Ind Vs Eng 2nd Test :టీమ్ ఇండియా(Team India) ప్రస్తుతం శుభ్‌మన్ గిల్(Shubman Gill) కెప్టెన్సీలో ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. భారత జట్టు 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఓడిపోయింది. హెడింగ్లీ టెస్ట్‌లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో భారత్(India) ఇంగ్లండ్(England) చేతిలో పరాజయం పాలైంది. ఇప్పుడు సిరీస్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ బర్మింగ్‌హామ్‌(Birmingham)లో జరుగుతోంది. రెండో టెస్టు మ్యాచ్‌లో ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరుగుతోంది. ఈ మైదానంలో భారత జట్టు ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు.

వాస్తవానికి, టెస్ట్ చరిత్రలో భారత జట్టు దశాబ్దాలుగా చాలా మైదానాల్లో మ్యాచ్‌లు ఆడింది. కానీ కొన్నింటిలో అసలు ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు. టీమ్ ఇండియా ఇప్పటివరకు టెస్టుల్లో గెలవని 5 మైదానాల గురించి తెలుసుకుందాం.

ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ (ఇంగ్లండ్)

జరిగిన మొత్తం మ్యాచ్‌లు - 8

ఫలితం - 7 ఓటములు, 1 డ్రా

మొదటి ఓటమి - 1967లో

ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ మొదటిసారిగా మన్సూర్ అలీ ఖాన్ పటౌడి కెప్టెన్సీలో 1967లో మ్యాచ్ ఆడింది.అందులో 132 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత కూడా ఇండియా విరాట్ కోహ్లీ, ధోనీ, ద్రవిడ్, గంగూలీ కెప్టెన్సీలో ఈ మైదానంలో ఆడింది, ఓడిపోయింది. ఇప్పుడు శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో ఆడుతోంది.  

గడ్డాఫీ స్టేడియం, లాహోర్ (పాకిస్తాన్)

మొత్తం మ్యాచ్‌లు - 7

ఫలితం - 2 ఓటములు, 5 డ్రాలు

లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియం ఎల్లప్పుడూ భారత్‌కు 'నో విన్ జోన్'గా ఉంది. ఇక్కడ ఆడిన ఏడు మ్యాచ్‌లలోనూ టీమ్ ఇండియా గెలవలేదు. ఈ మైదానంలో జరిగిన చాలా మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి, అయితే భారత జట్టు రెండుసార్లు ఓడిపోయింది.

కెన్నింగ్‌స్టన్ ఓవల్, వెస్టిండీస్

మొత్తం మ్యాచ్‌లు - 9

ఫలితం - 7 ఓటములు, 2 డ్రాలు

వెస్టిండీస్‌లోని ఈ చారిత్రాత్మక మైదానం భారత్‌కు ఎప్పుడూ కలిసి రాలేదు. ఇక్కడ టీమ్ ఇండియా మొత్తం 9 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది, కాని ఒక్కసారి కూడా గెలవలేదు. ఏడు ఓటములు, రెండు డ్రాలు చేసింది. ఈ మైదానంలో గెలుపు కోసం భారత్ ఇప్పటికీ ఎదురుచూస్తోంది.

ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్ (ఇంగ్లండ్)

మొత్తం మ్యాచ్‌లు - 9

ఫలితం - 4 ఓటములు, 5 డ్రాలు

ఇంగ్లండ్‌లోని మరో చారిత్రాత్మక మైదానమైన ఓల్డ్ ట్రాఫోర్డ్ కూడా భారత్‌కు కలిసిరావడం లేదు. ఇక్కడ భారత్ నాలుగుసార్లు ఓడిపోగా, ఐదు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

నేషనల్ స్టేడియం, కరాచీ (పాకిస్తాన్)

మొత్తం మ్యాచ్‌లు- 6

ఫలితం - 3 ఓటములు, 3 డ్రాలు

కరాచీలోని ఈ మైదానంలో భారత్ 6 సార్లు టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. కానీ విజయం కోసం ఇప్పటికీ ఎదురుచూస్తోంది. ఈ మైదానంలో భారత్ మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది మిగిలిన మూడు డ్రాగా ముగిశాయి. ఇక్కడ కూడా టీమ్ ఇండియా రికార్డు చాలా పేలవంగా ఉంది.