Team India News: ఇటీవల పేలవ ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొటున్న టీమిండియాలో పలు మార్పులు చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జట్టు సభ్యులకు ఇప్పటివరకు ఉదారంగా అందించిన సౌకర్యాలపై కత్తెర వేయాలని బోర్డు నిర్ణయించినట్లు సమాచారం. అలాగే భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ స్వేచ్ఛను కూడా పరిమితం చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బోర్డు కార్యదర్శిగా దేవజిత్ సైకియా, అలాగే కోశాధికారిగా ప్రబ్‌తేజసింగ్ భాటియా ఎన్నికైన సంగతి తెలిసిందే. భారత టెస్టు, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, గౌతం గంభీర్లతో ఇటీవల వీళ్లిద్దరూ సమావేశమై పలు విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ భవితవ్యాన్ని తేల్చడంతోపాటు జట్టు మేనేజ్మెంట్‌లో కొన్ని మార్పులు తేవాలని సూచిస్తోంది. 

కుటుంబసభ్యులు దూరం..2019 వరకు విదేశీ టూర్లకు వెళ్లినప్పుడు ప్లేయర్లు, తమ భార్యలను వెంట తీసుకెళ్లేందుకు కొన్ని ఆంక్షలు ఉండేవి. కొన్ని రోజుల పాటే ప్లేయర్లతో వాళ్లు గడిపేందుకు అవకాశముండేది. కోహ్లీ కెప్టెన్సీలో బీసీసీఐ ఈ నియంత్రణను ఎత్తి వేసింది. ఇక ఇటీవల సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్‌తో టెస్టు సిరీస్ కోల్పోవడం, అలాగే ఆసీస్ టూర్లో 1-3తో టెస్టు సిరీస్ ఓడిపోయి, పదేళ్ల తర్వాత బోర్డర్-గావస్కర్ ట్రోఫీని కోల్పోవడం, దీని కారణంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసు నుంచి టీమిండియా నిష్క్రమించడంపై బోర్డు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్టోంది. దీంతో ఆటగాళ్లకు అందించే అదనపు సౌకర్యాలు, మినహాయింపులపై కోత విధించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇకపై విదేశీ టూర్లకు వెళ్తే, తమ భార్యలను రెండు వారాల కంటే ఎక్కువగా తమతో పాటు గడపడానికి వీళ్లేదని నిబంధనలు రూపొందించింది. దీంతో ఆటగాళ్ల ఏకాగ్రత పెరుగుతుందని బోర్డు భావిస్తోంది. అలాగే విమానాల్లో వెళ్లేటప్పుడు 150 కేజీల కంటే అదనంగా ఉండే సరుకుకు ఆటగాళ్లే పే చేసేలా నిబంధనను పునరుద్ధరించింది. 

గంభీర్‌కు సెగ..గంభీర్ మేనేజర్.. గౌరవ్ ఆరోరాపై ఆంక్షలు విధించింది. స్టేడియంలో వీఐపీ బాక్సులో కూర్చునేందుకు అనుమతిని నిరాకరించింది. అలాగే టీమ్ బస్సులో ప్రయాణించేటప్పుడు అతనికి అనుమతిని రద్దు చేయడంతో పాటు టీమ్ బస్సు వెనకాల వచ్చే సదుపాయాన్ని కూడా రద్దు చేసింది. అలాగే ఆటగాళ్లు కూడా అందరూ విధిగా టీమ్ బస్సులోనే ప్రయాణించాలని, ఒంటరి ప్రయాణాలకు మంగళం పాడిందని తెలుస్తోంది. అలాగే జట్టులో సహాయాక సిబ్బందిని కూడా మూడేళ్ల కాలపరిమితికే పరిమితం చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు జట్టులో సహాయక సిబ్బంది చాలా ఏళ్లపాటు జట్టుతో ప్రయాణం చేస్తున్నారు. దీని వల్ల ఒకరకమైన అలసత్వం టీమ్‌లో చేరిందని, దీనికి పరిష్కారంగా మూడేళ్ల నిబంధన రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక టెస్టు జట్టు కెప్టెన్ ఎంపికను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం. వచ్చే జూన్‌లో ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ జరుగుతుండటంతో అప్పటిలోగా టెస్టు కెప్టెన్‌ను నియమించాలని బోర్డు ఆలోచనగా తెలుస్తోంది. ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వరకు సీనియర్లు కోహ్లీ, రోహిత్‌ల ప్రదర్శనను చూసి, ఆ తర్వాత వాళ్ల మనుగడపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఏదేమైనా ఇటీవలి ప్రదర్శనతో అన్ హేపీగా ఉన్న బోర్డు.. నష్ట నివారణ చర్యలకు దిగింది. ఇది ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుందో మున్ముందు తెలుస్తుంది.  

Also Read: Cricketer Nitish Reddy: తిరుమలలో మోస్ట్ హ్యాపెనింగ్ ఇండియన్ ఆల్ రౌండర్ సందడి - మోకాళ్లపై మెట్లు ఎక్కి భక్తిని చాటుకున్న భారత స్టార్