మెల్‌బోర్న్ వేదికగా పాకిస్థాన్‌‌తో జరుగుతోన్న బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని కంగారులు ఇప్పటికే 241 పరుగుల ఆధిక్యంలో ఉన్నారు. చేతులో మరో నాలుగు వికెట్లు ఉన్న దశలో ఆస్ట్రేలియా మరో 50కిపైగా పరుగులు సాధిస్తే పాక్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. ఎందుకంటే మెల్‌బోర్న్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో 260కిపైగా పరుగుల లక్ష్యాన్ని చేధించడం అంత తేలిక కాదు. 1953 నుంచి చూస్తే మెల్‌బోర్న్‌లో అత్యధిక లక్ష్య చేధన 258. అది కూడా వెస్టిండీస్ జట్టు 1961లో సాధించింది. గత అయిదు దశాబ్దాలుగా అంతకుమించిన లక్ష్యాన్ని ఏ జట్టు సాధించలేదు. 

 

రాణించిన పాక్‌ పేసర్లు

ఓవర్ నైట్ స్కోర్ ఆరు వికెట్ల నష్టానికి 194 పరుగులతో మూడో రోజు ఆట ప్రారంభించిన పాకిస్థాన్.. 264 పరుగులకు ఆలౌటయ్యింది. రిజ్వాన్ 42 పరుగులు చేయగా.. ఆమిర్ జమాల్ 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. షాహీన్ అఫ్రిదీ విలువైన 21 పరుగులు జోడించాడు. దీంతో 70 పరుగులకు చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది.

 

అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాను పాకిస్థాన్ పేసర్లు వణికించారు. షాహీన్ అఫ్రిదీ, మిర్ హమ్జా దెబ్బకు ఆసీస్ 16 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో స్మిత్‌, మార్ష్‌ కంగారు జట్టును ఆదుకున్నారు. స్టీవ్ స్మిత్ (50), మిచెల్ మార్ష్ (96) ఆస్ట్రేలియాను ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 153 పరుగులు జోడించారు. 20 పరుగుల వద్ద మార్ష్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను పాకిస్థాన్ ఫీల్డర్ అబ్దుల్లా షఫీక్ చేజార్చాడు. దీనికి పాక్‌ తగిన మూల్యం చెల్లించుకుంది. 20 పరుగుల వద్ద లభించిన జీవానాధారంతో మార్ష్‌ మరో 76 పరుగులు జోడించి సెంచరీ ముందు అవుటయ్యాడు.  ఆ తర్వాత హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న స్మిత్‌ను.. షాహీన్ అఫ్రిదీ అవుట్‌ చేశాడు. దీంతో ఆసిస్‌ ఆరు వికెట్లు కోల్పోయింది. అలెక్స్ కేరీ 16 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు.

ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మ‌ధ్య జరుగుతున్న రెండ‌వ టెస్టు మూడో రోజు లంచ్‌ బ్రేక్‌ తర్వాత ఆసక్తికరమైన ఘటన జరిగింది. మెల్‌బోర్న్ మైదానంలోకి లంచ్ త‌ర్వాత ప్లేయ‌ర్లు, ఆన్ ఫీల్డ్ అంపైర్లు మైదానంలోకి వ‌చ్చినా మ్యాచ్‌ ఆల‌స్యంగా ప్రారంభమైంది. కారణమేంటా అని ఆరాతీసిన క్రికెట్‌ అభిమానులు నవ్వుకున్నారు. థర్డ్‌ అంపైర్ రిచ‌ర్డ్ ఇల్లింగ్‌వ‌ర్త్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోవ‌డం వ‌ల్ల మ్యాచ్‌ను ఆపేశారు. అనుక‌ున్న స‌మ‌యానికి థర్డ్‌ అంపైర్‌ త‌న చైర్‌లోకి రాలేక‌పోయాడు. అంతా సిద్ధంగా ఉన్నా మ్యాచ్‌ ఎందుకు ఆపారో అర్ధంకాక ఆటగాళ్లు, ఫీల్డ్‌ అంపైర్లు సందిగ్దంలో పడ్డారు. అయితే విషయం తెలిసి కాసేపు నవ్వుకున్నారు. థర్డ్ అంపైర్‌ ఇల్లింగ్‌వ‌ర్త్ త‌న పొజిష‌న్ తీసుకున్న త‌ర్వాత మ్యాచ్‌ను స్టార్ట్ చేశారు. 

 

పాక్‌ పేరిట చెత్త రికార్డు

టెస్టు క్రికెట్‌లో పాకిస్తాన్ జ‌ట్టు ఓ చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 52 ప‌రుగుల‌ను ఎక్స్‌ట్రా ల రూపంలో ఇచ్చింది. ఈ క్రమంలో ఓ చెత్త రికార్డును న‌మోదు చేసింది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఓ టెస్టు మ్యాచ్ ఇన్నింగ్స్‌లో అత్యధిక ఎక్స్‌ట్రాలు ఇచ్చిన జ‌ట్టుగా పాక్ అపఖ్యాతి మూటగట్టుకుంది. ఎక్స్‌ట్రాస్‌లో 15 వైడ్‌లు, 20 బైలు, 2 నోబాల్స్‌ ఉన్నాయి.