Highest Paid Cricketers:  విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాలు.. ప్రస్తుతం టీమిండియా క్రికెట్ లో టాప్ పొజిషన్ లో ఉన్న ఆటగాళ్లు. వారి ఆటతో ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తుంటారు. వీరికి బయటే కాదు.. సోషల్ మీడియా ఖాతాల్లోనూ కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే సంపాదనలోనూ వీరు అందరికంటే ముందే ఉన్నారు. ముఖ్యంగా వాణిజ్య ప్రకటనల ద్వారా వీరు బాగా సంపాదిస్తున్నారు. 


సినిమా సెలబ్రిటీలకు ఏమాత్రం తీసిపోకుండా టీమిండియా క్రికెటర్లు వాణిజ్య ప్రకటనల ద్వారా అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. కింగ్ కోహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్, పేసు గుర్రం బుమ్రాలు ఈ ఆర్జనలో ముందు వరుసలో ఉన్నారు. వీరికి ఆటలో ఉన్న ఆకర్షణ, సామాజిక మాధ్యమాల్లో ఉన్న ఫాలోయింగ్ తో వీరికి ప్రకటనలు క్యూ కడుతున్నాయి. 


కోట్లలో ఆదాయం


విరాట్ కోహ్లీ... ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. ఆటలో అతడెన్ని శిఖరాలు అధిరోహించాడో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలోనూ కోహ్లీ యాక్టివ్ గా ఉంటాడు. వాణిజ్య ప్రకటనల ఆర్జనలోనూ విరాట్ ముందే ఉన్నాడు. బాలీవుడ్ నటి అనుష్క శర్మను వివాహమాడాక.. వీరిద్దరూ జంటగానూ ప్రకటనలు చేస్తున్నారు. ప్రస్తుతం కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ ఖాతాను 230 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఏటా కోహ్లీ ప్రకటనల ద్వారా రూ. 256 కోట్ల 52 లక్షల వరకు సంపాదిస్తున్నాడని నివేదికలు చెప్తున్నాయి. 


కోహ్లీ తర్వాత ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. వాణిజ్య ప్రకటనల ద్వారా హిట్ మ్యాన్ ఏటా రూ. 74 కోట్ల 47 లక్షలు సంపాదిస్తున్నాడట. ఇక ఆ తర్వాత భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. ఈ టీమిండియా బౌలర్ ప్రకటనల ద్వారా ఏటా రూ. 57 కోట్ల 92 లక్షలు సంపాదిస్తున్నాడు. 


మరోవైపు ఏటా బీసీసీఐ దాదాపు 2 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఏటా ఆర్జిస్తోంది. ప్రపంచ క్రికెట్‌కు దిశానిర్దేశం చేసే ఐసీసీ బోర్డు ఆదాయంలో బీసీసీఐ వాటా 80 శాతం ఏటా ఉంది.