INDIA A batter Tilak Varma scores ton against INDIA D | అనంతపురం: అనంతపురం జిల్లా కేంద్రంలో స్పోర్ట్స్ విలేజ్ లో జరుగుతున్న దిలీప్ ట్రోఫీ రెండవ రౌండ్ మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అదరగొట్టాడు. తిలక్ వర్మ తన బ్యాట్ తో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇండియా ఏ, ఇండియా డి జట్ల మధ్య మూడవరోజు మ్యాచ్ కొనసాగుతోంది. ఇండియా ఏ జట్టు కు ప్రాతినిధ్యం వహిస్తున్న తిలక్ వర్మ 193 బంతుల్లో 9 ఫోర్ల సహాయం తో 111  పరుగులు చేశాడు. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్లో తిలక్ వర్మకు చోటు దక్కలేదు. అయినప్పటికీ నిరాశ చెందకుండా.. రెండవ రౌండ్ మ్యాచ్ లో అంది వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్ గా ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ లో సూపర్ ఫామ్ లో ఉన్న తిలక్ వర్మ వైట్ బాల్ తోనే కాదు రెడ్ బాల్ తో కూడా తన సత్తా ఏంటో ఈ మ్యాచ్ లో నిరూపించాడు. మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 10 పరుగులకే అవుట్ అయిన తిలక్ వర్మ రెండో ఇన్నింగ్స్ లో తన బ్యాట్ పదును చూపించి విమర్శకుల నోళ్లు మూయించాడని చెప్పవచ్చు. 


సెంచరీ సాధించిన ప్రీతం సింగ్ : 


 రెండవ రౌండ్లో రెండవ ఇన్నింగ్స్ లో ఓపెనర్ గా వచ్చిన ప్రీతం సింగ్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 189 బంతుల్లో 122 పరుగులు సాధించాడు. ( 12×4, 1×6 ). ప్రీతం సింగ్, తిలక్ వర్మ, శశవత్ రావత్ 88 బంతుల్లో 64 పరుగులు చేయడంతో ఇండియా ఏటీఎం ఇండియా డీ టీంకు భారీ టార్గెట్ ను నిర్దేశించింది. ప్రస్తుతం ఇండియా ఏ జట్టు ఇండియా డి జట్టుకు 488 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.


ఇండియా ఏ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 290 పరుగులకు ఆలౌట్ అయింది. ఇండియా డీ బౌలర్లలో హర్షిత్ రాణా 4 వికెట్లతో సత్తా చాటగా, అర్షదీప్ సింగ్, వి కావేరప్పలు చెరో 2 వికెట్లు పడగొట్టారు. సారాంశ్ జైన్, సౌరబ్ కుమార్ లు ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. 


ఇండియా డీ ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటర్లు విఫలమయ్యారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ డకౌట్ కాగా, దేవదత్ పడిక్కల్ 92 రన్స్ తో రాణించాడు. ఇండియా డీ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 183 రన్స్‌కు ఆలౌటైంది. ఖలీల్ అహ్మద్, అఖీబ్ ఖాన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ప్రసిద్ కృష్ణ, కోటియన్, ములానిలు తలో వికెట్ తీశారు.