Hanuma Vihari Vs Andhra Cricket Association: ఓవైపు టీమిండియా క్రికెటర్ హనుమ విహారి(Hanuma Vihari)కి జరిగిన అన్యాయంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతూ, అతడికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండగా.. ఏసీఏ(ACA) మాత్రం ఈ వ్యవహారంపై బాధితుడైన విహారి  మీదే విచారణకు సిద్ధమైంది. ఇదే సమయంలో విహారి ఆరోపణలపై వివరణ ఇచ్చింది. విహారి జాతీయ క్రికెట్ జట్టుకు పరిశీలనలో ఉన్న ఆటగాడు కావడంతో... రంజీ(Ranji) సీజన్ మొత్తం ఆయన అందుబాటులో ఉండటం కష్టమవుతోందని..ఆయనకు బదులు మరొకరిని కెప్టెన్‌గా నియమించాలని సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ నుంచి మాకు ఈమెయిల్ వచ్చిందని.. అందుకే కెప్టెన్‌గా  తొలగించామని ఏసీఏ తెలిపింది. ఇక ఇతర రాష్ట్ర జట్లకు ఆడటం కోసం విహారి తరచూ నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ అడుగుతాడని, ఆ వెంటనే మనసు మార్చుకుంటాడని కూడా ఆరోపించింది. 


అయితే ఈ విషయంపై విహారి ట్విటర్ లో స్పందించాడు, తనపై వచ్చిన ఆరోపనలన్నీ కట్టుకథలే అన్నాడు. ఎప్పుడైతే తననే కెప్టెన్‌గా కొనసాగించాలని జట్టులోని ఆటగాళ్లంతా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు రాసిన  లేఖ  బయటకు వచ్చిందో  వెంటనే  ఏసీఏ నుంచి సపోర్ట్ స్టాఫ్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని, వారందర్నీ తనకు వ్యతిరేకంగా మాట్లాడేలా ఒత్తిడి చేస్తున్నారని,  తనపై అబద్ధాలు చెప్పించే ప్రయత్నం జరుగుతుందన్నాడు. 


అసలేం జరిగిందంటే ..


భవిష్యత్తులో ఆంధ్ర క్రికెట్‌ జట్టు తరఫున ఆడబోనని సీనియర్‌ బ్యాటర్ హనుమ విహారి తెలిపారు. ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట ఉండలేనని సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.  మధ్యప్రదేశ్‌తో క్వార్టర్‌ ఫైనల్‌లో నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయిన అనంతరం విహారి ఈ నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఒక రాజకీయ నాయకుడి కుమారుడి కోసం తనను కెప్టెన్‌ నుంచి తప్పించినా జట్టు పట్ల, ఆట పట్ల ప్రేమతో ఇన్నాళ్లు ఆటను కొనసాగించానని పేర్కొన్నారు. ఇకపై ఆంధ్ర తరఫున ఆడబోనని తేల్చిచెప్పారు. రంజీ మ్యాచ్‌లో భాగంగా బెంగాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 17వ ఆటగాడిపై అరిచానని తెలిపారు. ఆ ఆటగాడు రాజకీయ నాయకుడైన తన తండ్రికి చెప్పడంతో ఆయన తనపైనా చర్యలు తీసుకోవాలని ACAపై ఒత్తిడి తీసుకొచ్చారని వెల్లడించారు. తన వైపున తప్పు లేకపోయినా కెప్టెన్‌ నుంచి తప్పించారని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా సదరు ఆటగాడిని తాను ఏమి అనలేదని వివరించారు. గతేడాది మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కుడి చేతికి గాయమైనా జట్టు కోసం ఎడమ చేతితోనే బ్యాటింగ్‌ చేశానని గుర్తు చేశారు. అంతే కాదు ఈ విషయం తనతో పాటూ ఉన్న ప్లేయర్ అందరికీ తెలుసు అంటూ వారి సంతకాలు ఉన్న పేపర్ కూడా పోస్ట్ చేశాడు. 


 ఈ పోస్ట్ అతి తక్కువ సమయంలోనే వైరల్ గా మారడంతో ఈ విషయంపై  ఇన్‌స్టాలోనే పృథ్వీ రాజ్ అనే మరో క్రికెటర్  కౌంటర్ పెట్టాడు.    ‘మీరు ఆ కామెంట్ బాక్స్‌లో వెతుకుతున్న ఆ ప్లేయర్‌ ను నేనే. మీరు విన్నదంతా అబద్దం. గేమ్ కంటే ఎవరూ పెద్దవారు కాదు. ఆట నా ఆత్మగౌరవం కంటే పెద్దదేమీ లేదు. వ్యక్తిగత దాడులు, నిందాపూర్వక భాష అది ఇక్కడే కాదు ఏ వేదికమీదనైనా అంగీకారయోగ్యం కాదు. ఆ రోజు ఏం జరిగిందో జట్టులోని ప్రతి ఒక్కరికీ తెలుసు. నువ్వు ఇంతకు మించి ఏమీ పీకలేవు మిస్టర్ సో కాల్డ్ చాంపియన్’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అంతే కాదు ‘ఒక వేళ నీవు కావాలనుకుంటే ఈ సింపథీ గేమ్ ఆడుకో’ అని రాశాడు. ఇంతకీ  పృధ్వీరాజ్  ఇంకా ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేయలేదు.