Shubman Gill century:


బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా అద్భుతంగా ఆడుతోంది. భారీ స్కోరువైపు పరుగులు తీస్తోంది. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (110; 152 బంతుల్లో 10x4, 3x6) కెరీర్లో తొలి శతకం అందుకున్నాడు. ఆతిథ్య బౌలర్లకు చుక్కలు చూపించాడు. నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా (50; 87 బంతుల్లో 6x4) వరుసగా రెండో ఇన్నింగ్సులోనూ హాఫ్‌ సెంచరీ సాధించాడు. విరాట్‌ కోహ్లీ (1) క్రీజులో ఉన్నాడు. 50 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 2 వికెట్ల నష్టానికి 188 రన్స్‌ చేసింది.




గిల్‌.. థ్రిల్‌!


బంగ్లాదేశ్‌ను 150 పరుగులకే కుప్పకూల్చిన భారత్‌ వెంటనే రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (23), శుభ్‌మన్‌ గిల్‌ శుభారంభం అందించారు. మొదటి వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఖలీల్‌ అహ్మద్‌ వేసిన 22.4వ బంతికి తైజుల్‌ ఇస్లామ్‌కు రాహుల్‌ క్యాచ్‌ ఇచ్చాడు. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి గిల్‌ రెచ్చిపోయాడు. చక్కని బంతుల్ని డిఫెండ్‌ చేస్తూ దొరికిన వాటిని వేటాడాడు. బౌలర్లను కాచుకుంటూనే చక్కని బౌండరీలు, సిక్సర్లు బాదేశాడు. కేవలం 84 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. డ్రింక్స్‌ తర్వాత తన ఇన్నింగ్సులో మరింత  దూకుడు మొదలైంది. భారీ షాట్లు బాదాడు. తేనీటి విరామం ముగిసిన వెంటనే సెంచరీ సాధించాడు. ఇందుకు 147 బంతులు తీసుకున్నాడు. రెండో వికెట్‌కు పుజారాతో 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అతడిని మెహదీ హసన్‌ ఔట్‌ చేశాడు.


గిల్‌కు అభినందనలు


టెస్టు క్రికెట్లో మొదటి సెంచరీ అందుకున్న శుభ్‌మన్‌ గిల్‌ను మాజీ క్రికెటర్లు, అభిమానులు ప్రశంసించారు. దొరికిన కొన్ని అవకాశాల్ని సరిగ్గా సద్వినియోగం చేసుకున్నాడని అంటున్నారు. బీసీసీఐ, వసీమ్‌ జాఫర్‌, ఇయాన్‌ బిషప్‌ సహా చాలామంది అతడి ఆటతీరును కొనియాడారు. సోషల్‌ మీడియా శుభ్‌మన్‌ గిల్‌ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది.