Ex Australia Cricketer Michael Slater Collapses In Court After Being Denied Bail: ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న మైఖేల్ స్లేట‌ర్‌(Michael Slater )కు క్వీన్స్‌లాండ్ మేజిస్ట్రేట్ కోర్టు షాకిచ్చింది. అత‌డి బెయిల్ ధరఖాస్తును కోర్టు తిరస్కరించింది. అత‌డికి కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసుపై త‌దుప‌రి విచార‌ణ‌ను మే 31కు కోర్టు వాయిదా వేసింది. ఈ విషయం తెలిసిన స్లేట‌ర్‌  కోర్టు ఆవరణలోనే కుప్పకూలిపోయాడు. కరెక్షనల్ సర్వీసెస్ సిబ్బంది అతడిని తన సెల్‌కు తీసుకు వెళ్తుండగా స్లేటర్‌ ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయినట్లు సమాచారం. ఈ విష‌యాన్ని ఆస్ట్రేలియన్ మీడియా త‌మ కథనాల్లో పేర్కొంది. అదేవిధంగా స్లేట‌ర్‌ ప్రస్తుతం మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా గతంలో ప‌లుమార్లు కోర్టు ఆదేశాల‌ను స్లేట‌ర్‌ ధిక్కరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడికి బెయిల్‌ మం‍జూరు చేసేందుకు నిరాకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్లేటర్‌కు బెయిల్ మంజూరు చేస్తే మళ్లీ నేరాలకు పాల్పడే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. వారి వాదనతో ఏకీభవించిన కోర్టు.. బెయిల్ కోసం అతను చేసిన విజ్ఞప్తిని కొట్టివేసింది.


 ఒక‌టి కాదు ఏకంగా 19 కేసులు.. 


 స్లేటర్‌పై ఏకంగా 19 కేసులు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్‌ చేశారు. గతేడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ 12 వరకు గృహహింస, మహిళలను వెంబడించడం, భయభ్రాంతులకు గురిచేయడం, భౌతిక దాడికి దిగడం, దొంగతనాలు.. ఇలా పలురకాల కేసులు స్లేటర్‌పై నమోదయ్యాయి. గృహ హింస, వెంబడించడం, దాడి చేయడం, ఊపిరాడకుండా చేయడం, శరీరానికి హాని కలిగించడం, రాత్రి ఇంట్లో దూరడం ఇలా 54 ఏళ్ల స్లేటర్‌పై మొత్తం 19 అభియోగాలున్నాయి. 2022లో పోలీసు అధికారిని వెంబడించి అతను మరోసారి అరెస్టయ్యాడు. నిరుడు నవంబర్‌లో పోలీసులతో వాగ్వాదం కారణంగా జరిమానా ఎదుర్కొన్నాడు. ఇప్పుడు వివిధ ఆరోపణలతో పోలీసుల చేతికి చిక్కాడు. గత శుక్రవారమే స్లేటర్‌ను అరెస్ట్‌ చేశారు. పలుసార్లు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ బెయిల్‌ నియమాలను కూడా ఉల్లంఘించాడు. అరెస్టైన స్లేటర్.. గత కొన్ని రోజులుగా మారుచిడోర్ పోలీస్ వాచ్ హౌస్‌లో శిక్ష అనుభవిస్తున్నాడు. జైలు నుంచి బయటపడటానికి అతను ఇటీవల బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. 2004లో స్లేటర్‌ క్రికెట్‌ నుంచి తప్పుకొన్నాక కామెంటేటర్‌గా స్థిరపడ్డాడు. 1993 నుంచి 2003 మధ్యలో ఓపెనర్‌గా స్లేటర్‌ ఆసీస్‌ తరపున  పలు టెస్టులు, వన్డేలు ఆడాడు.  


టీవీ కామెంటేట‌ర్‌గా..


స్లేట‌ర్ యాషెస్ టూర్‌తో అరంగేట్రం చేశాడు. 1993లో తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఓపెనింగ్ బ్యాట‌ర్ అయిన స్లేట‌ర్ కెరీర్ మొత్తంగా 74 టెస్టులు, 42 వ‌న్డేలు ఆడాడు. 42.83 స‌గ‌టుతో 5,312 ప‌రుగులు సాధించాడు. 2004లో అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన స్లేట‌ర్ ఆ త‌ర్వాత టీవీ కామెంటేట‌ర్‌గా రాణించాడు. ఛానెల్ 9, ఛానల్ 7లలో పనిచేశారు.