ICC Implements New Rule: అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లో మరో కొత్త రూల్‌ అమల్లోకి  వచ్చింది. ఐసీసీ(ICC) తీసుకొచ్చిన ఈ నిబంధన ప్రకారం ఇక నుంచి ఫీల్డింగ్‌ జట్టు స్టంపింగ్‌(Stumping) కోసం అప్పీలు చేసినప్పుడు స్టంప్‌ ఔట్‌ కోసం మాత్రమే చెక్‌ చేస్తారు. గతంలో స్టంపౌట్‌ (Stump Out)కోసం అప్పీల్‌ చేసినప్పుడు... స్టంపింగ్‌తోపాటు క్యాచ్‌నూ చెక్‌ చేసి ఫలితం ఇచ్చేవారు. ఇలా చేయడం వల్ల డీఆర్‌ఎస్‌(DRS)ను తీసుకోకుండా ఫీల్డింగ్‌ జట్టు లబ్ధి పొందుతుందనే విమర్శలు వచ్చిన వేళ ఐసీసీ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఒకవేళ క్యాచ్‌ మీద ఏదైనా అనుమానం ఉంటే అప్పీల్‌ చేసిన జట్టు డీఆర్‌ఎస్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కంకషన్ నిబంధనలో ఐసీసీ స్వల్ప మార్పు చేసింది. ఇప్పటి వరకు ఏ ఆటగాడి స్థానంలోనైనా కంకషన్‌ ప్లేయర్‌ వస్తే నేరుగా బౌలింగ్‌ లేదా బ్యాటింగ్‌ చేసే అవకాశం ఉంది. కానీ, ఇక నుంచి కంకషన్‌(Concussion Substitute Protocols)కు గురైన ఆటగాడు ఆ మ్యాచ్‌లో బౌలింగ్‌ నుంచి నిషేధానికి గురైతే సబ్‌స్టిట్యూట్‌గా వచ్చే వ్యక్తికి బౌలింగ్‌ చేసే అవకాశం ఉండదు. ఇప్పటి వరకు ఫుట్‌ నోబాల్‌ను థర్డ్‌ అంపైర్‌ ఇస్తున్నాడు. ఇక నుంచి దానితోపాటు అన్ని రకాల ఫుట్‌కు సంబంధించిన నో-బాల్స్‌ను థర్డ్‌ అంపైర్‌ చెక్‌ చేసి ఇవ్వాలి.  మైదానంలో గాయపడిన ఆటగాడికి వైద్యసాయం కోసం నాలుగు నిమిషాల వరకు సమయం కేటాయించింది.


ఇప్పటికే అమల్లోకి స్టాప్‌ క్లాక్‌ నిబంధన
అంతర్జాతీయ క్రికెట్‌లో మరింత వేగం పెంచేందుకు..అనవసరం సమయం వృథాను అరికట్టేందుకు అంతర్జాతీయ క్రికెట్‌ కమిటీ ఐసీసీ కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. స్టాప్‌ క్లాక్‌ నిబంధనను ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. దీని ప్రకారం ఒక ఓవర్‌ ముగిసిన తర్వాత 60 సెకన్లలోపు... అంటే ఒక నిమిషం లోపు మరో ఓవర్‌ తొలి బంతి వేసేందుకు బౌలర్‌ సిద్ధంగా ఉండాలని ఐసీసీ తెలిపింది. అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటే రెండు సార్లు హెచ్చరిస్తారు. మూడోసారి నుంచి ఫీల్డింగ్‌ జట్టుకు అయిదు పరుగుల జరిమానా విధిస్తారు. వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌ మధ్య టీ20 సిరీస్‌లో భాగంగా నేడు జరిగే తొలి మ్యాచ్‌ నుంచే ఈ స్టాప్‌ క్లాక్‌ నిబంధన ప్రయోగాత్మకంగా అమల్లోకి రానుంది. మరింత వేగంగా ఆట కొనసాగేలా చూసేందుకు ఈ నిబంధనను అమల్లోకి తెస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది.


అంతర్జాతీయ క్రికెట్లో ఆట వేగాన్ని పెంచేందుకు అవసరమైన అన్ని మార్గాలను పరిశీలిస్తూనే ఉంటామని ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 2022లో ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలు విజయవంతం కావడంతో ఇప్పుడు పరిమిత ఓవర్ల అంతర్జాతీయ క్రికెట్లో స్టాప్‌ క్లాక్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామని ఐసీసీ జనరల్‌ మేనేజర్‌ వసీం ఖాన్‌ వెల్లడించారు. ఈ ప్రయోగత్మక నిబంధనన అమలును పరిశీలించి... వచ్చే ఫలితాలను బట్టి అమలుపై నిర్ణయం తీసుకుంటామని ఐసీసీ ప్రకటించింది. భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో శ్రీలంక బ్యాటర్‌ ఏంజెలో మ్యాథ్యూస్‌ టైమ్డ్‌ అవుటైన తర్వాత... బౌలింగ్‌కు కూడా నిమిషం నిబంధన తెచ్చారు. తొలిసారిగా శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ ఏంజెలో మ్యాథ్యూస్‌ టైమ్డ్‌ అవుటయ్యాడు.