Team India News: గతేడాది నుంచి భారత్ టెస్టుల్లో అధ్వానమైన ప్రదర్శన చేస్తుండటంతో బీసీసీఐ ఇప్పటికే నష్ట నివారణ చర్యలకు దిగింది. ఆటగాళ్లకు కల్పిస్తున్న సౌకర్యాలకు కత్తెర వేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విదేశీ టూర్ 45 రోజులు ఉన్నప్పుడు కేవలం రెండు వారాల వరకు మాత్రమే క్రికెటర్ల భార్యలను వాళ్లతోపాటు అలో చేయాలని నిర్ణయించింది. అలాగే అంతకంటే తక్కువైతే ఆ వ్యవధిని వారానికి కుదించింది. ఇక ఒంటరి ప్రయాణాలకు, లగేజీకి సంబంధించి వివిధ మార్పులను తీసుకొచ్చింది. అలాగే ఆటగాళ్ల వేతనాలపై కోత కూడా విధించాలని నిర్ణయించినట్లు కథనాలు వచ్చాయి. తాజాగా దీనిపై దిగ్గజ కామెంటేటర్ హర్షా బోగ్లే స్పందించాడు. బీసీసీఐ పలు మార్పులు చేస్తున్నట్లు ప్రచారమైతే జరుగుతోందని, అది ఎంతవరకు నిజమో తనకు తెలియదని పేర్కొన్నాడు. అయితే తాను మాత్రం ఒక రూల్‌ను కచ్చితంగా పొందుపరచాలని చూస్తానని, దీని ద్వారా కచ్చితంగా మేలు జరుగుతందనే అర్థంలో సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దీంతో ఈ పోస్టు వైరలైంది. ఇండియన్ ఫ్యాన్స్ ఈ పోస్టుకు మద్దతుగా లైకులు, కామెంట్లు చేస్తూ షేర్ చేస్తున్నారు.
ఆ వెసులుబాటు తీసెయ్యాలి..
ఇంతకీ హర్ష ఏం సూచించాడంటే.. ఆటగాళ్లకు వ్యక్తిగత పర్సనల్ రిలేషన్ పేజీలను తీసేయ్యాలని సూచించాడు. దీని ద్వారా మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అతని అభిప్రాయంగా కనిపిస్తోంది. మరి బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. 2019 వరకు విదేశీ టూర్లకు వెళ్లినప్పుడు ప్లేయర్లు, తమ భార్యలను వెంట తీసుకెళ్లేందుకు కొన్ని ఆంక్షలు ఉండేవి. కొన్ని రోజుల పాటే ప్లేయర్లతో వాళ్లు గడిపేందుకు అవకాశముండేది. కోహ్లీ కెప్టెన్సీలో బీసీసీఐ ఈ నియంత్రణను ఎత్తి వేసింది. ఇక ఇటీవల సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్‌తో టెస్టు సిరీస్ కోల్పోవడం, అలాగే ఆసీస్ టూర్లో 1-3తో టెస్టు సిరీస్ ఓడిపోయి, పదేళ్ల తర్వాత బోర్డర్-గావస్కర్ ట్రోఫీని కోల్పోవడం, దీని కారణంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసు నుంచి టీమిండియా నిష్క్రమించడంపై బోర్డు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్టోంది. దీంతో ఆటగాళ్లకు అందించే అదనపు సౌకర్యాలు, మినహాయింపులపై కోత విధించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇకపై విదేశీ టూర్లకు వెళ్తే, తమ భార్యలను రెండు వారాల కంటే ఎక్కువగా తమతో పాటు గడపడానికి వీళ్లేని నిబంధనతో ఆటగాళ్ల ఏకాగ్రత పెరుగుతుందని బోర్డు భావిస్తోంది. అలాగే విమానాల్లో వెళ్లేటప్పుడు 150 కేజీల కంటే అదనంగా ఉండే సరుకుకు ఆటగాళ్లే పే చేసేలా నిబంధనను పునరుద్ధరించింది.
గంభీర్ మేనేజర్‌పైనా ఆంక్షలు..
గంభీర్ మేనేజర్.. గౌరవ్ ఆరోరాపై ఆంక్షలు విధించింది. ఆటగాళ్లతోపాటు అదే హోటల్లో ఉండేందుకు వీల్లేదని తెలిపింది. స్టేడియంలో వీఐపీ బాక్సులో కూర్చునేందుకు అనుమతిని నిరాకరించింది. అలాగే టీమ్ బస్సులో ప్రయాణించేటప్పుడు అతనికి అనుమతిని రద్దు చేయడంతో పాటు టీమ్ బస్సు వెనకాల వచ్చే సదుపాయాన్ని కూడా రద్దు చేసింది. అలాగే ఆటగాళ్లు కూడా అందరూ విధిగా టీమ్ బస్సులోనే ప్రయాణించాలని, ఒంటరి ప్రయాణాలకు మంగళం పాడిందని తెలుస్తోంది.
అలాగే జట్టులో సహాయక సిబ్బందిని కూడా మూడేళ్ల కాలపరిమితికే పరిమితం చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు జట్టులో సహాయక సిబ్బంది చాలా ఏళ్ల పాటు జట్టుతో ప్రయాణం చేస్తున్నారు. దీని వల్ల ఒకరకమైన అలసత్వం టీమ్‌లో చేరిందని, దీనికి పరిష్కారంగా మూడేళ్ల నిబంధన రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక టెస్టు జట్టు కెప్టెన్ ఎంపికను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం. వచ్చే జూన్‌లో ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ జరుగుతుండటంతో అప్పటిలోగా టెస్టు కెప్టెన్‌ను నియమించాలని బోర్డు ఆలోచనగా తెలుస్తోంది. ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వరకు సీనియర్లు కోహ్లీ, రోహిత్‌ల ప్రదర్శనను చూసి, ఆ తర్వాత వాళ్ల మనుగడపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు పదర్శనను బట్టి ఆటగాళ్ల వేరియబుల్ పే చెల్లించాలని తెలుస్తోంది. ఏదేమైనా మున్ముందు ఆటగాళ్లకు కాస్త కష్టంగా గడవనుందని తెలుస్తోంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ తర్వాత గంభీర్ పదవీకాలంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.