DK Meets Yash: భారత వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ తో సంబరపడిపోతున్నాడు. తన అభిమాన నటుడ్ని కలిసిన వేళ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. కన్నడ నటుడు, కేజీఎఫ్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో యశ్ ను దినేశ్ కార్తీక్ కలిశాడు. తనతో దిగిన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కార్తీక్ 'సలామ్ రాకీ భాయ్' అంటూ దానికి క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సలాం రాకీ భాయ్
భారత వెటరన్ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కన్నడ హీరో యశ్ ను కలిశాడు. యశ్ తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దానికి 'సలాం రాకీభాయ్' అని క్యాప్షన్ పెట్టాడు. వీరిద్దరూ ఎక్కడ కలిశారు అనేది తెలపనప్పటికీ.. వారి డ్రెస్సింగ్ ను బట్టి ఏదో ఫంక్షన్ లో కలిసినట్లు కనిపిస్తోంది. కేజీఎఫ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు యశ్. గతేడాది విడుదలైన కేజీఎఫ్ రెండో భాగం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
మ్యాచ్ ప్రెజెంటర్ గా
ఇక దినేశ్ కార్తీక్ కు ప్రస్తుతం భారత జట్టులో అవకాశాలు రావడంలేదు. ప్రస్తుతం అతను మ్యాచ్ ప్రెజెంటర్ గా, వ్యాఖ్యాతగా పనిచేస్తున్నాడు. 37ఏళ్ల కార్తీక్ గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అదే ఏడాది ఐపీఎల్ లో ఫినిషర్ గా అవతారమెత్తి రాణించిన దినేశ్ కార్తీక్.. ఆ ప్రదర్శనతో వరల్డ్ కప్ జట్టులోకి వచ్చాడు. అయితే మెగా టోర్నీలో అనుకున్నంతగా రాణించలేదు. దాంతో ఆ తర్వాత జట్టులో స్థానం దక్కలేదు.
రాహుల్ ను తప్పించాలి: దినేశ్ కార్తీక్
ఆసీస్ తో మిగిలిన రెండు టెస్టులకు కేఎల్ రాహుల్ విశ్రాంతి తీసుకోవాలని దినేశ్ కార్తీక్ సూచించాడు. ఆ తర్వాత జరిగే వన్డే సిరీస్ కు ఉత్సాహంగా సిద్ధమవ్వాలని చెప్పాడు. 'రాహుల్ పరిస్థితి ఏంటో ఇప్పుడు నాకు అర్ధమవుతోంది. ఎందుకంటే నేనూ ఒకప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాను. అయితే ఆసీస్ తో మిగిలిన రెండు టెస్టులకు కేఎల్ ను పక్కన పెడితే ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఈ నిర్ణయం 2 మ్యాచుల ప్రదర్శనను బట్టి తీసుకున్నది కాదని అతడు గ్రహించాలి. గత 5, 6 టెస్టులుగా రాహుల్ ప్రదర్శన ఏమాత్రం బాగాలేదు. మిగిలిన 2 మ్యాచ్ లకు విశ్రాంతి తీసుకుని తర్వాత జరిగే వన్డే సిరీస్ కు ఉత్సాహంగా సిద్ధమవ్వాలి' అని కార్తీక్ అన్నాడు.
రాహుల్ స్థానంలో గిల్ కు చోటివ్వాలి
'కేఎల్ రాహుల్ క్లాస్ ప్లేయర్. అన్ని ఫార్మాట్లలో రాణించే సత్తా ఉన్న ఆటగాడు. అయితే ప్రస్తుత పరిస్థితిని అతడు అర్థం చేసుకోవాలి. రాహుల్ స్థానంలో శుభ్ మన్ గిల్ ను ఆడించాలి. అతడు అద్భుతమైన ఆటగాడు.' అని కార్తీక్ అన్నాడు.