Duleep Trophy 2023: క్రికెట్‌లో ఒక ఓవర్ పూర్తి చేయడానికి ఎన్ని నిమిషాల సమయం పడుతుంది..? ఫార్మాట్లు వేరైనా ఒక పేసర్‌కు అయితే  మూడు నుంచి నాలుగు నిమిషాలు, స్పిన్నర్ అయితే  2 నుంచి 3 నిమిషాలు. స్పిన్నర్ల ఓవర్లలో పరుగులేమీ రాకుంటే దానిని 2 నిమిషాలలోపే పూర్తి చేయొచ్చు.  మన టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవీంద్ర జడేజా అయితే టెస్టులలో ఒక ఓవర్ పూర్తి చేయడానికి తీసుకునే టైమ్ 1.5 నిమిషాలు.   కానీ దులీప్ ట్రోఫీలో మాత్రం ఐదు ఓవర్లు పూర్తి చేయడానికి నార్త్ జోన్ సారథి  జయంత్ యాదవ్ తీసుకున్న టైమ్ 53 నిమిషాలు.  ఇంచుమించు ఒక గంట. 


బెంగళూరు వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీలో భాగంగా నార్త్ జోన్ కెప్టెన్ జయంత్ యాదవ్.. సౌత్ జోన్ విజయాన్ని అడ్డుకునేందుకు గాను  ఈ టైమ్ వేస్ట్ యవ్వారాలకు పాల్పడ్డాడు.   ఓడిపోతామని తెలిసినా బంతి బంతికీ ఫీల్డర్లను మారుస్తూ  ఏదో  మ్యాచ్‌ను మారుద్దామన్నంత  రేంజ్‌లో అంపైర్లు, ఫీల్డర్లతో ఆలోచనలు చేస్తూ సమయాన్ని వృథా చేశాడు.  


వర్షం వల్ల  పలుమార్లు అంతరాయం కలిగిన ఈ మ్యాచ్‌లో  వరుణుడు మరోసారి కరుణించకపోతాడా..?  తాము గెలవకపోతామా..? అన్న  దుష్ట ఆలోచనతో  సౌత్ జోన్‌ను విజయాన్ని అడ్డుకునేందుకు  చేయాల్సిందంతా చేశాడు. ఈ మ్యాచ్ డ్రా అయితే  నార్త్ జోన్ ఫైనల్ కు వెళ్లే అవకాశం ఉండగా జయంత్ యాదవ్ ఆ మేరకు శతవిధాలా ప్రయత్నించాడు.  కానీ సాయి కిషోర్ 11 బంతుల్లో 2 భారీ సిక్సర్లు బాది 15 పరుగులు చేసి తన జట్టును ఫైనల్ కు చేర్చాడు.  


 






బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం ముగిసిన  మ్యాచ్‌లో  ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన నార్త్ జోన్.. 58.3 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌట్ అయింది.   సౌత్ జోన్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 195 పరుగులు చేసింది.  ఫస్ట్ ఇన్నింగ్స్‌లో నార్త్ జోన్ కు 3 పరుగుల ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో నార్త్ జోన్.. 56.4 ఓవర్లలో  211 పరుగులు చేసింది. అనంతరం చివరి రోజు  215 పరుగుల లక్ష్యంతో  బరిలోకి దిగిన  సౌత్ జోన్.. 6 రన్ రేట్‌తో ఆడాల్సి వచ్చింది. దూకుడుగా ఆడే క్రమంలో  మయాంక్ అగర్వాల్ (54), హనుమా విహారి (43), రికీ భుయ్ (34), తిలక్ వర్మ (25) ధాటిగా ఆడారు.  చివర్లో సాయికిషోర్  మెరుపులతో  సౌత్ జోన్ గెలిచి ఫైనల్ కు చేరుకుంది. 


జయంత్ యాదవ్ తీరుపై  మాజీ క్రికెటర్ దొడ్డ గణేష్  స్పందిస్తూ.. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ట్వీట్ చేశాడు. అయితే సౌత్ జోన్ సారథి హనుమా విహారి మాత్రం  ఒకవేళ జయంత్ స్థానంలో  ఉంటే తాను కూడా అదే చేసేవాడన్నాడు.  మ్యాచ్ ముగిశాక  విహారి మాట్లాడుతూ.. ‘డొమెస్టిక్ క్రికెట్‌లో నేను చాలా గేమ్స్ ఆడాను. చాలా టీమ్స్ ఫైనల్ సెషన్‌లో ప్రత్యర్థుల విజయాన్ని అడ్డుకోవడానికి ఇలాగే చేస్తాయి. కొంతమంది ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని చెబుతారు.  కానీ జయంత్ యాదవ్ ప్లేస్ లో నేను ఉన్నా అదే చేసేవాడిని’అని వ్యాఖ్యానించడం గమనార్హం.  











Join Us on Telegram: https://t.me/abpdesamofficial