Srikanth:  ఈ ఏడాది అక్టోబర్- నవంబర్ నెలల్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. స్వదేశంలో జరిగే ఈ మెగా టోర్నీ కోసం బీసీసీఐ ఇప్పటినుంచే సన్నాహకాలు ప్రారంభించింది. అప్పటికి జట్టును తయారు చేసే ప్రక్రియను చేపట్టంది. వన్డే ప్రపంచకప్ కోసం 20 మంది ఆటగాళ్లతో ప్రాబబుల్స్ ను ఎంపికచేసి వారికి స్థిరమైన అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించింది. గతవారం దీనిపై బీసీసీఐ ప్రకటన కూాడా చేసింది. అప్పటినుంచి చాలామంది అభిమానులు, మాజీ క్రికెటర్లు ఆ 20 మందిలో ఉండే ఆటగాళ్లను తమకు నచ్చిన విధంగా సెలెక్ట్ చేస్తున్నారు. తాజాగా భారత మాజీ సెలెక్టర్, 1983 ప్రపంచకప్ విజేత జట్టులోని ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా దీనిపై స్పందించాడు. 


వారిద్దరూ నాకొద్దు


తన 20 మంది ఆటగాళ్ల జాబితాలో ఇద్దరి పేర్లు ఉండవని శ్రీకాంత్ స్టార్ స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ అన్నాడు. 'ఇద్దరు ఆటగాళ్లు నా లిస్ట్ లో ఉండరు. వారు శుభ్ మన్ గిల్, శార్దూల్ ఠాకూర్.' అని శ్రీకాంత్ తెలిపాడు. గతేడాది రోహిత్ శర్మ వన్డే జట్టు నుంచి విశ్రాంతి తీసుకున్నప్పుడు శుభ్ మన్ జట్టులో భాగమయ్యాడు. గత నెలలో బంగ్లాదేశ్ తో సిరీస్ కు రోహిత్ తిరిగి వచ్చినప్పుడు గిల్ కు జట్టులో చోటు దక్కలేదు. అయితే శ్రీలంకతో స్వదేశంలో ప్రస్తుతం జరగబోయే వన్డే సిరీస్ కు శిఖర్ ధావన్ దూరమవటంతో గిల్ కు స్థానం లభించింది. అలాగే శార్దూల్ ఠాకూర్ బంగ్లాతో వన్డేలు ఆడాడు. అయితే అతనికి శ్రీలంకతో సిరీస్ కు జట్టులో చోటు దక్కలేదు. 


పదిలో 3 చాలు


తన 20 మంది ప్రాబబుల్స్ గురించి శ్రీకాంత్ మరింత వివరించారు. జట్టులో ప్రభావం చూపే ఆటగాళ్ల గురించి నొక్కి చెప్పారు. 'నా మీడియం పేసర్ల కోటాలో జస్ప్రీత్ బుమ్రా, ఉమ్రాన్ మాలిక్, అర్హదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ ఉంటారు. నలుగురు ఫాస్ట్ బౌలర్లు సరిపోతారు. నేను ఒక సెలక్షన్ ఛైర్మన్ గా మాట్లాడుతున్నాను. అభిమానిగా కాదు. ఇంకో ఆల్ రౌండర్ ఆప్షన్ గా దీపక్ హుడాను ఎంచుకుంటాను. వీరు మ్యాచ్ లు గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను. మనకు గెలుపు గుర్రాలు కావాలి. వీరు ఆ పని చేయగలరు' అని శ్రీకాంత్ వివరించారు. 'హుడా లాంటి వాళ్లు 10 మ్యాచుల్లో మూడింటిని గెలిపించినా చాలు. వీరి నుంచి నిలకడను ఆశించకూడదు. ప్రస్తుత టైంలో రిషభ్ పంత్ అలాంటి ఆటగాడే. అతడి నుంచి నాకు నిలకడ అవసరంలేదు. నేను మ్యాచ్ లు గెలవాలనుకుంటున్నాను. పంత్ ఆ పని చేస్తాడు' అని శ్రీకాంత్ స్పష్టంచేశారు.