Karunaratne Retirement: కెరీర్లో వందో టెస్టు.. జట్టు క్లీన్ స్వీప్.. రిటైర్మెంట్ ప్రకటించిన లంక క్రికెటర్
2012లో టెస్టుల్లో దిముత్ అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి 13 ఏళ్ల కెరీర్లో వంద టెస్టులు పూర్తి చేశాడు. ఓవరాల్ గా తన టెస్టు కెరీర్లో 7222 పరుగులు చేసిన 36 ఏళ్ల కరుణ రత్నే.. 40 సగటును కలిగి ఉన్నాడు.

Aus Vs SL Test Series: శ్రీలంక మాజీ కెప్టెన్, ఓపెనర్ దిముత్ కరుణరత్నే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో గాలేలో జరిగిన రెండో టెస్టులో తన వందో మ్యాచ్ ను పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత తను అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఈ మ్యాచ్ లో 36, 14 పరుగులు చేశాడు. 2011లో ఇంగ్లాండ్ పై వన్డేల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన దిముత్.. 2012లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి 13 ఏళ్ల కెరీర్లో వంద టెస్టులు పూర్తి చేసుకున్నాడు.
ఓవరాల్ గా తన టెస్టు కెరీర్లో 7222 పరుగులు చేసిన 36 ఏళ్ల కరుణ రత్నే.. 40 సగటును కలిగి ఉన్నాడు. అతని అత్యధిక స్కోరు 244 కావడం విశేషం. తన కెరీర్లో 30 టెస్టుల్లో లంకకు నాయకత్వం వహించాడు. అందులో 11 మ్యాచ్ ల్లో గెలవగా, మరో 11 టెస్టుల్లో పరాజయం పాలైంది. సౌతాఫ్రికా గడ్డపై సిరీస్ విజయం సాధించడంతో అతని కెప్టెన్సీలో మణిమకుఠం అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో 1992 తర్వాత క్రికెట్ లోకి అడుగు పెట్టిన తర్వాత అక్కడ టెస్టు సిరీస్ సాధించిన తొలి, ఏకైక జట్టుగా లంక నిలిచింది.
ఐసీసీ ప్రశంసలు..
ఇక అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన కరుణరత్నకు ఐసీసీ ప్రశంసించింది. ఇన్నాళ్లుగా క్లాసిక్ ఫార్మాట్ అయిన టెస్టుల్లో ఆకట్టుకున్నాడని ఐసీసీ చైర్మన్ జై షా ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపై క్రికెట్ ప్రేమికులు కరుణ రత్నే ఆటను మిస్సవ్వనున్నారని పేర్కొన్నారు. లంక తరపున వంద టెస్టులో ఆడిన ఏడో ప్లేయర్ గా తను నిలిచాడని, టెస్టుల్లో తనదైన మార్కును చూపించాడని ప్రశసించారు. ఇక కరుణరత్నే చేసిన 16 సెంచరీలు, ఓపెనర్ గా సాధించినవే కావడం విశేషం. లంక తరపును ఓపెనర్ గా అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా మార్వన్ ఆటపట్టుతో సమంగా నిలిచాడు. కరుణ రత్నే మెయిన్ గా టెస్టు ప్లేయర్ గానే పరిగణించబడ్డాడు. కేవలం 50 వన్డేలు మాత్రమే ఆడాడు. అందులో 1316 పరుగులు చేశాడు. ఇక వంద టెస్టులు ఆడినప్పటికీ, ఒక్క టీ20 ఆడని ప్లేయర్ గా కూడా తను రికార్డులకెక్కాడు.
ఆసీస్ క్లీన్ స్వీప్..
ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లోకి చేరుకున్న ఆస్ట్రేలియా.. ఈ టెస్టు సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసి సత్తా చాటింది. ఆదివారం మూడో రోజే ముగిసిన ఈ మ్యాచ్ లో 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోరు 211/8తో బ్యాటింగ్ ప్రారంబించిన లంక.. 231 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ ఫిఫ్టీ (50) అయ్యాక వెనుదిరిగాడు. బౌలర్లలో మథ్యూ కున్నెమన్, నాథన్ లయోన్ కు నాలుగేసి వికెట్లు దక్కాయి. దీంతో 75 పరుగుల స్వల్ప టార్గెట్ ను విధించింది. ఛేదనను 17.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 75 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (27 నాటౌట్), మార్నస్ లబుషేన్ (26 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చారు. ట్రావిస్ హెడ్ (20) వికెట్ ను ప్రభాత్ జయసూరియా తీశాడు. తొలి ఇన్నింగ్స్ లో లంక 257 పరుగులు చేయగా, ఆసీస్ 414 రన్స్ చేసింది. అలెక్స్ క్యారీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ఆసీస్ స్టాండిన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది.
Also Read: Varun Record: వరుణ్ ఖాతాలో మరో రికార్డు- అతి పెద్ద వయసులో డెబ్యూ.. 1974 తర్వాత ఇదే తొలిసారి..