జల్సాలకు, విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ఓ మాజీ క్రికెటర్ అడ్డదారులు తొక్కాడు. తానొక స్టార్ క్రికెటర్‌ని అని, ఐపీఎస్ ఆఫీసర్‌ని అని చెప్పి లగ్జరీ హోటళ్లను మోసం చేశాడు. అంతేనా కొత్తకొత్త అవతారాలతో ఎన్నో మోసాలకు కూడా పాల్పడ్డాడు. ఏకంగా కోట్లలోనే దోచేశాడు. ఈ కేటుగాడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు  విచారణలో అతడు చెప్పిన విషయాలు తెలుసుకుని కంగుతిన్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్‌ను కూడా ఈ కేటుగాడు మోసం చేశాడు. 

 

కేటుగాడి రూటే వేరు..

తానొక స్టార్ క్రికెటర్‌ని అని, ఐపీఎస్ ఆఫీసర్‌ని అని చెప్పి లగ్జరీ హోటళ్లను మోసం చేసిన మాజీ క్రికెటర్ మృణాంక్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మృణాంక్ సింగ్‌ గతంలో అండర్ -19 జట్టుకు ఆడాడు. ఆ తరువాత ఆటకు స్వస్తి చెప్పి మోసాలకు తెరలేపాడు. 2014 -18 వరకు ఓ ఐపీఎల్ జట్టుకు ఆడానంటూ పలువురు మహిళలు, అంతర్జాతీయ బ్రాండ్లను మోసం చేశాడు. ఢిల్లీలోని తాజ్ ప్యాలెజ్‌తో సహా పలు హోటళ్లలో మృణాంక్ సింగ్ రూ.5.5 లక్షల మోసం చేశాడు. అంతేకాదు.. 2022లో ఓ వారంపాటు ఢిల్లీలోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ లో బస చేసి.. తానో పాపులర్ క్రికెటర్ నంటూ అందరిని నమ్మించాడు. చివరికి హోటల్ బిల్లు రూ. 5.53లక్షలు చెల్లించకుండానే వెళ్లిపోయాడు. హోటల్ యాజమాన్యం మృణాంక్‌ను ఫోన్ ద్వారా సంప్రదించి బిల్ కట్టాలని కోరింది.. తన స్పాన్సర్ అయిన అడిడాస్ బిల్లు చెల్లిస్తుందని చెప్పి హోటల్ నుంచి వెళ్లిపోయాడు. అయితే అతను ఇచ్చిన బ్యాంకు అకౌంట్ నంబర్లు, కార్డు వివరాలు నకిలీవని తేలింది. మోసపోయామని తెలుసుకున్న హోటల్ యాజమాన్యం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

నాటకీయంగా అరెస్ట్‌

గతేడాది ఆగస్టులో 25 ఏళ్ల మాజీ క్రికెటర్ మృణాంక్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే గత సోమవారం హాంకాంగ్‌కు పారిపోతున్న మృణాంక్ సింగ్‌ను ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు కూడా తాను సీనియర్ ఐపీఎస్ అధికారినంటూ ఇమ్మిగ్రేషన్ అధకారులను మృణాంక్ సింగ్ బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. కానీ అతని వ్యూహాలు పని చేయలేదు. చివరకు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 

 

బాధితుల్లో పంత్‌ కూడా...

ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా మృణాంక్ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. రిషబ్ పంత్ కూడా మృణాంక్ వలలో చిక్కుకున్న వ్యక్తేనని పోలీసులు గుర్తించారు. రిషబ్ పంత్ వద్ద ఏకంగా కోటిన్నర కొట్టేశాడు. 2021లో లగ్జరీ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారం చేస్తున్నానని, వాటిని తక్కువ ధరకే విక్రయిస్తానంటూ పంత్ వద్ద 1.63కోట్లు తీసుకొని కనిపించకుండా పోయాడు. మోసపోయనని తెలుసుకున్న పంత్ .. గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు చాలా మంది అభిమానులు ఉన్నారని చెప్పుకోవడానికి మహిళలతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో మృణాంక్‌ పోస్ట్ చేసేవాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడిని అని కూడా మృణాంక్ సింగ్ చెప్పుకున్నాడు.