ఫేర్‌ వెల్‌ టెస్ట్‌ సిరీస్‌ ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ చెలరేగిపోయాడు. పాకిస్థాన్‌ బౌలర్లను  ఊచకోత కోస్తూ తొలి రోజే భారీ సెంచరీ బాదేశాడు. వార్నర్‌ విధ్వంసంతో తొలి టెస్ట్‌లో తొలిరోజు పాక్‌పై కంగారులు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. పాక్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న వార్నర్‌... వన్డే తరహా ఆటతీరుతో చెలరేగిపోయాడు. 211 బంతుల్లో 16 ఫోర్లు, నాలుగు సిక్సులతో 164 పరుగులు చేసి తాను ఎంతటి విలువైన ఆటగాడినో క్రికెట్‌ ప్రపంచానికి మరోసారి చాటిచెప్పాడు. వార్నర్‌ భారీ శతకంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కంగారులు అయిదు వికెట్లకు 346 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచారు.


పెర్త్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టాస్‌ గెలిచిన కంగారులు మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్‌ ఎంచుకున్నారు. ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌.. ఉస్మాన్ ఖవాజా కంగారులకు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. పాక్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈజోడీ కేవలం 58 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారీ స్కోరుకు బలమైన పునాది వేసింది. ముఖ్యంగా వార్నర్ దొరికిన బంతిని దొరికినట్లు బాదేశాడు. టెస్టును పూర్తిగా వన్డే తరహాలో మార్చేశాడు. కేవలం 41 బంతుల్లో 9 ఫోర్లతో డేవిడ్‌ బాయ్‌ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.


మరోవైపు ఖవాజా కూడా మంచి షాట్లతో అలరించాడు. తొలి వికెట్‌కు 126 పరుగులు జోడించిన అనంతరం ఈ భాగస్వామ్యానికి తెరపడింది. 41 పరుగులు చేసిన ఖవాజాను షహీన్‌ షా అఫ్రిదీ వెనక్కి పంపాడు. దీంతో 126 పరుగుల వద్ద కంగారులు తొలి వికెట్‌ కోల్పోయారు. ఆ తర్వాత లబుషేన్‌ కూడా త్వరగానే అవుటయ్యాడు. 25 బంతుల్లో 16 పరుగులు చేసిన లబుషేన్‌ను అష్రఫ్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 159 పరుగుల వద్ద కంగారులు రెండో వికెట్‌ కోల్పోయారు. అ తర్వాత స్టీవ్‌ స్మిత్‌తో కలిసి వార్నర్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా వార్నర్‌ మాత్రం ఎదురుదాడి ఆపలేదు. 41 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్‌... 125 బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడు. 125 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్‌తో వార్నర్‌ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. వార్నర్‌కు ఇది 26వ టెస్టు సెంచరీ. ఓవరాల్‌గా ఇది డేవిడ్‌ భాయ్‌కు 49వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం.


ఓ వైపు వార్నర్ విజృంభిస్తున్న మరోవైపు వికెట్లు వరుసగా పడిపోతూనే ఉన్నాయి. 60 బంతుల్లో 31 పరుగులు చేసి స్టీవ్‌ స్మిత్‌ కూడా అవుట్యయాడు. ఆ తర్వాత వచ్చిన ట్రానిస్‌ హెడ్‌ ఓపిగ్గా క్రీజులో నిలబడి వార్నర్‌కు సంపూర్ణ సహకారం అందించాడు. 53 బంతుల్లో 6 ఫోర్లతో 40 పరుగులు చేసి ట్రానిస్‌ హెడ్‌ అవుటయ్యాడు. జట్టు స్కోరు 304 పరుగుల వద్ద హెడ్‌ పెవిలియన్‌ చేరాడు. ఈ క్రమంలో 196 బంతుల్లో 16 ఫోర్లు 3 సిక్సర్లతో వార్నర్‌ 150 పరుగుల మార్క్‌ను కూడా దాటేశాడు. అనంతరం మరింత ధాటిగా ఆడే క్రమంలో 164 పరుగులు చేసి వార్నర్‌ పెవిలియన్‌ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన మిచెల్‌ మార్ష్‌.. అలెక్స్‌ కేరీ... మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. దీంతో ఆస్ట్రేలియా తొలిరోజును సంతృప్తిగా ముగించింది. ఈ మ్యాచ్‌లో పాక్‌ స్టార్ పేసర్ షహీన్‌ బౌలింగ్‌లో కొట్టిన సిక్స్‌ మాత్రం అతడి ఇన్నింగ్స్‌కే హైలైట్‌. మిడిల్‌ స్టంప్‌ను టార్గెట్‌ చేస్తూ షహీన్‌ వేసిన ఫుల్లర్‌ బంతిని బ్యాక్‌ఫుట్‌ వేసి ఫైన్‌ లెగ్‌మీదుగా సిక్స్‌గా మలిచాడు. ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది.