ICC do sanction four 4day Tests: నాలుగు రోజుల టెస్టులకు ఐసీసీ పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. అయితే ఇది 2025-27 ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ నుంచి కాకుండా 2027-29 డబ్ల్యూటీసీ నుంచి అమలవుతుందని తెలుస్తోంది. అయితే చిన్న దేశాలకు లబ్ధి చేకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే పెద్ద దేశాలైన ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మాత్రం ఎప్పటి మాదిరిగానే ఐదు రోజుల టెస్టులను ఆడేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. గతవారం జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా నాలుగు రోజుల టెస్టులపై చర్చ జరగగా, దీనికి సూత్రప్రాయంగా ఐసీసీ చైర్మన్ జై షా అంగీకరించినట్లు సమాచారం. నిజానికి చాలాకాలంగా నాలుగు రోజుల టెస్టులపై చర్చ జరుగుతోంది. చాలా బోర్డులు దీనిపై ఐసీసీపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. అయితే మరో రెండేళ్లలో నాలుగు రోజుల టెస్టులు సాకరమయ్యేందుకు అవకాశమున్నట్లు సమాచారం.
అందుకోరకే ఈ మార్పు..నాలుగు రోజుల టెస్టుల ద్వారా చాలా తక్కువ సమయంలో ఎక్కువ టెస్టులు ఆడేందుకు చిన్న దేశాలకు ఉపయుక్తంగా ఉంటుందని ఐసీసీ భావిస్తోంది. నిజానికి పెద్ద దేశాలు మినహా చిన్న దేశాలు ఆడుతున్నప్పుడు, టెస్టులు మూడు, నాలుగు రోజుల్లోనే ముగిసి పోతున్నాయి. అలాగే ఆర్థికంగానూ ఐదు రోజుల పాటు టెస్టులను నిర్వహించడం కొన్ని చిన్న బోర్డులకు తలకు మించిన భారంగా మారుతోంది. అందుకే నాలుగు రోజుల టెస్టులకు డిమాండ్ చేశాయి. తాజా డబ్ల్యూటీసీ చాంపియన్ సౌతాఫ్రికా కూడా నాలుగు రోజుల టెస్టుల కోసం పట్టు పట్టినట్లు సమాచారం. ఇక 2017లోనే నాలుగు రోజుల టెస్టులను ప్రయోగాత్మకంగా ఆమోదం లభించింది. గతనెలలో జింబాబ్వేతో ఇంగ్లాండ్ నాలుగు రోజుల టెస్టు ఆడగా, 2019, 2023లో ఐర్లాండ్ తోనూ ఇంగ్లీష్ జట్టు నాలుగు రోజుల టెస్టులో తలపడింది. మరోవైపు నాలుగు రోజుల టెస్టులపై గతంలో కొన్ని విమర్శలు వచ్చాయి. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ విధానానికి ససేమిరా అన్నాడు. టెస్టులు ఐదు రోజుల పాటు సాగాలని గళం విప్పాడు.
ఈ సైకిల్ లో ఐదు రోజులు..ఇక 2025-27 ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ మంగళవారమే ప్రారంభమైంది. శ్రీలంక- బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టుతో ఈ సైకిల్ స్టార్ట్ అయింది. ఈ సైకిల్లో మొత్తం 27 టెస్టు సిరీస్ లు జరుగుతాయి. అందులో 17 సిరీస్ లు రెండు టెస్టులవి కాగా, మూడు టెస్టుల సిరీస్ లు ఆరున్నాయి. ఇక ఇంగ్లాండ్, ఇండియా, ఆస్ట్రేలియా మాత్రమే పరస్పరం ఐదు టెస్టుల సిరీస్ మ్యాచ్ లు ఆడుతున్నాయి. ఇక గతవారం జరిగిన 2023-25 డబ్ల్యూటీసీ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించిన సౌతాఫ్రికా 27 ఏళ్ల తర్వాత తొలి ఐసీసీ టైటిల్ సాధించిన సంగతి తెలిసిందే.