Danish Kaneria gives initial reaction to CAA implementation in India: పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు మన దేశ పౌరసత్వం లభించనుంది. ఆయా దేశాల్లో వివక్ష ఎదుర్కొని.. భారత్‌కు వచ్చిన వారికి మన పౌరసత్వం కల్పించే పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ(CAA) 2019 చట్టాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మనదేశ పౌరసత్వం కల్పించడం లక్ష్యంగా నోటిఫికేషన్ జారీచేసింది. ఈ చట్టం ప్రకారం పాక్, బంగ్లాదేశ్, అఫ్గాన్ నుంచి వలస వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైన, బౌద్ధ, పార్సీల వద్ద తగిన పత్రాలు లేకున్నా వారికి సత్వరం మన పౌరసత్వాన్ని కేంద్రం ఇవ్వనుంది. అయితే వారు 2014 డిసెంబరు 31 కంటే ముందు వచ్చి ఉండాలి. దరఖాస్తు, పౌరసత్వ జారీ తదితర ప్రక్రియ అంతా ఆన్లైన్‌లోనే ముగిసేలా కేంద్రం నిబంధనలు రూపొందించింది. దరఖాస్తుదారుల నుంచి పత్రాలేమి అడగరు. భారత్‌లో సీఏఏ అమలుపై పాకిస్థాన్ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
పాక్ క్రికెటర్ ఏమన్నాడంటే...
పౌరసత్వ సవరణ చట్టం అమలు(CAA Implemented)పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా(Danish Kaneria) హర్షం వ్యక్తం చేశాడు. ఈ నిర్ణయం వల్ల పాకిస్తాన్‌లో ఉంటున్న హిందూవులు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. సీఏఏను అమలు చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కనేరియా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. పాకిస్తాన్ లోని హిందువులు ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటారని కనేరియా అన్నాడు. సీఏఏపై 2019లో భారత్‌తో పాటు ఇతర దేశాల్లో విమర్శలు వెల్లువెత్తగా కనేరియా మాత్రం ఈ చట్టానికి మద్దతుగా నిలిచాడు.
జై శ్రీరామ్ అని నినదించి..
అయోధ్య రామమందిర (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవం వేళ పాకిస్తాన్ జట్టు మాజీ క్రికెటర్, వెటరన్ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా కాషాయ జెండా పట్టుకుని జై శ్రీరామ్ అని నినాదాలు చేశాడు. రామమందిరాన్ని సందర్శించడానికి ఉత్సాహంగా ఉన్నానని కూడా తెలిపాడు. అంతే కాదు. రామాలయంలోని గర్భగుడిలో కొత్త రాంలాలా విగ్రహాన్ని ఉంచగా దానిని డానిష్ కనేరియా తన సోషల్ మీడియా ప్లాట్ఫాం ఎక్స్ లో ఆ ఫోటోని షేర్ చేశారు. రామమందిరం ప్రాణ్ ప్రతిష్ఠా వేడుక రోజున ప్రత్యేక సెలవును మంజూరు చేసినందుకు మారిషస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
సీఏఏపై విపక్షాల ఆగ్రహం
సీఏఏ అమలు నిబంధనలను కేంద్రం నోటిఫై చేయడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. భాజపా.. విభజన ఎజెండాతో సమాజంలో చీలిక తెచ్చేందుకు, ఓట్లను గుప్పిట పట్టేందుకు వివక్షాపూరిత చట్టాన్ని తెచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్నికల బాండ్ల వివరాల బహిర్గతంపై సుప్రీం తీర్పు రోజే,. సీఏఏ అమలు చేయడం ద్వారా, ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోందని తెలిపింది. మతకోణంలో పౌరసత్వ జారీ రాజ్యాంగ విరుద్ధమని, సీఏఏను అమలు చేయబోమని కేరళ CM విజయన్ స్పష్టంచేశారు.