Cricket World Cup 2023: 


ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ మెరుగైన ప్రదర్శన చేస్తుందని మాజీ క్రికెటర్‌ వసీమ్‌ అక్రమ్‌ అంటున్నాడు. కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ సహా టాప్‌, మిడిలార్డర్‌ బ్యాటర్లు మంచి ఫామ్‌లో ఉన్నారని పేర్కొన్నాడు. అత్యుత్తమమైన బౌలింగ్‌ అటాక్‌ తమకు ఉందని వెల్లడించాడు.


పాకిస్థాన్‌ 1992లో ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ గెలిచింది. అందులో వసీమ్‌ అక్రమ్‌ కీలక పాత్ర పోషించాడు. కాగా అప్పటి, ఇప్పటి జట్లకు సారూప్యతలు కనిపిస్తున్నాయని ఆయన అంటున్నాడు. కీలక ఆటగాళ్లు, వారి ఫిట్‌నెస్‌పై రెండో కప్‌ ఆధారపడి ఉందని వెల్లడించాడు.


ప్రస్తుతం పాక్‌ బ్యాటింగ్‌ ఆర్డర్లో బాబర్‌ ఆజామ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌, ఇమామ్‌ ఉల్‌ హక్‌, ఫకర్ జమాన్ కీలకంగా ఉన్నారు. షాహిన్‌ అఫ్రిది, హ్యారిస్‌ రౌఫ్‌, నసీమ్ షాతో కూడిన భీకరమైన బౌలింగ్‌ అటాక్‌ ఉంది. భారత పిచ్‌లపై బంతుల్ని గింగిరాలు తప్పిగలిగే స్పిన్నర్లూ వారి సొంతం. అందుకే సరిగ్గా ప్లాన్‌ చేస్తే భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌ను పాక్ గెలవొచ్చని అక్రమ్‌ ధీమాగా కనిపిస్తున్నాడు.


'మాది మంచి జట్టు. వన్డేల్లో బాగా ఆడుతోంది. ఆధునిక క్రికెట్లో దిగ్గజమైన బాబర్‌ ఆజామ్‌ పాక్‌ను నడిపిస్తున్నాడు. మా ఆటగాళ్లంతా ఫిట్‌నెస్‌తో ఉండి ప్రణాళిక ప్రకారం ఆడితే పాకిస్థాన్‌ ఈ ప్రపంచకప్‌లో మెరుగ్గా రాణించగలదు. ఎందుకంటే భారత్‌, పాక్‌లో ఒకే రకమైన వాతావరణం, పరిస్థితులు ఉంటాయి' అని వసీమ్ అక్రమ్‌ అన్నాడు.


ఇంగ్లాండ్‌లో జరిగిన 2019 వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ త్రుటిలో సెమీస్‌ అవకాశం చేజార్చుకుంది. ఐదు మ్యాచులు గెలిచినప్పటికీ నెట్‌రన్‌రేట్‌ తక్కువగా ఉండటంతో లీగ్ దశలోనే వెనక్కి వెళ్లింది. ఆ తర్వాత దాయాది బలంగా పుజుకొంది. అప్పట్నుంచి ఇప్పటి వరకు కేవలం 9 వన్డేల్లోనే ఓటమి పాలైంది. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉంది. కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. 2019 నుంచి ఎనిమిది సెంచరీలు బాదేశాడు. అందుకే ప్రపంచకప్‌లో అతడి నుంచి సూపర్‌ డూపర్‌ ఇన్నింగ్సలు ఇస్తాయని అక్రమ్‌ ధీమాగా ఉన్నాడు.


'మాకున్న అత్యుత్తమ ఆటగాడు బాబర్‌ ఆజామ్‌. ఈ వన్డే ప్రపంచకప్‌లో అతడు మరింత మెరుగైన ఇన్నింగ్సులు ఆడతాడు. దేశం మొత్తం అతడినే అనుసరిస్తుంది. అతడు చేసిందే చేస్తుంది. వన్డే, టీ20లతో సంబంధం లేకుండా అతడు ప్రజలను స్టేడియాలకు ఆకర్షించగలడు. నా ఉద్దేశంలో ఈ ప్రపంచంలోనే అత్యంత అందమైన కవర్ డ్రైవ్‌ ఆడేది అతడే' అని అక్రమ్‌ ప్రశంసలు కురిపించాడు.


క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌! ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ షెడ్యూలు వచ్చేసింది. 46 రోజులు అలరించే ఈ మెగా టోర్నీ షెడ్యూలును ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. టోర్నీకి సరిగ్గా వంద రోజుల ముందు ప్రకటించింది. పాకిస్థాన్‌ పాల్గొనడంపై సందేహాలు ఉండటంతో ఆలస్యమైంది. చివరిసారి 12 నెలల ముందుగానే షెడ్యూలు విడుదల చేయడం గమనార్హం.


ఈ ప్రపంచకప్‌నకు బీసీసీఐ ఆతిథ్యం ఇస్తోంది. ఇందుకోసం 10 వేదికలను ఎంపిక చేశారు. టోర్నీ అక్టోబర్‌ 5న మొదలై నవంబర్‌ 19న ముగుస్తుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌, రన్నరప్‌ న్యూజిలాండ్‌ అహ్మదాబాద్‌లో ఆరంభ మ్యాచులో తలపడతాయి. అక్టోబర్‌ 8న టీమ్‌ఇండియా తన ప్రస్థానం మొదలెడుతుంది. తొలిపోరులో ఐదుసార్లు ప్రపంచవిజేత, కఠిన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను చెన్నైలో ఎదుర్కొంటోంది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial