Ind Vs Eng 2nd Test Latest Updates: బుధవారం నుంచి బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతోంది. తొలి టెస్టులో ఐదు వికెట్లతో గెలుపొందిన ఇంగ్లాండ్ 1-0తో ఆధిక్యంలో ఉంది. దీంతో ఈ రెండో టెస్టులో నెగ్గి సిరీస్ సమం చేయాలని టీమిండియా భావిస్తోంది. అయితే ఈ టెస్టుకు స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండేది లేనిది మిలియన్ డాలర్ క్వశ్చన్ గా మారింది. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా తనను కేవలం ఈ సిరీస్ లో మూడు టెస్టుల్లో మాత్రమే ఆడించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. అయితే ఇప్పటికే తొలి టెస్టు ఆడిన బుమ్రా.. అందులో ఐదు వికెట్లతో రాణించాడు. అయితే రెండో టెస్టులో తను ఆడేది లేనిది అనుమానంగా మారింది. తాజాగా దీనిపై భారత టెస్టు కెప్టెన్ శుభమాన్ గిల్ స్పష్టత నిచ్చాడు. ప్రస్తుతం బుమ్రా ట్రైనింగ్ సెషన్లో పాల్గొంటున్నాడని, అయితే అతడిని రెండో టెస్టులో ఆడించడంపై నిర్ణయం ప్రాక్టీస్ సెషన్ ముగిశాక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించాడు. ఇక తొలి టెస్టులో ఐదు వికెట్లతో బుమ్రా రాణించగా, రెండో ఇన్నింగ్స్ లో వికెట్లేమీ తీసుకోలేదు.
అందుబాటులో..అయితే బుమ్రా రెండో టెస్టుకి సెలెక్షన్ కు అందుబాటులో ఉన్నాడని టీమిండియా సహాయక కోచ్ ర్యాన్ టెన్ డస్కటే తెలిపాడు. బుమ్రా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటున్నాడని, అయితే రెండో టెస్టులో ఆడించడం అనేది టీమిండియా మేనేజమెంట్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. ఏదేమైనా బుమ్రా ఈ మ్యాచ్ లో ఆడితే బాగుంటుందనేది భారత అభిమానుల కోరిక. తను ఉంటే టీమిండియా బౌలింగ్ లైనప్ పటిష్టంగా ఉంటుందని పేర్కొంటున్నారు..
వర్క్ లోడ్ మేనేజ్మెంట్..బుమ్రా గురించి వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అమలు చేస్తామని ఈ సిరీస్ కు ముందు భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ ప్రకటించాడు. తను కేవలం మూడు టెస్టుల్లో మాత్రమే ఆడతాడని, అవేంటనేవీ సిరిస్ స్థితి, బుమ్రా అందుబాటులో ఉండటంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. మరోవైపు బుమ్రాను ఐదు మ్యాచ్ ల్లో ఆడించాలని అటు మాజీ క్రికెటర్లు, ఇటు భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఏదేమైనా బుధవారం టాస్ వేశాక మాత్రమే, టీమిండియాప్లేయింగ్ లెవన్ పై అంచనాకొచ్చే అవకాశముంది.అలాగే రెండో టెస్టులో పలు మార్పులు జరిగే అవకాశం కుడా ఉంది. ఇక ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇంగ్లాండ్ తమ ప్లేయింగ్ లెవన్ ను ప్రకటించింది. తొలి టెస్టులో ఆడిన జట్టుతోనే ఈ మ్యాచ్ లోనూ బరిలోకి దిగుతోంది. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అందుబాటులో ఉన్నప్పటికీ, అతనికి తుది జట్టులో చోటు కల్పించకుండా, పాత పేసర్లతోనే ఆడుతోంది.