Ind Vs Eng 1st Test Day 4 Latest Updates:  భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న తొలి టెస్టు ముగింపు ద‌శ‌కు వ‌చ్చింది. కేవ‌లం ఒక్క‌రోజు మాత్ర‌మే మిగిలి ఉండ‌టంతో ఈ మ్యాచ్ లో ఫ‌లితం తేలే అవ‌కాశ‌ముంది. లీడ్స్ లో జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో 371 ప‌రుగుల టార్గెట్ తో సోమ‌వారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఆటముగిసేస‌రికి 6 ఓవ‌ర్ల‌లో వికెట్లేమీ నష్టపోకుండా 21 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు గెలిచేందుకు మరో 350 ప‌రుగులు కావాలి. అంత‌కుముందు ఓవ‌ర్ నైట్ స్కోరు 90/2 తో రెండో ఇన్నింగ్స్ కొన‌సాగించిన భార‌త్.. 96 ఓవ‌ర్ల‌లో 364 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ స్ట‌న్నింగ్ సెంచ‌రీ (247 బంతుల్లో 137, 18 ఫోర్లు)తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బౌల‌ర్ల‌లో బ్రైడెన్ కార్స్, జోష్ టంగ్ కు మూడేసి వికెట్లు ద‌క్కాయి. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 6 ప‌రుగులు క‌లుపుకుని, ఓవ‌రాల్ గా 371 ప‌రుగుల టార్గెట్ ను ఇంగ్లాండ్ కు నిర్దేశించింది. 

పంత్ డబుల్.. ఇక రెండో ఇన్నింగ్స్ లో రాహుల్ తోపాటు వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్ (140 బంతుల్లో 118, 15 ఫోర్లు,3 సిక్స‌ర్లు)తో భార‌త్ భారీ ఆధిక్యం సాధించేందుకు ముఖ్య పాత్ర పోషించారు. నిజానికి నాలుగో రోజు ఆట ప్రారంభంలోనే కెప్టెన్ శుభ‌మాన్ గిల్ (8) వికెట్ ను కోల్పోయింది. ఈ ద‌శ‌లో పంత్- రాహుల్ జోడీ స‌త్తా చాటింది. ఇంగ్లీష్ బౌలర్ల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొని దాదాపు రెండు సెష‌న్ల‌పాటు వారిపై ఆధిప‌త్యం కొనసాగించింది. ఈ క్ర‌మంలో తొలుత రాహుల్ త‌న కెరీర్ లో 9వ సెంచ‌రీ చేయ‌గా, పంత్ ఈ మ్యాచ్ లో రెండో సెంచ‌రీ, ఓవ‌రాల్ గా త‌న కెరీర్ లో 8వ సెంచ‌రీ బాదాడు. నాలుగో వికెట్ కు వీరిద్ద‌రూ 195 ప‌ర‌గులు జోడించాక పంత్ ఔట‌య్యాడు. 

మిడిలార్డ‌ర్ విఫ‌లం..పంత్ ఔట‌య్యాక‌, రాహుల్ జ‌ట్టుకు మ‌రింత ఆధిక్యాన్ని అందించేందుకు ప్ర‌య‌త్నించి ఔట‌య్యాడు. ఇక మిడిలార్డ‌ర్ మ‌రోసారి విఫ‌ల‌మైంది. ఓ ద‌శ‌లో 333-4తో ప‌టిష్టంగా క‌నిపించిన భార‌త్ మ‌రో 31ప‌రుగులు జోడించి మిగ‌తా ఆరు వికెట్ల‌ను కోల్పోయింది. క‌రుణ్ నాయ‌ర్ (20) మ‌రోసారి విఫ‌ల‌మ‌య్యాడు. శార్దూల్ ఠాకూర్ (4) నిర్ల‌క్ష్యపు షాట్ తో వికెట్ పారేసుకున్నాడు. ఆ త‌ర్వాత ఒకే ఓవ‌ర్లో లోయ‌ర్ ఆర్డ‌ర్ లోని ముగ్గురు ఔట్ కావ‌డంతో ఇంగ్లాండ్ మ్యాచ్ లోకి వ‌చ్చింది. చివ‌రి వికెట్ కు 15 ప‌రుగులు జోడించాక‌, ప్ర‌సిధ్ కృష్ణ బాధ్య‌తారాహిత్య‌పు షాట్ ఆడి ఔట్ కావ‌డంతో మ‌రో ఎండ్ లో ర‌వీంద్ర జ‌డేజా (25 నాటౌట్) అజేయంగా నిలిచాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ మాదిరిగానే భార‌త్ కొలాప్స్ అయ్యింది.  మిగ‌తా బౌల‌ర్ల‌లో షోయ‌బ్ బ‌షీర్ 2 వికెట్లు దక్కాయి.  ఇక భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆరు ఓవ‌ర్ల‌లో 21 ప‌రుగులు చేసింది.