వెస్టిండీస్(West Indies)తో జరిగిన తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా(Australia) ఘన విజయం సాధించింది. మూడు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్‌ల కంగారుల ధాటికి కరేబియన్ జట్టు తేలిపోయింది. వెస్టిండీస్ నిర్ణయించిన 26 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఈ విజయంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్( World Test Championship)లో ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా... టీమిండియా రెండో స్థానానికి పడిపోయింది. ఇక ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్ రోహిత్ సేనకు కీలకంగా మారింది. ఆ సిరీస్‌ను కైవసం చేసుకుంటే టీమిండియా మళ్లీ అగ్రస్థానానికి చేరుకోనుంది.
మ్యాచ్ సాగిందిలా...?
ఇటీవలే స్వదేశంలో పాక్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా.. తొలి టెస్ట్‌ను విండీస్‌ను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసి, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు.. హాజిల్‌వుడ్ 4/44, కమిన్స్ (4/41) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకే చాపచుట్టేసింది. విండీస్ ఇన్నింగ్స్‌లో కిర్క్ మెక్‌కెంజీ (50), షమార్ జోసఫ్ (36) మాత్రమే రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ సెంచరీతో 283 పరుగులకు ఆలౌటైంది. హెడ్ మినహా ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే విండీస్ పేసర్ షమార్ జోసఫ్ అయిదు వికెట్లు నేలకూల్చి సత్తా చాటాడు. ఆరంగేట్రం మ్యాచ్‌లో వేసిన తొలి బంతికే స్టీవ్ స్మిత్‌ను అవుట్ చేసి రికార్డు సృష్టించాడు. 95 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్‌ను హాజిల్‌వుడ్ మరోసారి దారుణంగా దెబ్బకొట్టాడు. హాజిల్‌వుడ్ ఈసారి ఐదు వికెట్ల ప్రదర్శనతో విజృంభించడంతో విండీస్ 120 పరుగులకే కుప్పకూలింది. విండీస్ ఇన్నింగ్స్‌లో కిర్క్ మెక్‌కెంజీ (26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో విండీస్ ముందు 26 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. ఈ సిరీస్‌లో రెండో టెస్ట్ జనవరి 25 నుంచి ప్రారంభమవుతుంది. అద్భుత సెంచరీ చేసిన ట్రవిస్ హెడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ర్యాంకులు ఇలా...
ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌పట్టికలో ఆసీస్ అగ్రస్థానానికి చేరుకుంది. ప్రస్తుత డబ్ల్యూటీసీ ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఆసీస్ తొమ్మిది టెస్టులు ఆడింది. ఆరు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రాతో మొత్తం 61.11 శాతం విజయాలతో తొలి స్థానంలో నిలిచింది. టీమ్‌ఇండియా రెండో స్థానానికి పడిపోయింది. భారత్ నాలుగు మ్యాచుల్లో రెండు విజయాలు, ఒక ఓటమి, ఒక డ్రాతో 54.16 శాతం నమోదు చేసింది. దక్షిణాఫ్రికా (50శాతం), న్యూజిలాండ్ (50), బంగ్లాదేశ్ (50) ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవాలంటే సీజన్ పూర్తయ్యే నాటికి తొలి రెండు స్థానాల్లో నిలవాలి. ఇంగ్లాండ్‌తో స్వదేశంలో ఐదు టెస్టుల సిరీస్‌ను టీమ్‌ఇండియా ఆడనుంది. ఈ సిరీస్‌లో అధిక విజయాలు నమోదు చేస్తే మళ్లీ అగ్రస్థానానికి చేరుకొనే అవకాశం భారత్‌కు ఉంది.