ODI World Cup 2023: ప్రపంచ క్రికెట్లో అరవీర భయంకరమైన టీం ఏదని ప్రశ్నించినా, అత్యుత్తమ టీం పేరు తెలుసుకొనే ప్రయత్నం చేసినా  వచ్చే  సమాధానం ఒకటే.. అదే   సౌత్ ఆఫ్రికా ( SOUTH AFRICA) జట్టు. అత్యుత్తమ ఆటగాళ్లను కలిగి ఉన్న ఈ జట్టు ను నిత్యం  దురదృష్టం మాత్రం వెంటాడుతూనే ఉంటుంది. వరల్డ్ కప్(World Cup) లాంటి ప్రతిష్టాత్మకమైన  టోర్నమెంటులో మొదట్లో మంచి ప్రదర్శన చేసే సౌతాఫ్రికా కీలకమైన నాకౌట్ మ్యాచ్లలో మాత్రం చివర్లో  చేతులెత్తేస్తూ ఉంటుంది. చోక్సర్‌(Chokars)  పేరును పోగుట్టుకునేందుకు దక్షిణాఫ్రికా దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేస్తోంది.


ఇక ఇప్పుడు భారత్ వేదికగా జరుగుతున్న 2023 వన్డే ప్రపంచ కప్ టోర్నీలో కూడా ఇదే జరిగింది. తొలి మ్యాచ్ లలో ఓటములతో సతమతమైన సౌత్ ఆఫ్రికా ఆ తర్వాత ఊహించలేనంతగా పుంజుకుంది. బీభత్సమైన  స్కోర్లు చేస్తూ ప్రత్యర్థులపై పూర్తి అధిపత్యాన్ని చలాయించింది.  పాయింట్ల పట్టికలో దూసుకు వచ్చి  రెండో స్థానంలో నిలిచింది. సౌత్ ఆఫ్రికా దూకుడు చూస్తే సెమీఫైనల్ లో ఎంతో అలవోకక విజయం సాధిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఎప్పటిలాగానే ఒత్తిడికి తలోగ్గి ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలయ్యింది. అయితే మ్యాచ్ లో ఓటమి సంగతి పక్కన పెడితే గురువారం నాటి మ్యాచులో వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సౌతాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్‌కు మద్దతుగా విపరీతంగా ట్వీట్ చేశారు క్రికెట్  అభిమానులు.  


ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో క్వింటన్‌ డికాక్‌ ఒకడు. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో నాలుగు సెంచ‌రీల‌తో రాణించాడు డికాక్‌. 10 మ్యాచుల్లో 594 ర‌న్స్ చేసి కోహ్లి త‌ర్వాత సెకండ్ హ‌య్యెస్ట్ స్కోర‌ర్‌. ప‌దేళ్ల వ‌న్డే కెరీర్‌లో 155 మ్యాచ్‌లు ఆడిన డికాక్ 6770 ర‌న్స్ చేశాడు. 21 సెంచ‌రీలు, 30 హాఫ్ సెంచ‌రీలు చేశాడు. 2013లో జ‌న‌వ‌రి 19న న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్ ద్వారా డికాక్ వ‌న్డే కెరీర్ ప్రారంభ‌మైంది. అయితే తన రిటైర్‌మెంట్ పై వరల్డ్ కప్ కు ముందే ప్రకటన చేశాడు డికాక్.  వన్డేలకు దూరమైనా  టీ 20ల్లో కొన‌సాగనున్నాడు.  అయితే డికాక్ రిటైర్‌మెంట్‌పై సౌతాఫ్రికా కెప్టెన్ బ‌వుమా ఎమోష‌న‌ల్‌గా రియాక్ట్ అయ్యాడు. వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచి డికాక్‌కు ఘ‌నంగా వీడ్కోలు ప‌ల‌కాల‌ని అనుకున్నామ‌ని, కానీ ఆ క‌ల తీర‌లేద‌ని బ‌వుమా తెలిపాడు. డి కాక్‌తో కలిసి ఆడిన సమయానికి బవుమా కృతజ్ఞతలు తెలిపాడు, డ్రెస్సింగ్ రూమ్‌లో  అతనితో తమ  ప్రయాణంలో ప్రతి అంశము గుర్తు ఉంచుకొదగినదే అన్నాడు. డికాక్ రిటైర్‌మెంట్‌తో లెజెండ‌రీ సేవ‌ల‌ను సౌతాఫ్రికా జ‌ట్టు కోల్పోయింద‌ని తెలిపాడు. సౌతాఫ్రికా ఓటమితో భారత్ తో ఫైనల్ లో తలపడనుంది ఆస్ట్రేలియా.




 గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న టైటిల్‌ పోరులో ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్లయినా ఆస్ట్రేలియన్లను మట్టికరిపించి, ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. అయితే ఈ తుది పోరును ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్‌ బోర్డుగా పేరుగాంచిన బీసీసీఐ వైభవంగా నిర్వహించనుంది. అతిరథ మహారథుల మధ్య ఈ మ్యాచ్‌ను కన్నులపండువగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది.