Indian Cricket Team Head Coach : ఇండియన్  క్రికెట్ టీమ్ హెడ్  కోచ్ పదవికి భారత జట్టు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎంపిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ పదవికి  మరో వెటరన్ ఆటగాడు WV రమణ్‌తో కలిసి పోటీ పడుతోన్న గంభీర్ బుధవారం మొదటి రౌండ్ ఇంటర్వ్యూ  పూర్తి చేసుకున్నాడు. 


భారత జట్టు హెడ్ కోచ్ పదవికి  ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ  ఓపెనర్ గౌతమ్ గంభీర్ పేరు దాదాపు ఖరారైనట్లు వార్తలొస్తున్నాయి.  ఈ పదవికి గంభీర్ ఒక్కడే గట్టి పోటీదారుడిగా ఉన్నాడని, ఆయన పేరుని ప్రకటించడమొక్కటే మిగిలి ఉందని  బీసీసీఐ వర్గాల భోగట్టా.  ప్రస్తుతానికి భారత్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ఈ ప్రపంచ కప్ తో ముగుస్తుండటంతో జూలై నెల నుంచి భారత క్రికెట్ జట్టును కొత్త కోచ్ లీడ్ చేయనున్నారు. 


గంభీర్, WV రమణ్‌లను క్రికెట్ అడ్వయిజరీ కమిటీ (సీఏసీ) బుధవారం ఇంటర్వ్యూ చేసింది. జూమ్ మీటింగుల ద్వారా ఈ ఇంటర్వ్యూలు జరిగాయి. సీఏసీ హెడ్ అశోక్ మల్హోత్రా కు గంభీర్, రమణ్ లు తమ తమ ప్రజెంటేషన్లు సమర్పించారు. ‘‘బుధవారం గంభీర్ రమణ్ లను సీఏసీ ఇంటర్వ్యూ చేసింది. ఒక రౌండ్ చర్చలు జరిగాయి. గురువారం మరో రౌండ్ జరుగనుంది’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 


‘‘గంభీర్ తర్వాత రమణ్ కూడా ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యారు. ఆయన కూడా టీమ్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అన్న శంపై తన రోడ్ మ్యాప్, విజన్ తో కూడా ప్రెజంటేషన్ ఇచ్చారు.  ఈ ప్రెజంటేషన్ కూడా చాలా బాగుండింది.  దాదాపు 40 నిమిషాల పాటు ఈ ఇంటర్వ్యూ జరిగింది. ఆ ప్రజెంటేషన్ ని చూసే ముందు క్రికెట్ అడ్వయిజరీ కమిటీ రమణ్ ని కొన్న ప్రశ్నలు అడిగింది’’ అని పేర్కొన్నాయి. 


సీఏసీ ఛైర్మన్ మల్హోత్రా, కమిటీ సభ్యులు జతిన్ పరాంజ్‌పే, సులక్షణా నాయక్ లతో వీరికి జరిగిన పూర్తి చర్చల వివరాలు ఇప్పటి వరకూ పూర్తి స్థాయిలో తెలియకపోయినా గంభీర్ కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.  రానున్న మూడేళ్లలో భారత జట్టుని ఎలా ముందుకు తీసుకెళ్తారన్న విషయంపై ఈ చర్చ నడిచినట్లు తెలుస్తుంది.  ఈ రోజు బీసీసీఐ అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. బీసీసీఐ కార్యదర్శి జై షా సెలక్షన్ కమిటీతో మాట్లాడిన తరువాత కోచ్ ఎవరనే విషయం ఖరారవుతుంది. గంభీర్ ఎన్నిక లాంఛనమేనన్న వాదన గట్టిగా వినిపిస్తోంది.  రెండు రోజుల క్రితమే గంభీర్ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ని కలిసి తాజా ఎన్నికల్లో విజయం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. 


గంభీరే కరెక్టు.. 


ఈ పదవికి ఇప్పటి వరకూ పోటీ పడిన వాళ్లలో గౌతమ్ గంభీరే చాలా బలమైన క్యాండిడేట్ గా ముందునుంచి అనుకుంటున్నారు. అలాగే చివరి దశలో రమణ్ తో పోలిస్తే గంభీర్ చాలా అంశాల్లో ముందంజలో ఉన్నాడు. గంబీర్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.  ఈ సారి ఐపీఎల్‌లో ఈ జట్టు విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. కేకేఆర్ ను విజయపథంలో నడిపించి గంభీర్ మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. గంబీర్ భారత జట్టుకు ఆడిన క్రమంలోనూ చాలా విలువైన ప్లేయర్‌గా రాణించాడు. అంతర్జాతీయ స్థాయిలో 58 టెస్టు మ్యాచుల్లో 104 ఇన్నింగ్స్ ఆడిన గంభీర్ 42 బ్యాటింగ్ యావరేజ్ తో 4,154 పరుగులు చేశాడు. వీటిలో తొమ్మిది సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉన్నాయి.  అలాగే వన్డేల్లోనూ 147 వన్డేల్లో 143 ఇంన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన గంంబీర్  39.7 పరుగుల యావరేజ్ తో 5,238 పరుగులు సాధించాడు. వీటిలో 11 సెంచరీలున్నాయి.  టీ20 క్రికెట్ లో చూసుకుంటే 36 ఇన్నింగ్స్ ఆడి 932 పరుగులు చేశాడు.  ఏడు అర్థ సెంచరీలున్నాయి. ఐపీఎల్ లో 154 మ్యాచులు ఆడి 4,217 పరుగులు చేశాడు. వీటిలోనూ  36 అర్తసెంచరీలున్నాయి. టీ20 ప్రపంచకప్ సాధించిన ఇండియన్ జట్టులోనూ, వన్‌డే ప్రపంచ కప్ సాధించిన ఇండియన్ క్రికెట్ జట్టులోనూ గంభీర్ భాగస్వామ్యం కావడం విశేషం. 


రమణ్ సంగతి తీసుకుంటే అంతర్జాతీయ స్థాయిలో 11 టెస్టులు ఆడి 448 పరుగులు, 27 వన్డేలు ఆడి ఒక సెంచరీ సహా 617 పరుగులు చేశాడు. 2018లో భారత మహిళా జట్టు హెడ్ కోచ్ గా వ్యవహరించాడు. ఎక్కువగా దేశవాళీ క్రికెట్ ఆడిన రమణ్  132 మ్యాచుల్లో 7939 పరుగులు సాధించాడు. వీటిలో 19 సెంచరీలున్నాయి.