Namibia vs Netherlands: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఫస్ట్‌ రౌండ్‌ మ్యాచులు అభిమానులను తెగ అలరిస్తున్నాయి. పేరుకే పసికూనలు కానీ థ్రిల్‌ను పంచడంలో కాదు! ఆసియాకప్‌ విజేత శ్రీలంకకు మొన్న నమీబియా షాకిచ్చింది. ఇప్పుడే అదే నమీబియాను నెదర్లాండ్స్‌ స్టన్‌ చేసింది! 122 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్ల తేడాతో ఛేదించింది. విక్రమ్‌ జీత్‌ సింగ్ (39; 31 బంతుల్లో 3x4, 2x6), మాక్స్‌ ఓడౌడ్‌ (35; 35 బంతుల్లో 1x4, 1x6), బాస్‌ డి లీడ్‌ (30*; 30 బంతుల్లో 2x4) రాణించారు. అంతకు ముందు నమీబియాలో జాన్‌ ఫ్రైలింక్‌ (43; 48 బంతుల్లో 1x4, 1x6) టాప్‌ స్కోరర్‌.




నమీబియా తడబాటు


గీలాంగ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచులో నమీబియా టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆరంభంలోనే ఓపెనర్‌ డివాన్‌ లా కాక్‌ (0) వికెట్‌ చేజార్చుకుంది. ఆ తర్వాత మైకేల్‌ వాన్‌ లింజెన్‌ (20), స్టెఫాన్‌ బార్డ్‌ (19) నిలకడగా ఆడారు. 2 పరుగుల వ్యవధిలో 2 వికెట్లు పడటం ఆ జట్టును ఇబ్బంది పెట్టింది. అకెర్‌మన్‌ వేసిన 5 ఓవర్లో వాన్‌ ఔటయ్యాడు. తర్వాతి ఓవర్లోనే జాన్‌ నికోల్‌ (0) పెవిలియన్‌ చేరడంతో పవర్‌ ప్లే ముగిసే సరికి నమీబియా 3 వికెట్లు నష్టపోయి 33 పరుగులు చేసింది. కఠిన పరిస్థితుల్లో జాన్ ఫ్రైలింక్‌ (43) నిలిచాడు. కెప్టెన్‌ గెర్హార్డ్‌ (16) సాయంతో జట్టు స్కోరును 100 దాటించాడు. ఆఖర్లో ప్రత్యర్థి బౌలర్లు రాణించడంతో నమీబియా 121-6తో నిలిచింది.


టాప్‌-3 అదుర్స్‌


తక్కువ లక్ష్యమే అయినా పిచ్‌ కఠినంగా ఉండటంతో నెదర్లాండ్స్‌ ఆచితూచి ఆడింది. వరుసగా టాప్‌-3 బ్యాటర్లు రాణించారు. దాంతో 13 ఓవర్ల వరకు ఆ జట్టు తిరుగులేకుండా కనిపించింది. విక్రమ్‌ జీత్‌, మాక్స్‌ వో తొలి వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం అందించారు. వీరిద్దరూ ఔటయ్యాకే అసలు కష్టాలు మొదలయ్యాయి. నెదర్లాండ్స్ మిడిలార్డర్‌ వికెట్లు టపటపా పడ్డాయి. టామ్‌ కూపర్‌ (6), కొలిన్ అకెర్‌మన్‌ (0)ను జేజే స్మిట్‌ ఔట్‌ చేశాడు. స్కాట్‌ ఎడ్‌వర్డ్స్‌ (1)ను ఫ్రైలింక్‌ ఔట్‌ చేశాడు. దాంతో 16.4 ఓవర్లకు ఆ జట్టు 102-5తో నిలిచింది. ఈ క్రమంలో బాస్‌ డి లీగ్‌ ఆచితూచి ఆడాడు. బంతికో పరుగు చొప్పున సాధించాడు. టిమ్‌ ప్రింగిల్‌ (8*) అతడికి అండగా నిలిచాడు. ఆఖరి ఓవర్లో 6 పరుగులు అవసరం కాగా లీడ్స్‌ తొలి బంతిని బౌండరీకి మలిచి విజయం అందించాడు. వరుసగా 2 మ్యాచులు గెలిచిన నెదర్లాండ్స్‌ 4 పాయింట్లతో సూపర్‌-12కు మరింత చేరువైంది.