ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ బాక్సింగ్ డే టెస్ట్ కేవలం 2 రోజుల్లోనే ముగిసింది. నాలుగో టెస్టులో మొదటి రోజు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే ఇంగ్లాండ్ ప్రదర్శన ఆసీస్ కంటే దారుణంగా ఉంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 110 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఆస్ట్రేలియా పరిస్థితిలో మార్పు రాలేదు. ఆసీస్ రెండో ఇన్నింగ్సులో 132 పరుగులు మాత్రమేచేసింది. 175 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ మూడో సెషన్‌లో ఛేదించింది. తొలి ఇన్నింగ్స్ లో తడబడిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో రాణించింది. దాంతో ఆసీస్ గడ్డమీద 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-2027 సైకిల్‌లో ఇది ఆస్ట్రేలియాకు తొలి ఓటమి. ఈ మ్యాచ్ ఫలితం భారత జట్టుకు కూడా కొంత ప్రయోజనం చేకూర్చింది.

Continues below advertisement

మెల్‌బోర్న్ టెస్టు (Boxing day Test 2025)లో టాస్ గెలిచి ఇంగ్లాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ తరపున తొలి ఇన్నింగ్స్‌లో జోష్ టంగ్ 5 వికెట్లు పడగొట్టడంతో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 152 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా బౌలర్లు మైఖేల్ నెసెర్, స్కాట్ బౌలాండ్ విరుచుకుపడటంతో ఇంగ్లాండ్ 110 పరుగులకే ఆలౌట్ అయింది. మైఖేల్ 4 వికెట్లు, స్కాట్ 3 వికెట్లు తీశారు. మిచెల్ స్టార్క్ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లను ఔట్ చేశాడు.

రెండో ఇన్నింగ్స్ మరింత ఉత్కంఠగా సాగింది. ఇంగ్లాండ్ బౌలర్లు చెలరేగడంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 8 మంది బ్యాట్స్‌మెన్‌లు రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ట్రావిస్ హెడ్ 46, స్టీవ్ స్మిత్ 24 పరుగులు చేశారు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ తరపున జాక్ క్రాలీ (37), బెన్ డకెట్ (34) మంచి ఆరంభాన్ని అందించారు. ఆ తర్వాత జాకబ్ బెథెల్ 40 పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌లో ఇది ఇంగ్లాండ్‌కు మూడో విజయం మాత్రమే.

Continues below advertisement

WTC 2025-27 లో ఆస్ట్రేలియాకు తొలి ఓటమి

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌తో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఇప్పటికే గెలిచింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-2027 సైకిల్‌లో ఇది ఆస్ట్రేలియాకు తొలి పరాజయం. ఈ ఓటమి తర్వాత కూడా జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలోనే ఉంది. అయితే ఈ ఓటమితో ఆస్ట్రేలియా గెలుపు శాతం 100 నుండి 85.71కి తగ్గింది. జట్టుకు 72 పాయింట్లు ఉన్నాయి. ఈ ఓటమి భారత్ సహా ఇతర జట్లకు కలిసొస్తుంది. ఎందుకంటే ఆసీస్ మొదటి 6 టెస్టుల్లో ఒక్క టెస్టు కూడా ఓడిపోలేదు.

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ జట్టు రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ 3 మ్యాచ్‌లలో 2 గెలిచింది. ఆస్ట్రేలియా ఈ ఓటమితో న్యూజిలాండ్‌తో పాటు దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్‌లకు, భారత్‌కు ప్రయోజనం కలిగింది. భారత జట్టు 9 టెస్టుల్లో 4 మ్యాచ్‌లు గెలిచి, 4 టెస్టులో ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. ఇండియా 48.15 గెలుపు శాతంతో పట్టికలో ఆరో స్థానంలో ఉంది.

WTC 2025-27 పాయింట్ల పట్టిక

  1. ఆస్ట్రేలియా- 7 లో 6 గెలుపులు, 1 ఓటమి
  2. న్యూజిలాండ్- 3 లో 2 గెలుపులు, 1 డ్రా
  3. దక్షిణాఫ్రికా- 4 లో 3 గెలుపులు, 1 ఓటమి
  4. శ్రీలంక- 2 లో 1 గెలుపు, 1 డ్రా
  5. పాకిస్తాన్- 2 లో 1 గెలుపు, 1 ఓటమి
  6. భారత్- 9 లో 4 గెలుపులు, 4 ఓటములు, 1 డ్రా
  7. ఇంగ్లాండ్- 9 లో 3 గెలుపులు, 5 ఓటములు, 1 డ్రా
  8. బంగ్లాదేశ్- 2 లో 1 ఓటమి, 1 డ్రా
  9. వెస్టిండీస్- 8 లో 7 ఓటములు, 1 డ్రా