US Open 2023: ప్రపంచ మహిళల  టెన్నిస్  ర్యాంకులలో నెంబర్ వన్‌గా ఉన్న పోలాండ్  క్రీడాకారిణి ఇగా స్వియాటెక్‌కు ఊహించని షాక్ తగిలింది.  డిఫెండింగ్ ఛాంపియన్‌గా యూఎస్ ఓపెన్‌లో బరిలోకి దిగిన స్వియాటెక్..  6-3,  3-6, 1-6  తేడాతో  20వ సీడ్ జెలెనా ఒస్టపెంకొ  (లాట్వియా)కు చేతిలో ఓడింది.  ఈ ఓటమితో ఆమె యూఎస్ ఓపెన్ నుంచి నిష్క్రమించడమే గాక 75 వారాలుగా  అనుభవిస్తున్న నెంబర్ వన్ ర్యాంకును కూడా కోల్పోయింది.  


న్యూయార్క్‌లోని ఆర్థర్ ఆషే స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన పోరులో  తొలి  సెట్ గెలిచిన స్వియాటెక్ తర్వాత మాత్రం  ఆ జోరును చూపించలేకపోయింది. తొలి  సెట్ కోల్పోయాక పుంజుకున్న  ఒస్టపెంకొ..  తర్వాత రెండు సెట్లనూ గెలచుకుని క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. రెండో సెట్ నుంచే  జెలెనా అగ్రెసివ్ అప్రోచ్‌తో ముందుకెళ్లింది.  2017లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన జెలెనా..  గతంలో స్వియాటెక్‌తో జరిగిన మూడు మ్యాచ్‌లలోనూ గెలుచుకోవడం విశేషం.  క్వార్టర్స్ చేరుకున్న   ఆమె..   అమెరికాకు చెందిన  కోకో గాఫ్‌తో తలపడనుంది.   ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఈ ఇద్దరూ తలపడగా..   జెలెనా‌ గాఫ్‌ను ఓడించింది.  


 






ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన స్వియాటెక్ ఆ తర్వాత వింబూల్డన్‌లో  విఫలమైంది.  గతేడాది యూఎస్ ఓపెన్ గెలిచిన  ఈ పోలాండ్ భామ..  డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి తొలి మూడు రౌండ్లలో అలవోకగానే నెగ్గినా   ప్రిక్వార్టర్స్‌లో మాత్రం తడబడింది.  ఇక యూఎస్  ఓపెన్ నుంచి నిష్క్రమించడంతో  ఆమె సమీప ప్రత్యర్థి  అరినా సబలెంక  (బెలారస్)  నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకోనుంది. 


వోజ్నియాకి కూడా.. 


రౌండ్ ఆఫ్ 16 (ప్రీ క్వార్టర్స్)లో భాగంగా  ఆదివారం  డెన్నార్క్ స్టార్ వొజ్నియాకితో తలపడిన కోకో గాఫ్  రెండు సెట్లను గెలుచుకుని విజయం సాధించింది.  గాఫ్ 6-3, 3-6,  6-1 తేడాతో వొజ్నియాకిని ఓడించింది.  


అల్కరాస్ ఆగయా.. 


పురుషుల సింగిల్స్  క్వార్టర్స్‌లో   వరల్డ్ నెంబర్ వన్, స్పెయిన్ యువ సంచలనం  కార్లోస్ అల్కరాస్ కూడా  ప్రిక్వార్టర్స్‌కు చేరాడు. మూడో రౌండ్‌లో అతడు.. 6-2, 6-3, 4-6, 6-3 తేడాతో  బ్రిటన్‌కు చెందిన 26వ సీడ్ ఎవాన్స్‌ను చిత్తుచేశాడు. మరో స్టార్ ప్లేయర్, రష్యాకు చెందిన డానిల్ మెద్వెదెవ్ 6-2, 6-2, 7-6 ’8-6) తేడాతో అర్జెంటీనాకు చెందిన బయేజ్‌ను ఓడించాడు.  ఆదివారం  రాత్రి ముగిసిన ప్రిక్వార్టర్స్ పోరులో జకోవిచ్..  క్రొయేషియా  ఆటగాడు  గొజొను ఓడించాడు.   మూడు సెట్లలో  జకోవిచ్.. 6-2, 7-6, 6-4 తేడాతో  గొజొను చిత్తుచేశాడు. మరో పోరులో అమెరికాకు చెందిన టియఫో 6-4, 6-1, 6-4 తేడాతో రింకీ హిజికట (ఆస్ట్రేలియా)ను ఓడించి క్వార్టర్స్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. 




























ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial