Ravindra Jadeja Apologises To Sarfaraz Khan: రాజ్‌కోట్‌ టెస్ట్‌లో అరంగేట్రం మ్యాచ్‌లోనే మెరుపు వేగంతో అర్దసెంచరీ పూర్తి చేసుకున్న సర్ఫరాజ్‌ ఖాన్‌(Sarfaraz Khan) జడేజా చేసిన పొరపాటు కారణంగా రనౌటయ్యాడు. దీనిపై రవీంద్ర జడేజా( Ravindra Jadeja) స్పందించాడు. తన కారణంగా రనౌటైన అరంగ్రేటం ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌కు టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా క్షమాపణలు చెప్పాడు. అలాగే తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టినందుకు సర్ఫరాజ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. మ్యాచ్‌ అనంతరం జడ్డూ తన ఇన్‌స్టా స్టోరీలో క్షమాపణ, అభినందన సందేశాలను కలిపి ఒక పోస్ట్‌ చేశాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌ విషయంలో చాలా బాధగా ఉందన్న రవీంద్ర జడేజా.. తప్పు తనదేనని అంగీకరించాడు. లేని పరుగు కోసం పిలుపునిచ్చానని అన్నాడు. బాగా ఆడావు సర్ఫరాజ్‌ అంటూ జడ్డూ తన ఇన్‌స్టా స్టోరీ(Instagram story)లో రాసుకొచ్చాడు.


సర్ఫరాజ్‌ ఏమన్నాడంటే..

క్రికెట్‌లో ఇలాంటివన్నీ సహజమేనని సర్ఫరాజ్‌ అన్నాడు. రవీంద్ర జడేజా-తనకు మధ్య ఆ సమయంలో అవగాహన లోపించిందని అన్నాడు. ఎవరో ఒకరు రనౌట్‌ అవుతామని... దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని సర్ఫరాజ్‌ ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నాడు. రవీంద్ర జడేజా తాను బ్యాటింగ్‌ చేసేటప్పుడు మద్దతుగా నిలిచాడని సర్ఫరాజ్‌ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో క్రీజులో నిలబడేందుకు కాస్త సమయం తీసుకోవాలని రవీంద్ర జడేజా సూచించాడని ఆ సూచనలను అమలు చేసేందుకు ప్రయత్నించానని వెల్లడించాడు.

 

తొలి టెస్ట్‌లోనే ఆకట్టుకున్నాడు..

 దేశవాళీలో పరుగుల వరద పారిస్తున్నా జట్టులో చోటు కల్పించడం లేదని అభిమానుల ఆవేదన. మైదానంలో అగ్రెసీవ్‌గా ఉంటాడు కాబట్టే భారత జట్టులో చోటు దక్కడం లేదని ఊహాగానాలు. టెస్ట్‌ జట్టు ప్రకటించే ప్రతీసారి.. ఈసారి జట్టులో చోటు పక్కా అనే వార్తలు. అసలు జట్టులోకి వస్తే రాణిస్తాడా... లేక చాలామంది ఆటగాళ్లలాగే అంచనాలు అందుకోలేక చతికిల పడతాడా అని... వీటన్నింటికి ఒకే ఇన్నింగ్స్‌తో సర్ఫరాజ్‌ ఖాన్‌ సమాధానం చెప్పేశాడు. వన్డే తరహా ఆటతో ఆడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే అర్ధ శతకంతో సత్తా చాటాడు. తన ఎంపిక సరైందేనని... తనలో అంతర్జాతీయ టెస్ట్‌ మ్యాచ్‌లో రాణించే సత్తా ఉందని సర్ఫరాజ్ నిరూపించుకున్నాడు. అంతేనా తొలి మ్యాచ్‌లోనే అర్ధ శతకం సాధించి రికార్డు కూడా సృష్టించాడు. 

 

సాధికార బ్యాటింగ్‌

క్రీజులోకి వచ్చినప్పటి  నుంచి సర్ఫరాజ్‌ ఖాన్‌ సాధికారికంగా బ్యాటింగ్‌ చేశాడు. కేవలం 48 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సుతో సర్ఫరాజ్‌ అర్ధ శతకం సాధించాడు. ఈ క్రమంలో అరంగేట్రం చేసిన టెస్టులో వేగంగా అర్ధ శతకం సాధించిన మూడో బ్యాటర్‌గా సర్ఫరాజ్‌ రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత కూడా సర్ఫరాజ్ ధాటిగానే ఆడుతున్నాడు. 66 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సుతో 62 పరుగులు చేసి అవుటయ్యాడు. కచ్చితంగా సెంచరీ చేస్తాడని అనుకుంటున్న తరుణంలో సర్ఫరాజ్‌ సింగిల్‌ కోసం యత్నించి రనౌట్‌ అయి నిరాశగా వెనుదిరిగాడు.