ICC Awards 2023:ఐసీసీ ఏటా అందించే ప్రతిష్ఠాత్మక‌  టీ20 క్రికెట‌ర్ ఆఫ్ ఇది ఇయ‌ర్ 2023, మెన్స్‌ ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డులకు స్టార్ ఆట‌గాళ్లు నామినేట్ అవ్వడం ఆసక్తిని రేపుతోంది. ఈ రెండు అవార్డులకు ఇద్దరు భారత ఆటగాళ్లు పోటీ పడుతుండడం క్రికెట్‌ అభిమానుల్లో ఉత్సుకత కలిగిస్తోంది. మెన్స్‌ టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు నామినీస్‌ జాబితాలో విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌.. మెన్స్‌ ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు నామినీస్‌ జాబితాలో యశస్వి జైస్వాల్‌ ఉన్నారు. ప్రతిష్ఠాత్మక‌  టీ20 క్రికెట‌ర్ ఆఫ్ ఇది ఇయ‌ర్ 2023 కోసం టీ 20లో ప్రపంచ నెంబర్‌ వన్‌ ఆటగాడు సూర్యకుమార్ యాద‌వ్... జింబాబ్వే సార‌థి సికింద‌ర్ ర‌జా, న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్‌ మార్క్ చాప్‌మ‌న్, ఉగాండా సంచ‌ల‌నం అల్పేష్ ర‌మ్జానీ పోటీ పడుతున్నారు. 

అందరూ గట్టి పోటీదారులే

సూర్యకుమార్‌ యాదవ్‌ 2023లో ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. ఇటీవలే స‌ఫారీ గడ్డపై సెంచ‌రీతో ఈ ఫార్మాట్‌లో నాలుగో శ‌త‌కం ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది మొత్తం 17 ఇన్నింగ్స్‌ల్లో సూర్యా భాయ్‌ 155.95 స్ట్రైక్ రేటుతో 733 ర‌న్స్ కొట్టాడు. నిరుడు ఆఖ‌ర్లో జింబాబ్వే టీ20 సార‌థిగా ప‌గ్గాలు చేప‌ట్టిన సికింద‌ర్ ర‌జా ఆల్‌రౌండ్ షోతో ఆక‌ట్టుకున్నాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 155 ప‌రుగులు చేయ‌డ‌మే కాకుండా బంతితోనూ రాణించి 17 వికెట్లు కూల్చాడు. ఉంగాండా బౌల‌ర్ అల్పేష్ ర‌మ్జానీ 30 మ్యాచుల్లో 4.77 ఎకాన‌మీతో 55 వికెట్లు ప‌డ‌గొట్టాడు. కివీస్ బ్యాట‌ర్ చాప్‌మ‌న్ 2023లో అద్భుతంగా ఆడాడు. ఈ లెఫ్ట్ హ్యాండ‌ర్ 17 ఇన్నింగ్స్‌ల్లో 145.54 స్ట్రైక్ రేటుతో 556 ర‌న్స్ కొట్టాడు. మహిళల విభాగంలో  టీ20 క్రికెట‌ర్ ఆఫ్ ఇది ఇయ‌ర్ 2023 అవార్డు కోసం ఆస్ట్రేలియా యంగ్‌స్టర్ ఫొబె లిచ్‌ఫీల్డ్, బంగ్లాదేశ్ క్రికెట‌ర్ మ‌రుఫా అక్తర్‌, ఇంగ్లండ్ ప్లేయ‌ర్ లారెన్ బెల్, స్కాంట్లాండ్ అమ్మాయి డార్సే కార్టర్ పోటీ పడుతున్నారు.

 

జైస్వాల్‌ సాధిస్తాడా...

మెన్స్‌ ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023 అవార్డు రేసులో యశస్వితో పాటు న్యూజిలాండ్‌ ఆటగాడు రచిన్‌ రవీంద్ర, సౌతాఫ్రికా పేసర్‌ గెరాల్డ్‌ కొయెట్జీ, శ్రీలంక పేసర్‌ దిల్షన్‌ మధుషంక నిలిచారు. యశస్వి జైస్వాల్‌ 4 టెస్ట్‌లు, 15 టీ20ల్లో 2 సెంచరీలు, 4 హాఫ్‌ సెంచరీల సాయంతో 718 పరుగులు చేసి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ముందున్నాడు. 2023లో రచిన్‌ రవీంద్ర 10 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 2 హాఫ్‌ సెంచరీల సాయంతో 578 పరుగులు చేయడమే కాకుండా  7 వికెట్లు తీసి సత్తా చాటాడు.  గెరాల్డ్‌ కొయెట్జీ  8 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీయగా.. దిల్షన్‌ మధుషంక 9 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీశాడు. 

 

ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లోఅందరి కళ్లూ సూర్యకుమార్‌యాదవ్‌పైనే ఉన్నాయి. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. టీ20ల్లో అదరగొట్టేస్తున్న సూర్య.. వన్డేల్లో తడబాటుకు గురి కావడంపైనా స్పందించాడు. టీ20ల్లో క్రికెట్‌ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూసే ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్ అని... అతడొక విలక్షణ ప్లేయర్ అని నాజర్ హుస్సేన్‌ అన్నాడు. టీ20ల్లో మాత్రం ప్రతిసారి అతడి ఇన్నింగ్స్‌ అద్భుతమే. టీ 20ల్లో సూర్య బ్యాటింగ్‌ చూడటం మజాగా అనిపిస్తుందని... వచ్చే టీ20 ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసే ఆటగాడిగా సూర్య నిలుస్తాడని భావిస్తున్నాని హుస్సేన్ విశ్లేషించాడు.