Ind vs Aus Semi Final: 14 ఏళ్లుగా ఆసీస్‌కు తిరుగులేదు, టీమిండియా ఈసారైనా ఆ రికార్డు బద్ధలు కొడుతుందా?
ICC Champions Trophy 2025 Semi Final: ఐసీసీ ఈవెంట్లలో నాకౌట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై గత 14 ఏళ్లుగా భారత్ ను విజయం దోబూచులాడుతోంది. చివరగా 2011లో ధోనీ కెప్టెన్సీలో భారత్ విజయం సాధించింది.

Champions Trophy 2025 : దుబాయ్ వేదికగా కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ జరుగుతోంది. రోహిత్ శర్మ మరోసారి టాస్ ఓడిపోయాడు. టాస్ నెగ్గిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మరోవైపు రోహిత్ శర్మ టాస్ ఓడటం వరుసగా ఇది 14వసారి. అయితే మేం ఓడేది టాస్ మాత్రమే, మ్యాచ్ కాదని హిట్ మ్యాన్ బదులిస్తున్నాడు. చూద్దాం నేటి మ్యాచ్‌లో ఏం జరగనుందో.
భారత్ మీద ఆసీస్ రికార్డు ఘనం..
ఆస్ట్రేలియా పేరిట ఓ రికార్డు ఉంది. ఆస్ట్రేలియా టీమ్ 14 ఏళ్లుగా ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో టీమిండియా చేతిలో ఓడిపోలేదు. మరి ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఈ రికార్డు ఈసారైనా బద్ధలు అవుతుందా లేదా కంటిన్యూ అవుతుందా అనే చర్చ అన్ని చోట్లా జరుగుతోంది. అయితే ఆస్ట్రేలియా ఐసీసీ (ICC) నాకౌట్ మ్యాచుల్లో భారత్ చేతిలో చివరిసారి 2011 వన్డే వరల్డ్ కప్ లో ఓడిపోయింది. అప్పుడు ధోనీ కెప్టెన్సీలో టీమిండియా సెమీస్ లో ఆసీస్ ను ఓడించి సగర్వంగా ఫైనల్ కు చేరుకుంది.
2015 వరల్డ్ కప్ లో ఆసీస్ చేతిలో సెమీస్ లో ఓడిపోయి టీమిండియా ఇంటి దారి పట్టింది. ఆ ఏడాది ఫైనల్లో కివీస్ పై నెగ్గి ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలిచింది. తిరిగి 2023 లో రెండు సార్లు టీమిండియా ఐసీసీ నాకౌట్ మ్యాచులు ఆడింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, ఇంకా వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్. ఈ రెండు సార్లు ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించి ట్రోఫీలు కొల్లగొట్టింది. ఈసారి మళ్లీ సెమీఫైనల్లో.. అదేనండీ మరో నాకౌట్ మ్యాచ్ లో ఈ రెండు టీమ్స్ తలపడ్డాయి. కనుక విజయం ఎవరిని వరిస్తుంది.. ఆస్ట్రేలియా రికార్డును కొనసాగిస్తుందా.. భారత్ ఆ ఫీవర్ నుంచి బయటపడి విజయం సాధిస్తుందా అని క్రికెట్ ఫ్యాన్స్ లో టెన్షన్ పెంచుతోంది.