భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌ను ఈసారి ఎలాగైన ఒడిసిపట్టాలని కింగ్‌ కోహ్లీ పట్టుదలగా ఉన్నాడు. స్వదేశంలో జరుగుతున్న మహా సంగ్రామంలో విరాట్‌ స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే సెమీస్‌ బెర్తును దాదాపు ఖాయం చేసుకున్న టీమిండియా... ప్రపంచకప్ కలను సాకారం చేసుకునేందుకు మరో రెండు అడుగుల దూరంలో ఉంది. విరాట్‌  మరోసారి విజృంభిస్తే ఈసారి ప్రపంచకప్‌ భారత్‌ కీర్తి కిరీటంలో చేరడం గ్యారెంటి. అయితే నవంబర్ ఐదో తేదీన విరాట్ 35వ పుట్టినరోజు జరుపుకోనుండగా..  కింగ్ కోహ్లి పుట్టినరోజును ఘనంగా జరిపేందుకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. అదే రోజు ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇండియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో విరాట్ బర్త్‌డే వేడుకలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా మ్యాచ్ మధ్యలో సెలబ్రేషన్స్ చేసేందుకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్  ప్లాన్‌ చేస్తోంది.


 విరాట్ కోహ్లి పుట్టినరోజు సందర్భంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సంబరాలు అంబరాన్ని అంటనున్నాయి. ఈడెన్ గార్డెన్స్‌లో కింగ్‌ కోహ్లీ బర్త్‌ డే సందర్భంగా లేజర్ షో, బాణసంచా ప్రదర్శనలు నిర్వహించాలని క్యాబ్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కోహ్లి ఫొటో ఉన్న 70 వేల ఫేస్ మాస్క్‌లను ప్రేక్షకులకు పంపిణీ చేయనున్నారు. మ్యాచ్ చూడ్డానికి స్టేడియానికి వచ్చే 70 వేల మంది ప్రేక్షకులకు విరాట్ ఫేస్ మాస్కులు ఇవ్వాలని క్యాబ్ నిర్ణయించడంపై అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. మ్యాచ్ సమయంలో గ్రౌండ్ మొత్తం విరాట్ కోహ్లీ మాస్కులు వేసుకుని కనిపిస్తే ఆ కిక్కే వేరంటూ సంబరపడి పోతున్నారు. విరాట్ పుట్టినరోజు సందర్భంగా క్యాబ్ ఏర్పాటు చేయిస్తున్న కేక్ సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. విరాట్‌ పుట్టినరోజు ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోయేలా కేక్ డిజైన్ చేయిస్తున్నట్లు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్నేహసిస్ గంగూలీ వెల్లడించారు.


 సౌతాఫ్రికా, ఇండియా మ్యాచ్‌కి ముందు విరాట్ కోహ్లి పుట్టినరోజును ఘనంగా జరిపేందుకు క్యాబ్ ఏర్పాట్లు చేస్తోంది. ప్రత్యేకంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనితో పాటు విరాట్ కోహ్లి పుట్టినరోజు అందరికీ గుర్తుండిపోయేలా ఈడెన్ గార్డెన్స్‌లో లేజర్‌షోను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. అలాగే బాణాసంచా వెలుగులతో ఈడెన్ గార్డెన్స్ దద్దరిల్లిపోనున్నట్లు తెలిసింది.వీటిన్నింటికీ మించి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ వేసిన మరో ప్లాన్ కింగ్ కోహ్లీ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. విరాట్ కోసం ఒక  ప్రత్యేక కేక్‌ను ఆర్డర్ చేశామని, ఈ మ్యాచ్‌లో చాలా ఆశ్చర్యకర ఏర్పాట్లు ఉంటాయని  బెంగాల్ క్రికెట్ అసోసియేషన్  ప్రెసిడెంట్ స్నేహాశిష్ గంగూలీ తెలిపారు. మ్యాచ్‌ మధ్యలో బాణసంచా ప్రదర్శనను కూడా నిర్వహించాలని చూస్తున్నామని గంగూలీ తెలిపాడు. ఇప్పుడే అన్నీ చెప్పలేనని, కొంచెం సర్‌ప్రైజ్ ఉండనివ్వాలని, మ్యాచ్ మధ్యలో విరాట్‌తో పాటు ప్రేక్షకుల కోసం బాణాసంచా పేల్చాలని ప్లాన్ చేశామని వెల్లడించాడు. మొత్తం ఈడెన్‌ గార్డెన్స్‌ స్టేడియం విరాట్ ఫ్యాన్స్‌తో నిండిపోతుందని ఆశిస్తున్నానని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు.


 వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ (49) రికార్డును సరిచేయడానికి కోహ్లీ కేవలం ఒక సెంచరీ దూరంలో ఉన్నాడు. పుణెలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 48వ సెంచరీ నమోదు చేశాడు. స్టార్ బ్యాట్స్‌మన్ తన ప్రత్యేక రోజున తన ఆరాధ్యదైవం యొక్క ప్రపంచ రికార్డును సమం చేయడం ద్వారా రికార్డు సృష్టిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.