఇన్నింగ్స్ కుదించారు.
కఠిన పరిస్థితుల్లో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 31 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. కెఎల్ రాహుల్‌తో కలిసి 5వ వికెట్ కు 39 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అదే అత్యధిక భాగస్వామ్యం. రాహుల్ చివర్లో బౌండరీలు బాది 38 పరుగులు చేశాడు. స్కోరు పెంచే క్రమంలో ఔటయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి చివర్లో రెండు సిక్సర్లు బాదడంతో 130 పరుగులు దాటింది. 26 ఓవర్లలో 9 వికెట్లకు 136 పరుగులు చేసింది. డక్ వర్ల్ లూయిస్ ప్రకారం ఆసీస్ కు టార్గెట్ 131కి నిర్ణయించారు.
మిచెల్ మార్ష్ కెప్టెన్ ఇన్నింగ్స్
అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ తొందరగా అవుటైనా, మిచెల్ మార్ష్ మరో ఎండ్‌లో బౌండరీలు బాదుతూ స్ట్రైక్‌ను క్రమం తప్పకుండా రొటేట్ చేశాడు. మథ్యూ షార్ట్ 8 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔట్ కాగా.. అప్పటికీ స్కోరు 44/2కి చేరింది.
కెప్టెన్ మార్ష్.. జోష్ ఫిలిప్స్ (37) మిడిల్ ఓవర్లలో వేగంగా పరుగులు రాబట్టారు. మ్యాట్ రెన్షా 21 పరుగులు సాయంతో కెప్టెన్ మిచెల్ మార్ష్ 21.1 ఓవర్లలో ఆటను ముగించారు. ఆసీస్ ఇన్నింగ్స్ లో మార్ష్ (46 నాటౌట్) అత్యధిక స్కోరర్ గా నిలిచాడు.