DC-W vs UP-W, WPL 2023:


విమెన్‌ ప్రీమియర్‌ లీగులో దిల్లీ క్యాపిటల్స్‌ భారీ స్కోర్లు చేస్తూనే ఉంది. అలవాటైన అటాకింగ్‌ మోడ్‌నే కొనసాగిస్తోంది. యూపీ వారియర్జ్‌కు కొండంత టార్గెట్‌ ఇచ్చింది. 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (70; 42 బంతుల్లో 10x4, 3x6) క్రితం మ్యాచులో ఎక్కడ ఆపేసిందో అక్కడ్నుంచే మొదలుపెట్టింది. వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ బాదేసింది. జెస్‌ జొనాసెన్‌ (42*; 20 బంతుల్లో 3x4, 3x6) మెరుపులు మెరిపించింది. జెమీమా రోడ్రిగ్స్‌ (34*; 22 బంతుల్లో 4x4, 0x6) వికెట్ల పతనం అడ్డుకొంది.




లానింగ్‌ మొదలెట్టింది!


టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ క్యాపిటల్స్‌కు శుభారంభం దక్కింది. తొలి రెండు ఓవర్లు పరిస్థితులకు అలవాటు పడ్డ ఓపెనర్లు మెగ్‌ లానింగ్‌, షెఫాలీ వర్మ (17) ఆ తర్వాత దూకుడు పెంచారు. షెఫాలీ కాస్త కుదురుగా ఆడగా లానింగ్‌ మాత్రం వరుస బౌండరీలతో చెలరేగింది. అందివచ్చిన బంతుల్ని సిక్సర్లుగా మలిచింది. దాంతో పవర్‌ప్లే ముగిసే సరికి డీసీ 62/0తో నిలిచింది. జట్టు స్కోరు 67 వద్ద షెఫాలీనీ మెక్‌గ్రాత్‌ ఔట్‌ చేసినా మారిజానె కాప్‌ (16) ధనాధన్‌ ఇన్నింగ్సే ఆడింది.


జెస్‌ ముగించింది!


లానింగ్‌ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకోవడంతో 10.4 ఓవర్లకు స్కోరు 100కు చేరుకుంది. 10.2వ బంతికి కాప్‌ను ఎకిల్‌స్టోన్‌ ఔట్‌ చేసింది. సెంచరీ వైపు సాగిన లానింగ్‌ను 11.3 వద్ద రాజేశ్వరీ క్లీన్‌బౌల్డ్‌ చేసింది. అలిస్‌ కాప్సీ (21) కొన్ని షాట్లు ఆడి త్వరగానే ఔటైంది. ఈ క్రమంలో యూపీ బౌలర్లు దిల్లీ వేగానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించారు. అయితే జెమీమాతో కలిసి జెస్‌ జొనాసన్‌ విధ్వంసం సృష్టించింది. ఆఖరి రెండు ఓవర్లు కళ్లు చెదిరే సిక్సర్లు, బౌండరీలు దంచికొట్టింది. ఐదో వికెట్‌కు 34 బంతుల్లో 67 పరుగులు అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. జట్టు స్కోరును 211/4కు చేర్చింది.




తుది జట్లు


దిల్లీ క్యాపిటల్స్‌: మెగ్‌ లానింగ్‌, షెఫాలీ వర్మ, మారిజానె కాప్‌, జెమీమా రోడ్రిగ్స్‌, అలిస్ క్యాప్సీ, జెస్‌ జొనాసెన్‌, తానియా భాటియా, అరుంధతీ రెడ్డి, శిఖా పాండే, రాధా యాదవ్‌, టారా నోరిస్‌


యూపీ వారియర్జ్‌ : అలిసా హీలీ, శ్వేతా షెరావత్‌, కిరన్‌ నవగిరె, తాహిలా మెక్‌గ్రాత్‌, దీప్తి శర్మ, షబ్నమ్‌ ఇస్మాయిల్‌, సిమ్రన్‌ షైక్‌, దేవికా వైద్య, సోఫీ ఎకిల్‌స్టోన్‌, అంజలీ శర్వాణి, రాజేశ్వరీ గైక్వాడ్‌