World Cup 2023 News: ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌కు పాకిస్థాన్‌ సిద్ధమైంది. ఇప్పటికే సెమీస్‌ అవకాశాలు దాదాపుగా మూసుకుపోగా.. మహాద్భుతం సృష్టించాలన్న భావనతో పాక్‌ ఉంది. పాకిస్థాన్‌ సెమీస్‌ అవకాశాలు ఎలా ఉన్నా.. ఈ మ్యాచ్‌ మాత్రం ఇంగ్లండ్‌కు చాలా కీలకమే. పాకిస్థాన్‌ వేదికగా 2025లో జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీకి అర్హత సాధించాలంటే బ్రిటీష్‌ జట్టు పాక్‌పై విజయం అత్యవసరం. శ్రీలంకపై ఐదు వికెట్ల తేడాతో న్యూజిలాండ్  గెలవడం... పాకిస్థాన్‌ ఆశలను తీవ్రంగా దెబ్బతీసింది. 1992 ప్రపంచకప్‌ ఛాంపియన్‌ అయిన పాక్‌ ఇప్పడు.... ఇంగ్లండ్‌ను అసంభవమైన పరుగుల తేడాతో ఓడించాలి. న్యూజిలాండ్  నెట్‌ రన్‌రేట్‌ +0.743  ఉండగా పాకిస్తాన్ రన్‌రేట్‌ +0.036గా ఉంది. ఈడెన్ గార్డెన్స్‌లో  ఈ మ్యాచ్‌ జరగనుంది. 

 

బాబర్ అజామ్ నేతృత్వంలోని పాక్‌ నాల్గవ జట్టుగా సెమీస్‌ చేరాలంటే  ఈ మ్యాచ్‌లో తొలుత పాక్‌ బ్యాటింగ్‌ చేస్తే 287 పరుగుల తేడాతో భారీ విజయం సాధించాలి. అంటే పాకిస్థాన్‌ మొదట బ్యాటింగ్‌ చేసి 300 పరుగులు చేస్తే.. ఇంగ్లండ్‌ను 13 పరుగులకే ఆలౌట్‌ చేయాలి. అలా కాకుండా పాకిస్థాన్‌ లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తే 284 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించాలి. అంటే ఇంగ్లండ్‌ 100 పరుగులకే ఆలౌటైనా... ఆ వంద పరుగులను పాకిస్థాన్‌ 16 బంతుల్లోనే సాధించాలి. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకూ ఎవ్వరికీ సాధించని గణాంకాలతో పాక్‌ విజయం సాధించాలి. కానీ ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ ఎంత బలహీనంగా ఉన్న అంత ఘోరంగా ఓడిపోతుందని ఊహించడం కష్టమే. అందుకే ఈ మ్యాచ్‌లో గెలవాలంటే పాకిస్థాన్‌ ఇప్పటివరకూ చేయని అద్భుతమే చేయాలి. ఇది ఆచరణ సాధ్యం కాని పని.

 

డిఫెండింగ్ ఛాంపియన్‌ అయిన ఇంగ్లండ్‌కు ప్రపంచకప్‌ టైటిల్‌ కల చెదిరిపోయిన  2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాలంటే పాయింట్ల పట్టికలో టాప్‌ ఎనిమిది జట్లలో ఒకటిగా ఉండాలి. ఛాంపియన్స్‌ ట్రోఫీకి అర్హత సాధించేందు. ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్స్‌లకు అవకాశం ఉంది. చివరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై 160 పరుగుల తేడాతో విజయం సాధించిన బ్రిటీష్‌ జట్టు పాక్‌పై కూడా గెలిచి ఛాంపియన్స్‌ ట్రోఫీకి అర్ఙత సాధించాలని చూస్తోంది. 

 

    పాకిస్తాన్ ఈ ప్రపంచ కప్‌లో అంచనాలకు అనుగుణంగా రాణించడంలో విఫలమైంది. గత రెండు మ్యాచ్‌ల్లో అద్భుతంగా పుంజుకున్న పాక్‌ ఇంగ్లండ్‌పై ఎంత తేడాతో గెలుస్తుందో చూడాలి. టాపార్డర్‌ రాణిస్తే పాక్‌ భారీ స్కోరు చేస్తుంది. న్యూజిలాండ్‌పై ధాటిగా ఆడిన ఓపెనర్ ఫఖర్ జమాన్‌పై పాక్‌ ఆశలు పెట్టుకుంది. బాబర్‌తో కలిసి ఫకర్‌ జమాన్‌ మరోసారి విధ్వంసం సృష్టిస్తే భారీ స్కోరు ఖాయమే. మరోవైపు ఈ ప్రపంచకప్‌ను విజయంతో ముగించాలని ఇంగ్లండ్‌ భావిస్తోంది. ఈ మహా సంగ్రామంలో బ్రిటీష్‌ జట్టు వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. బెన్ స్టోక్స్, డేవిడ్ మలన్ గత రెండు మ్యాచుల్లో రాణించడం ఇంగ్లండ్‌కు ఉప శమనం కలిగించింది. నెదర్లాండ్స్‌పై  స్టోక్స్  84 బంతుల్లో 108 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చాడు. ఓపెనర్ మలన్‌కు ఇది  మరచిపోలేని ప్రపంచ కప్‌. ఇంగ్లండ్‌ తరపును 300కుపైగా పరుగులు సాధించిన బ్యాటర్‌ మలన్‌ ఒక్కడే. జో రూట్, హ్యారీ బ్రూక్, కెప్టెన్ జోస్ బట్లర్ పరుగులు సాధించి ప్రపంచ కప్ ప్రచారాన్ని ముగించాలని ఇంగ్లాండ్ ఆశిస్తోంది. బౌలింగ్‌లో క్రిస్ వోక్స్ మెరుస్తున్నాడు. స్పిన్ అనుకూల పరిస్థితులు ఉండే ఈడెన్‌ గార్డెన్స్‌లో మొయిన్ అలీ, ఆదిల్ రషీద్‌లను పాక్‌ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. 

 

ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్‌), మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, శామ్ కరన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, బ్రైడన్ కార్సే, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్ క్రిస్ వోక్స్. 

 

పాకిస్థాన్ జట్టు: బాబర్ ఆజం ( కెప్టెన్‌), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, సల్మాన్ అలీ అఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, షాహీన్ షా ఆఫ్రిది, మహ్మద్ వసీం