ఎన్నో  ఆశలు.. మరెన్నో అంచనాలతో రెండు దశాబ్దాల కలను నెరవేర్చుకునేందుకు భారత్‌లో అడుగుపెట్టిన పాకిస్థాన్‌ సెమీస్‌ చేరకుండానే తిరుగు ముఖం పట్టింది. ఆరంభంలో రెండు మ్యాచ్‌లు గెలిచి ఈ మహా సంగ్రామాన్ని ఘనంగా ప్రారంభించిన పాక్‌ తర్వాత గాడి తప్పింది. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా చలామణి అవుతున్న బాబర్‌ ఆజమ్‌... మంచి ఫామ్‌లో ఉన్న రిజ్వాన్‌, ఇమాముల్‌ హక్‌, క్రికెట్‌ ప్రపంచంలో అత్యుత్తమ పేసర్లుగా గుర్తింపు పొందిన షహీన్‌ షా అఫ్రిదీ, హరీస్‌ రౌఫ్‌ ఇలా ఎలా చూసినా అద్భుత ఆటగాళ్లు ఉండడంతో పాక్ సెమీస్‌ చేరడం ఖాయమని మాజీ క్రికెటర్లు భావించారు. కానీ ఈ అంచనాలు తలకిందులయ్యాయి. పాక్‌ బ్యాటర్లు అంచనాలను అందుకోలేకపోయారు. ఈ ప్రపంచకప్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన బాబర్‌ ఆజమ్‌ ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు. ఒక్క షహీన్‌ షా అఫ్రిదీ తప్పితే మిగిలిన పాక్‌ బౌలింగ్‌ దళం పూర్తిగా విఫలమైంది.



 ఈ ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ను నెదర్లాండ్‌తో ఆడిన పాక్‌ ఘన విజయం సాధించి శుభారంభం చేసింది. తర్వాతి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ జట్టు అద్భుతమే చేసింది. ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించి అబ్బురపరిచింది. శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 344 పరుగులు చేయగా... పాకిస్థాన్‌ 48.2 ఓవర్లలో కేవలం నాలుగే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో ఇదే అత్యధిక పరుగుల ఛేజింగ్‌. తర్వాతి మ్యాచ్ నుంచే  కష్టాలు ప్రారంభమయ్యాయి. చిరకాల ప్రత్యర్థి భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ చిత్తయింది. అప్పటినుంచి దాయాది జట్టు కోలుకోలేకపోయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్‌, దక్షిణాఫ్రికా చేతిలోనూ పాక్‌ వరుసగా పరాజయం పాలైంది. వరుసగా నాలుగు ఓటములు రావడం పాక్‌ సెమీస్‌ అవకాశాలను పూర్తిగా దెబ్బతీసింది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అఫ్గాన్‌పై ఓడిపోవడంతో పాక్‌పై విమర్శలు చెలరేగాయి. పాక్‌ ఆటతీరుపై మాజీ క్రికెటర్లు విమర్శల జడివాన కురిపిస్తున్నారు. తర్వాత బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌పై విజయం సాధించినా పాక్‌ సెమీస్‌ అవకాశాలు మృగ్యంగా మారిపోయాయి. శ్రీలంకపై న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించడంతో పాక్‌ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ నామమాత్రంగా మారిపోయింది. ఈ మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్‌ చేతిలో దాయాది దేశం చిత్తయింది.



 వన్డే వరల్డ్‌కప్‌-2023లో పరాభవాలపై పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం ఆవేదన వ్యక్తం చేశాడు. తాము దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్‌ చేరి ఉండేవాళ్లమని  బాబర్‌ అన్నాడు. బౌలింగ్‌, ‍బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌లో తప్పిదాలు చేశామని.. దానికి తగిన మూల్యం చెల్లించుకున్నామని వాపోయాడు. మిడిల్ ఓవర్‌లో స్పిన్నర్లు వికెట్లు తీయకపోతే ఏ జట్టుకైనా గెలవడం చాలా కష్టమని.. ఈ ప్రపంచకప్‌లో తమ జట్టు ఆ సమస్యను ఎదుర్కొందని తెలిపాడు. తప్పులతో పాటు కొన్ని సానుకూలాంశాలు కూడా ఉన్నాయని అన్నాడు. ఇక  వన్డే ప్రపంచకప్‌లలో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. భారత్ వేదికగా జరుగుతున్న ప్రస్తుత టోర్నీలో సెమీస్ చేరకుండానే ఇంటి బాట పట్టింది పాక్. అయితే గత ఆరు టోర్నీలో పాక్ ఇలా నాకౌట్ దశకు చేరకపోవడం ఇది ఐదోసారి. 2003, 2005, 2015, 2019, 2023 టోర్నీల్లో పాక్ లీగ్ దశ నుంచే ఇంటి బాట పట్టింది. 2011లో సెమీ ఫైనల్‌లో భారత్ చేతిలో ఓటమి పాలైంది.