Dean Elgar Special Farewell : దక్షిణాఫ్రికా క్రికెట్‌(South Africa Cricket)లో ఓ దిగ్గజ ఆటగాడి శకం ముగిసింది. టెస్ట్‌ క్రికెట్‌(Test Cricket)లో ప్రొటీస్‌కు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించిన డీన్‌ ఎల్గర్‌(Dean Elgar ) సుదీర్ఘ ఫార్మట్‌కు వీడ్కోలు పలికాడు. అరంగేట్ర టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్‌ అయిన స్థితి నుంచి జట్టుకు ఒంటి చేత్తో మరపురాని విజయాలు అందించే స్థాయికి డీన్‌ ఎల్గర్‌ ఎదిగాడు. టెస్ట్‌ క్రికెట్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి వికెట్ల ముందు గోడ కట్టి... ప్రతికూల పరిస్థితుల్లో సఫారీ జట్టుకు ఎన్నోసార్లు అద్భుత ప్రారంభాలను ఎల్గర్‌ అందించాడు. భారత్‌తో జరిగిన తొలి టెస్ట్‌లోనూ భారీ శతకంతో మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌ను ముగించిన ఎల్గర్‌... చివరి టెస్ట్‌లో సారధిగా కూడా వ్యవహరించాడు. 2012 నవంబర్‌లో ఆస్ట్రేలియా(Austrelia)పై టెస్టు అరంగేట్రం చేసిన ఎల్గర్‌ మొదట మిడిలార్డర్‌లో ఆడాడు. ఆ తర్వాత ఓపెనర్‌గా మారాడు. 12 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 86 టెస్టుల్లో 47.78 సగటుతో 5347 పరుగులు చేశాడు. ఇందులో 14 శతకాలు, 23 అర్ధసెంచరీలున్నాయి. 8 వన్డేలు మాత్రమే ఆడిన అతను 104 పరుగులు సాధించాడు. టీ20లు ఆడే అవకాశం రాలేదు. స్పిన్‌ బౌలింగ్‌తో టెస్టుల్లో 15 వికెట్లు కూడా సాధించాడు.

 

తొలి టెస్టులో చేదు జ్ఞాపకం

 ఆస్ట్రేలియాపై అరంగేట్ర టెస్ట్‌లో రెండు ఇన్నింగ్సుల్లోనూ ఎల్గర్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. కానీ 2016 నుంచి 2021 వరకు టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్‌గా రికార్డు సృష్టించాడు. కెప్టెన్‌గా 18 టెస్టుల్లో జట్టును నడిపించాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఎనిమిదో దక్షిణాఫ్రికా ఆటగాడిగా ఎల్గర్‌ కెరీర్‌ ముగించాడు. 2012లో అరంగేట్రం తర్వాత కేవలం ఒక్కే ఒక్క సిరీస్‌కు మాత్రమే ఎల్గర్‌ దూరమయ్యాడు. మరోసారి టీమ్‌ఇండియా ఆటగాళ్లతో ఆడే అవకాశం లేదని... భారత జట్టుతో తనకు ఎన్నో జ్ఞాపకాలున్నాయని ఎల్గర్‌ అన్నాడు. బుమ్రా అరంగేట్ర టెస్టులో తాను ఆడినట్లు గుర్తుందన్న ఈ దిగ్గజ ఆటగాడు... భారత ఆటగాళ్లతో ఆడటం గొప్పగా అనిపిస్తోందన్నాడు. చివరి టెస్ట్‌ సందర్భంగా భారత జట్టు(Indian Cricket Team) సభ్యులు తమ సంతకాలతో కూడిన జెర్సీని ఎల్గర్‌కు అందించారు.

 

చివరి ఇన్నింగ్స్‌ ఇలా ముగిసింది

కేప్ టౌన్ లో తొలి ఇన్నింగ్స్ లో ఎల్గర్ కేవలం నాలుగు పరుగులకే ఔట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ముఖేష్ కుమార్ వేసిన ఓవర్లో ఔట్ అయ్యాడు. ఎల్గర్ క్యాచ్ ను విరాట్ కోహ్లీ అందుకున్నాడు.  విరాట్ కోహ్లీ సౌతాఫ్రికా ప్లేయర్ ఎల్గర్ క్యాచ్ తీసుకున్న తరువాత అతనివైపు చూస్తూ సలాం చేస్తున్నట్లుగా చేతులతో సజ్ఞలు చేశాడు. ఆ తరువాత ఎల్గర్ పెవిలియన్ కు వెళ్తున్న క్రమంలో బుమ్రా వెళ్లి అతన్ని అభినందించారు. ఆ తరువాత కోహ్లీ పరుగెత్తుకుంటూ వెళ్లి ఎల్గర్ కు ఘనంగా వీడ్కోలు పలికాడు. ముఖేష్ కుమార్ అతనివద్దకు వెళ్లి షేక్ హ్యాడ్ ఇచ్చి వీడ్కోలు పలికాడు. కోహ్లీ, ఇతర టీమిండియా సభ్యులు ఎల్గర్ పెవిలియన్ కు వెళ్తుండగా వీడ్కోలు పలికిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.