Salman Butt On Kohli:  భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన కెరీర్ లో మళ్లీ శిఖరాగ్ర స్థాయికి చేరుకుంటాడని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ అన్నాడు. తన స్వర్ణయుగం నాటి ఆటను మళ్లీ ప్రదర్శిస్తాడని భట్ విశ్వాసం వ్యక్తంచేశాడు. 


గతేడాది ఆసియా కప్ వరకు కోహ్లీ సుమారు నాలుగేళ్లపాటు తన కెరీర్ లో అవసాన దశను చవిచూశాడు. ఫాం కోల్పోయి పరుగులు చేయలేక ఇబ్బందిపడ్డాడు. ఈ నాలుగేళ్ల కాలంలో ఏ ఫార్మాట్ లోనూ ఒక్క శతకం చేయలేకపోయాడు. అయితే ఆసియా కప్ నుంచి కోహ్లీ ఆట మారిపోయింది. ఆ టోర్నీలో అఫ్ఘనిస్థాన్ పై టీ20 సెంచరీతో విరాట్ మళ్లీ తన పాత ఆటను కొనసాగిస్తున్నాడు. అప్పటినుంచి అద్భుతమైన టచ్ లో ఉన్నాడు. 3 వన్డే శతకాలు సాధించాడు. ఈ క్రమంలో పాక్ మాజీ సల్మాన్ భట్ కోహ్లీ గురించి మాట్లాడాడు.


మళ్లీ కోహ్లీ స్వర్ణయుగం వస్తుంది 


'పాత విరాట్ కోహ్లీలా ఇంకా అతని అత్యుత్తమ ప్రదర్శన రాలేదు. తన స్వర్ణయుగం నాటి ఆటను ఇంకా అతడు చూపించలేదు. భవిష్యత్తులో మళ్లీ కోహ్లీ నుంచి అలాంటి ఆటను చూడబోతున్నాం. విరాట్ కోహ్లీ కెరీర్ శ్రీలంక వెటరన్ కుమార సంగక్కరను పోలి ఉంటుంది. సంగక్కర కూడా తన కెరీర్ చరమాంకలో అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. అయితే అతను కుర్రాడిగా ఉన్నప్పుడు అంత బాగా ఆడలేదు. అలాగే కోహ్లీ కూడా భవిష్యత్తులో మళ్లీ తన పాత ఆటను అందుకుంటాడని నాకనిపిస్తోంది. తన స్వర్ణయుగం మళ్లీ ప్రారంభమవబోతోంది.' అని భట్ అభిప్రాయపడ్డాడు. 


అయితే కోహ్లీ తన అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి కొన్ని విషయాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని సల్మాన్ భట్ సూచించాడు. 'ప్రస్తుత కాలంలో క్రికెట్ మ్యాచ్ ల సంఖ్య బాగా పెరిగిపోయింది. అది ఆటగాళ్లపై ప్రభావం చూపుతోంది. తెలివైన ఆటగాళ్లు తమకు తగిన ఫార్మాట్ ను ఎంచుకుని దానిపై దృష్టి పెడుతున్నారు. తద్వారా మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. అయితే తన భవిష్యత్తును నిర్ణయించుకోవడం కోహ్లీ చేతుల్లోనే ఉంది. నేనైతే అతని అత్యుత్తమ దశ మళ్లీ వస్తుందని నమ్ముతున్నాను' అని ఈ పాకిస్తానీ మాజీ ఆటగాడు అన్నాడు. 


భారత్- ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్
 
ప్రస్తుతం క్రికెట్ లో చర్చంతా భారత్- ఆస్ట్రేలియా సిరీస్ దే. గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియా, భారత్ లో టెస్ట్ సిరీస్ గెలవకపోవడం.. డబ్ల్యూటీసీ ఫైనలిస్టులను నిర్ణయించే సిరీస్ కావడం.. ఆసీస్ ప్రస్తుత, మాజీ ఆటగాళ్ల కవ్వింపు మాటలు.. వెరసి ఈ సిరీస్ పై అందరి చూపు పడింది. ఇంకో 4 రోజుల్లో అంటే ఫిబ్రవరి 9న నాగ్ పూర్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.


ఈ సమయంలో భారతదేశం, ఆస్ట్రేలియా నుండి చెరో ఐదుగురు క్రికెటర్లను ఎంపిక చేసింది. వీరి మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పరస్పర పోరు చూడవచ్చు. ఐసీసీ విడుదల చేసిన ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, పాట్ కమిన్స్ వంటి పెద్ద పేర్లు ఉన్నాయి.


ఈ ఆటగాళ్ల మధ్య ఇంట్రస్టింగ్ ఫైట్
విరాట్ కోహ్లీ vs నాథన్ లియాన్
రోహిత్ శర్మ vs పాట్ కమిన్స్
చెతేశ్వర్ పుజారా vs జోష్ హేజిల్‌వుడ్
రవి అశ్విన్ vs డేవిడ్ వార్నర్
రవీంద్ర జడేజా vs స్టీవ్ స్మిత్