Ashes 2023: గతేడాది ఆస్ట్రేలియా చేతిలో తమకు ఎదురైన ఘోర పరాభవానికి బదులు తీర్చుకోవాలని భావిస్తున్న  ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు  భారీ షాక్ తగిలింది. ఈనెల 16  నుంచి మొదలుకాబోయే ఐదు మ్యాచ్‌ల యాషెస్ టెస్టు సిరీస్‌కు గాను తొలి రెండు టెస్టులకు జట్టును ప్రకటించి కంగారూలను కంగారెత్తించేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్న  బెన్ స్టోక్స్ సేనకు ఊహించని షాక్ తాకింది. ఆ జట్టు స్టార్  స్పిన్నర్ జాక్ లీచ్  గాయం కారణంగా ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.  దీంతో ఇంగ్లాండ్ జట్టు  రెండేండ్ల క్రితేమ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన  మోయిన్ అలీని తిరిగి జట్టులోకి రప్పించేందుకు  ప్రయత్నాలు మొదలుపెట్టింది. 


జాక్ లీచ్ గాయంతో  అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు గాను ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మోయిన్ అలీతో చర్చలు జరుపుతుందని సమాచారం. ది గార్డియన్‌లో వచ్చిన సమాచారం మేరకు.. ఈసీబీ అధికారులతో పాటు ఇంగ్లాండ్  టెస్టు జట్టు హెడ్‌కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్,  కెప్టెన్ బెన్ స్టోక్స్‌లు కూడా మోయిన్ అలీని  రిటైర్మెంట్ వెనక్కి తీసుకోమని  కోరినట్టు తెలుస్తున్నది. దీనిపై త్వరలోనే కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 


ఇదివరకే యాషెస్ సిరీస్ - 2023కు గాను ఇంగ్లాండ్ ఎంపిక చేసిన  15 మందితో కూడిన సభ్యులలో లీచ్ తప్ప  ప్రొఫెషనల్ స్పిన్నర్ మరొకరు లేరు.  జో రూట్ స్పిన్ వేసినా అతడు పార్ట్ టైమ్ స్పిన్నర్ గానే పనికొస్తాడు. స్పిన్ ఆడటంలో ఇబ్బంది పడే ఆసీస్‌ను పేస్ తో పాటు స్పిన్నర్లతోనూ కట్టడి చేయాలంటే ఇప్పుడు ఇంగ్లాండ్‌కు నిఖార్సైన  స్పిన్నర్ అవసరం. కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వడానికి ఈసీబీ అంత సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో  అలీ అయితేనే ఈ రోల్‌కు కరెక్ట్‌గా న్యాయం చేయగలడని ఈసీబీ భావిస్తున్నది. మరి అలీ.. తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటాడా..? లేక  అదే  కొనసాగిస్తాడా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


 






మోయిన్ అలీ టెస్టు కెరీర్.. 


2014లో ఇంగ్లాండ్ తరఫున తొలి టెస్టు ఆడిన మోయిన్ అలీ.. తన కెరీర్‌లో మొత్తంగా  64 టెస్టులు ఆడాడు.  ఈ క్రమంలో అలీ.. 195 వికెట్లు పడగొట్టడమే గాక  బ్యాట్ తో కూడా ఉపయుక్తమైన పరుగులు సాధించాడు. టెస్టులలో అలీ.. 28.29 సగటుతో  2,914 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు కూడా ఉండటం విశేషం.  2021 సెప్టెంబర్‌లో అలీ తన ఆఖరి టెస్టు (భారత్)ను ఆడి రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టుల నుంచి రిటైర్ అయ్యాక అలీ.. పరిమిత ఓవర్లకే  పరిమితమయ్యాడు.  ఇంగ్లాండ్ వన్డే, టీ20 జట్లలో అలీ కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఇటీవల ఐపీఎల్ -16 లో కూడా అలీ  చెన్నై సూపర్ కింగ్స్ తరఫున  ప్రాతినిథ్యం వహించాడు.  


యాషెస్ సిరీస్‌లో ఫస్ట్ రెండు టెస్టులకు ఇంగ్లాండ్ ప్రకటించిన జట్టు : బెన్ స్టోక్స్ (కెప్టెన్), ఓలీ పోప్, జానీ బెయిర్ స్టో,  జో రూట్, జేమ్స్ అండర్సన్, హ్యారీ బ్రూక్, జాక్ లీచ్, బెన్ డకెట్, మాథ్యూ పాట్స్, ఓలీ రాబిన్సన్, డాన్ లారెన్స్, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్, జోష్ టంగ్
(గాయంతో జాక్ లీచ్ ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. కానీ ఈసీబీ అతడి రిప్లేస్‌మెంట్‌ను ఇంకా ప్రకటించలేదు)