IND VS AFG, Big Stars Prepare For Afghanistan T20 Series:  ఈ నెల చివర్లో అఫ్గానిస్తాన్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌తో భారత జట్టులోని కీలక స్టార్ ఆటగాళ్లు తిరిగి మైదానంలోకి దిగడానికి రెడీ అవుతున్నారు. స్టార్ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి పూర్తి ఫిట్‌నెస్ సాధించగా, స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా పునరాగమనానికి లైన్ క్లియర్ చేసుకున్నాడు. ఐపీఎల్ వరకు సాగే ద్వైపాక్షిక సిరీస్‌ల పరంపర ఈ హోమ్ అసైన్‌మెంట్‌తోనే ప్రారంభం అవ‌నుంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) లో హార్దిక్, నితీష్ రెడ్డి గత కొంతకాలంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ వారం సుందర్ కూడా సీవోఈలో ఫిట్‌నెస్ నిరూపించుకుని సెలెక్షన్‌కు అందుబాటులోకి వ‌చ్చాడు.

Continues below advertisement

Continues below advertisement

స‌రైన సిరీస్..గాయాల నుంచి కోలుకుంటున్న ఆటగాళ్లు నేరుగా మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించేందుకు ఈ సిరీస్ సరైన వేదికగా మారనుందని తెలుస్తోంది. "అఫ్గానిస్తాన్‌తో టీ20 మ్యాచ్‌ల ద్వారా వాషింగ్టన్ సుందర్ తిరిగి జట్టులోకి రావడం ప్రాక్టికల్ టార్గెట్. గత కొద్ది వారాల్లో అతడి వర్క్‌లోడ్ క్రమంగా పెరిగింది, మూడు టీ20ల సెలెక్షన్‌కు అతడు అందుబాటులో ఉంటాడు. హార్దిక్ పాండ్యా, నితీష్ రెడ్డి కూడా వ్యక్తిగత పనుల విరామాలు మినహా నిరంతరం సీవోఈలోనే ప్రాక్టీస్ చేస్తున్నారు" అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

బుమ్రాపై ఫోకస్..శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా సీవోఈలోనే ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఏడాది చివర్లో న్యూజిలాండ్‌తో జరిగే రెండు టెస్టుల సమయానికి బుమ్రా పూర్తి ఫామ్‌లోకి రావాలని బీసీసీఐ ఆలోచ‌న‌గా ఉన్నట్లు తెలుస్తోంది. "మోకాలి గాయం తర్వాత బుమ్రాను నేరుగా లాంగర్ ఫార్మాట్ బదులు షార్టర్ ఫార్మాట్ ద్వారా నెమ్మదిగా మ్యాచ్‌ల్లోకి తీసుకురావాలని మేనేజ్‌మెంట్ ప్లాన్ చేస్తోంది. అఫ్గాన్ సిరీస్ సమయానికి కాస్త రిస్క్ అయినప్పటికీ, ఎలాంటి కొత్త సమస్యలు రాకపోతే జపాన్‌లో జరిగే ఏషియన్ గేమ్స్‌లో అతడు బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి" అని బోర్గు వ‌ర్గాలు పేర్కొన్నాయి.

కృనాల్ రీ ఎంట్రీ..ఇంగ్లాండ్, ఐర్లాండ్ టూర్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ 7 మ్యాచ్‌లలో కేవలం 4 వికెట్లు మాత్రమే తీసి తుస్సు మ‌నిపించాడు. ఈ క్రమంలో సీనియర్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా పేరును కూడా సెలెక్టర్లు పరిశీలిస్తున్నారు. జూలై 2021 లో చివరిసారిగా భారత్ తరఫున ఆడిన కృనాల్, దేశవాళీ ప్రదర్శనలతో మళ్లీ రేసులోకి వచ్చిన‌ట్లు తెలుస్తోంది.