ODI World Cup 2023: పుష్కరకాలం తర్వాత భారత్‌లో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఆడుతున్న భారత క్రికెట్ జట్టు.. మంగళవారం  ఈ మెగా టోర్నీలో  పాల్గొనబోయే గెలుపు గుర్రాలను ఎంపికచేసింది.  15 మందితో కూడిన ఈ జట్టు ముందుగా ఊహించిందే అయినా  పలువురు కీలక ఆటగాళ్లు మిస్ అవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.    ముఖ్యంగా టీమిండియా స్టార్ స్పిన్నర్  యుజ్వేంద్ర చాహల్‌కు  టీమ్‌లో చోటు దక్కకపోవడం మాజీ క్రికెటర్లను విస్మయానికి గురిచేసింది.   ఇదే విషయమై  భారత మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, ఆకాశ్ చోప్రాలు  స్పందించారు. 


క్యాండీ (శ్రీలంక)లో   టీమిండియా సారథి రోహిత్ శర్మ, సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్‌లు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో  15 మంది సభ్యులు గల  టీమ్‌ను ప్రకటించిన తర్వాత  హర్భజన్ సింగ్ ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందిస్తూ.. చాహల్ పేరు లేకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొన్నాడు. ‘ప్రపంచకప్ జట్టులో   యుజ్వేంద్ర చాహల్ లేకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది.  అతడు ప్యూర్ మ్యాచ్ విన్నర్’ అని  రాసుకొచ్చాడు. 


 






మూడేండ్లుగా ఇదే క(వ్య)థ.. 


చాహల్‌కు ఐసీసీ ట్రోఫీలలో షాకులు తాకడం ఇదే కొత్తకాదు.  గతేడాది ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో  కూడా  సెలక్టర్లు చాహల్‌కు మొండిచేయి చూపించారు.  2021లో దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లోనూ ఇదే పరిస్థితి.  దీంతో చాహల్ ద్వైపాక్షిక సిరీస్‌లకు మాత్రమే పరిమితమయ్యాడు.  2021లో వరుణ్ చక్రవర్తి, అశ్విన్‌లు  చాహల్ ఆశలకు గండికొట్టగా  2022లో అశ్విన్, అక్షర్ పటేల్‌లు అతడి ఆశలపై నీళ్లు చల్లారు. ఈ ఏడాది కుల్‌దీప్ యాదవ్ తో పాటు  అక్షర్ పటేల్‌లు చాహల్ ఉద్వాసనకు కారణమయ్యారని చెప్పక తప్పదు. 


బ్యాటింగ్‌లో లోతే ముఖ్యమా..? 


చాహల్‌ను వరల్డ్ కప్ టీమ్‌లో ఎంపిక చేయకపోవడంపై  మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా ఘాటుగా స్పందించాడు. అక్షర్ పటేల్ స్థానంలో చాహల్‌ను తీసుకుంటే బాగుండేదని చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో అన్నాడు.  ‘అక్షర్, చాహల్ మధ్య తీవ్ర పోటీ  తలెత్తింది.  బ్యాటింగ్‌లో డెప్త్ కోసం (అక్షర్ బ్యాటింగ్ కూడా చేయగలడు)  చాహల్‌ను కాదని అక్షర్‌ను ఎంపిక చేసినా  ఒకవేళ మీకు ఆ అవసరమే లేకుంటే ఏం చేస్తారు..?  బౌలర్లను కూడా బ్యాటింగ్ చేయగలరా..? లేదా..? అనే బేసిస్‌లోనే తీసుకున్నారా..?’ అని  చోప్రా ప్రశ్నించాడు.   బ్యాటింగ్‌లో లోతు ముఖ్యం అయితే టీమిండియాకు ఏడో స్థానం వరకూ బ్యాటింగ్ చేసేవాళ్లు ఉన్నారని అన్నాడు.  బ్యాటింగ్‌ తో పాటు బౌలింగ్ లో కూడా డెప్త్ ముఖ్యమని   చోప్రా అభిప్రాయపడ్డాడు. 


 






వన్డే వరల్డ్ కప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ,  శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్ధిక్  పాండ్యా (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్,  రవీంద్ర జడేజా,  శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్


























ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial