Ind vs Eng 3rd Test Live Updates | లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు తమ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌట్ కావడంతో ఉత్కంఠ నెలకొంది. రెండో ఇన్నింగ్స్ లో చేసే పరుగులపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ అద్భుతమైన బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది. 43 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కీలకమైన రూట్ (40) వికెట్ వాషింగ్టన్ సుందర్ పడగొట్టాడు. దాంతో భారత జట్టులో ఆశలు చిగురిస్తున్నాయి. ఇంగ్లాండ్‌ను ఎన్ని పరుగులకు ఆలౌట్ చేస్తుందో వేచి చూడాలి. లార్డ్స్‌లో ఇప్పటివరకు సాధించిన అత్యధిక స్కోర్, ఛేజింగ్ స్కోర్లను ఒకసారి చూద్దాం.
లార్డ్స్‌లో భారత్ అత్యధిక స్కోర్
లార్డ్స్ మైదానంలో భారత జట్టు ఛేదించిన అత్యధిక స్కోరు 136 పరుగులు మాత్రమే. 1986లో టీమీండియా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ స్కోరును ఛేదించింది. ఆ మ్యాచ్‌లో దిలీప్ వెంగ్‌సర్కార్ 126 పరుగులు చేశారు. ఆ తర్వాత లార్డ్స్‌లో భారత్ 2 టెస్ట్ మ్యాచ్‌లు గెలిచింది, అయితే ఆ రెండు విజయాలు టార్గెట్ డిఫెండ్ చేసుకునే క్రమంలో వచ్చాయి. 2014లో ఇషాంత్ శర్మ అద్భుతమైన బౌలింగ్‌తో భారత్ విజయం సాధించింది. 2021లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ ఇండియా మరోసారి ఇంగ్లీష్ జట్టును ఓడించింది.
లార్డ్స్‌లో అత్యధిక స్కోర్
లార్డ్స్ మైదానంలో అత్యధిక స్కోరును ఛేదించిన రికార్డు వెస్టిండీస్ జట్టు పేరిట ఉంది. 1984లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 344 పరుగుల లక్ష్యాన్ని విండీస్ టీమ్ ఛేదించింది. ఈ మైదానంలో 300 లేదా అంతకంటే ఎక్కువ పరుగులతో ఛేజింగ్ చేసిన ఏకైక జట్టు వెస్టిండీస్. ఆ తర్వాత ఇంగ్లాండ్ 2004లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. 2025 WTC ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 282 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా విజయవంతంగా సాధించింది.
- వెస్టిండీస్ - 344 పరుగులు vs ఇంగ్లాండ్ (1984)
- ఇంగ్లాండ్ - 282 పరుగులు vs న్యూజిలాండ్ (2004)
- దక్షిణాఫ్రికా - 282 పరుగులు vs ఆస్ట్రేలియా (2025)
- ఇంగ్లాండ్ - 279 పరుగులు vs న్యూజిలాండ్ (2022)
- ఇంగ్లాండ్ - 218 పరుగులు vs న్యూజిలాండ్ (1965)