Cricket World Cup: ప్రజాస్వామిక దేశమైన భారత్‌లో  ఎవరికైనా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం ఉంది. క్రికెట్‌లో అయితే ఇది మరీ ఎక్కువ. ఆట గురించి తెలియనివాళ్లు, జీవితంలో ఒక్కసారి కూడా  బ్యాట్ పట్టనివాళ్లు కూడా   విరాట్ కోహ్లీ  ఏ షాట్ ఎలా ఆడాలో విశ్లేషణలు చేస్తుంటారు. అయితే కొంతకాలంగా  భారత్ నుంచే కాదు విదేశాలకు చెందిన మాజీలు, క్రికెట్ విశ్లేషకులు కూడా  టీమిండియా మీదే పడ్డారు.  టీమ్ గురించి, ఒక్కో ఆటగాడి గురించి విశ్లేషణలు, విమర్శలు చేస్తూ  యూట్యూబ్‌లలో వ్యూస్ పెంచుకుంటున్నారు. తాజాగా భారత జట్టు అక్టోబర్‌లో జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనబోయే 15 మంది సభ్యులను ఎంపిక చేసిన నేపథ్యంలో ఈ విశ్లేషణలు ఎక్కువయ్యాయి. 


నిత్యం భారత క్రికెట్ మీద పడి ఏడ్చే   పాకిస్తాన్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు.. వన్డే వరల్డ్ కప్‌కు ఎంపికైన టీమిండియాపై ఇప్పటికే విశ్లేషణలు మొదలుపెట్టారు. ఓపెనర్లుగా ఎవరు రావాలి..?  నాలుగో స్థానంలో ఎవరు ఆడితే బాగుంటుంది..?  బౌలింగ్ కూర్పు ఎలా ఉండాలి..? తదితర అంశాలపై చర్చోపచర్చలు జరుపుతున్నారు. తాజాగా దీనిపై  భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఆసక్తికర  వ్యాఖ్యలు చేశాడు. అసలు పాక్, ఆసీస్ మాజీలకు భారత క్రికెట‌్‌తో సంబంధమేంటని, వాళ్ల   సూచనలు తమకు అవసరం లేదని అన్నాడు. ఆ దేశాల క్రికెట్ విషయాల్లో మనం తలదూర్చడం లేదు కదా అని  ఈ సందర్భంగా సన్నీ చెప్పుకొచ్చాడు. 


గవాస్కర్ స్పోర్ట్స్ టుడే‌తో మాట్లాడుతూ... ‘బాధకరమైన విషయం ఏమిటంటే వాళ్ల (విదేశీ  క్రికెట్ ఎక్స్‌పర్ట్స్‌ను ఉద్దేశిస్తూ) స్టేట్‌మెంట్స్‌కు మన మీడియా అధిక ప్రాధాన్యమిస్తోంది.  టీమిండియాను  సెలక్ట్ చేయడానికి పాకిస్తాన్, ఆస్ట్రేలియాకు చెందిన మాజీలు కూడా వస్తున్నారు. భారత్ నుంచి ఒక్కరైనా  అక్కడకు వెళ్లి పాకిస్తాన్ టీమ్‌ను గానీ, ఆస్ట్రేలియా టీమ్‌ను గానీ సెలెక్ట్ చేసినట్టు చూశారా..? అది మనకు సంబంధం లేని విషయం. కానీ మనం   మాత్రం వారితో మన టీమ్‌ను సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం..’ అని అన్నాడు.  ఆసియా కప్  ప్రారంభానికి ముందే   స్టార్ నెట్‌వర్క్‌లో జరిగిన చర్చలలో భాగంగా ఆసీస్‌కు చెందిన మాథ్యూ హెడెన్, ఈఎస్పీఎన్‌లో టామ్ మూడీ వంటి మాజీలు వన్డే వరల్డ్ కప్‌కు తాము ఎంపిక చేసిన భారత జట్టు ఇదేనంటూ ప్రకటించారు. 


ఇక భారత ఆటగాళ్లను ఇతర దేశాల ఆటగాళ్లతో పోల్చుతూ చేసే చర్చలపైనా  సన్నీ ఘాటుగానే స్పందించాడు. ‘పలు టీవీలు  వారి చర్చలలో బాబర్ ఆజమ్, విరాట్ కోహ్లీలలో ఎవరు గొప్ప..?  రోహిత్ వర్సెస్ షహీన్ అఫ్రిది.. ఇంజమామ్  గొప్పనా సచిన్ టెండూల్కర్ గొప్పోడా అంటూ చర్చలు జరుపుతాయి. వారి పాయింట్ ఆఫ్ వ్యూలో  ఆ దేశపు ఆటగాళ్లే వాళ్లకు గొప్పగా కనిపిస్తారు.  ఇదంతా వాళ్ల దేశ అభిమానులను సంతృప్తి పరచడానికే..’ అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్లకు కౌంటర్ ఇచ్చాడు.


ఇటువంటి  వాటికి భారత  పత్రికలు, టీవీ ఛానెళ్లు అధికంగా ప్రాధాన్యమిస్తున్నాయని  వాటికి అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన పన్లేదని గవాస్కర్ తెలిపాడు. విదేశీ ఎక్స్‌పర్ట్స్ సూచనలు తమకు అవసరం లేదని  గవాస్కర్  స్పష్టం చేశాడు. 






























ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial