What Are The Chances Of India Winning World Cup 2023 : ఏప్రిల్ 2, 2011 భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని రోజు. 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. కోట్లాది మంది అభిమానుల కల నెరవేస్తూ.. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ... ధోనీ కెప్టెన్సీలోని భారత క్రికెట్ జట్టు అద్భుతాన్ని ఆవిష్కరించింది. 2011లో ప్రపంచకప్‌ను  టీమ్‌ఇండియా రెండోసారి ముద్దాడిన ఆ క్షణాలు ఇప్పటికీ క్రికెట్ అభిమానుల గుండెల్లో చెరగని ముద్రను వేశాయి. ఇండియన్ క్రికెట్ దశ, దిశను మార్చిన ప్రపంచకప్‌ అది. 1975 నుంచి 2019 వరకు పన్నెండు సార్లు వరల్డ్ కప్ జరగగా భారత్ జట్టు రెండు సార్లు విశ్వ విజేతగా నిలిచింది. 1983లో కపిల్‌దేవ్ కెప్టెన్సీలో, 2011లో ఎం.ఎస్. ధోనీ సారథ్యంలో భారత్ జట్టు విజేతగా నిలిచింది. 

2011లో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో కులశేఖర వేసిన 49వ ఓవర్‌ రెండో బంతిని లాంగాన్‌ మీదుగా ధోని సిక్స్‌గా మలచిన షాట్‌ అందరి మనసుల్లో పన్నేండేళ్లుగా ముద్రించుకుపోయింది. 2011 ప్రపంచకప్ ఫైనల్‌లో శ్రీలంకను చిత్తు చేసిన ధోనీ సేన ప్రపంచకప్‌ను సగర్వంగా ముద్దాడింది. ఫైనల్లో అజేయంగా 91 పరుగులు చేసి భారత అభిమానుల 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ తిరిగి భారత్ సొంతం కావడంతో దేశం సంబరాల్లో మునిగిపోయింది. ఇదీ భారత క్రికెట్‌ అద్భుత గతం. కానీ ఇప్పుడు భవిష్యత్తు మళ్లీ అద్భుత క్షణాల కోసం ఎదురుచూస్తోంది. రోహిత్‌ శర్మ నేతృత్వంలోని జట్టు ఈసారి కప్పు కొట్టడం ఖాయమని మాజీలు అంచనా వేస్తున్నారు. అన్ని కలిసొస్తే... ఇదే ఫామ్‌ కొనసాగితే టీమిండియా ఖాతాలో మరో కప్పు చేరడం ఖాయం. మహా సంగ్రామంలో విశ్వ విజేతగా భారత జట్టు నిలవడం ఖాయం. ఇక ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత ఇదే కలను సాకారం చేయాలని రోహిత్‌ సేన గట్టి పట్టుదలగా ఉంది. ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్‌లన్నీ ఏకపక్షంగా సాగడమే ఈసారి భారత జట్టు ఎంత పటిష్టంగా ఉందో చెప్పేందుకు ప్రత్యక్ష ఉదాహరణ. 


ఆ నాడు వన్డే ప్రపంచకప్‌లో క్రికెట్‌ గాడ్‌ సచిన్‌, గౌతమ్ గంభీర్,  యువరాజ్‌ సింగ్, సెహ్వాగ్‌, ధోనీ, సురేష్‌ రైనా ఇలా అందరూ అద్భుతంగా ఆడారు. ఇప్పుడు రోహిత్‌ శర్మ, గిల్‌, కోహ్లీ, రాహుల్‌, శ్రేయస్స్ అయ్యర్‌ ఇలా అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. అప్పుడు బౌలింగ్‌లో జహీర్‌ ఖాన్‌ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఆశిష్‌ నెహ్రా, మునాఫ్‌ పటేల్‌, అశ్విన్‌లతో స్పిన్‌ పటిష్టంగా ఉంది. ఇప్పుడు టీమిండియా బౌలింగ్‌ గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉందన్నది కాదనలేని వాస్తవం. బుమ్రా, సిరాజ్‌, షమీలతో కూడిన భారత పేస్‌ త్రయాన్ని ఎదుర్కోవడం ప్రత్యర్థి జట్ల తరం కావడం లేదు. బౌలింగ్‌లో వీరి ధాటికి తట్టుకోలేక దిగ్గజ జట్లే చతికిల పడుతున్నాయి. ఇలా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న టీమిండియా స్థాయికి తగ్గ ఆటతీరు కనబరిస్తే కప్పు ముచ్చటగా మూడోసారి కప్పు మన ఖాతాలో చేరినట్లే.