భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌ ఉత్కంఠభరితంగా సాగుతోంది. అన్ని జట్లు సెమీస్‌ చేరేందుకు మార్గం సుగమం చేసుకోగా... మరికొన్ని జట్లు పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ ప్రపంచకప్‌లో కొన్ని మ్యాచుల్లో పరుగుల వరద పారుతుండగా మరికొన్ని మ్యాచుల్లో తక్కువ లక్ష్యాలను కూడా జట్లు కాపాడుకుంటున్నాయి. ప్రపంచ కప్ 2023లో ఇప్పటివరకు 22 మ్యాచ్‌లు జరిగాయి. అంటే ఈ మహా సంగ్రామంలో సగం మ్యాచ్‌లు కూడా పూర్తి కాలేదు. కానీ ఇప్పటికే పలు రికార్డులు నమోదయ్యాయి. ఎన్ోన రికార్డులు బద్దలయ్యాయి. అవేంటంటే...

 

రోహిత్‌శర్మ అరుదైన రికార్డు

ప్రపంచ కప్ చరిత్రలో హిట్‌మ్యాన్ రోహిత్‌ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వరల్డ్ కప్‌లలో టీమిండియా తరపున అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఇప్పటివరకు ఆ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ వరల్డ్ కప్‌లలో 6 సెంచరీలు చేశాడు. ఈ రికార్డును 7 సెంచరీలతో రోహిత్ శర్మ అధిగమించాడు. అంతేకాక అప్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 63 బంతుల్లోనే 100 పరుగులు సాధించిన రోహిత్ శర్మ... టీమిండియా తరఫున వరల్డ్ కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు కపిల్ దేవ్ పేరిట ఉంది. కపిల్ వరల్డ్ కప్‌లో 72 బంతుల్లో సెంచరీ చేశాడు. రోహిత్‌ శర్మ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. 2019 ప్రపంచకప్‌లో మాంచెస్టర్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 77 పరుగులు చేశాడు. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ 86 పరుగులు చేశాడు. వన్డే ప్రపంచ కప్‌లో అత్యధిక సార్లు ఐదు లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా నిలిచాడు. రోహిత్‌ మూడుసార్లు ఈ ఘనత అందుకోగా.. సచిన్ రెండుసార్లు ఈ ఫీట్ సాధించాడు. 

 

ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక స్కోరు

శ్రీలంకపై దక్షిణాఫ్రికా 428 పరుగులు చేసింది. ప్రపంచకప్ చరిత్రలో ఇదే అతిపెద్ద స్కోరు. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 2015 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌పై ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 417 పరుగులు చేసింది.

 

ప్రపంచకప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ

శ్రీలంకపై దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఐడెన్ మార్క్రామ్ కేవలం 49 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ప్రపంచకప్ చరిత్రలో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ. ఇంతకుముందు ఈ రికార్డు ఐర్లాండ్‌కు చెందిన కెవిన్ ఓబ్రెయిన్ పేరిట ఉంది. కెవిన్ ఓబ్రెయిన్ 2011 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై 54 బంతుల్లో సెంచరీ సాధించాడు.

 

ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సెంచరీలు 

శ్రీలంకపై దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్ డి కాక్, వాన్ డర్ డస్సెన్, ఐడెన్ మార్క్‌రామ్ సెంచరీలు చేశారు. ఒకే జట్టులోని ముగ్గురు బ్యాట్స్‌మెన్లు శతకాలతో చెలరేగడం ప్రపంచకప్ చరిత్రలో ఇదే తొలిసారి. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు.

 

ప్రపంచకప్ చరిత్రలోనే అతిపెద్ద ఛేజింగ్‌

శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 345 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ప్రపంచకప్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఛేజింగ్‌. శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 344 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్, అబ్దుల్లా షఫీక్ అద్భుత సెంచరీలతో పాక్ మరో 10 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.