ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు వచ్చే ఏడాది జనవరిలో భారత్ పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భాగంగా 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఇది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్ లో చాలా కీలకమైన సిరీస్ అని తెలిసిందే. ప్రస్తుతం టీమ్ ఇండియా శ్రీలంకలో పర్యటిస్తోంది. 2 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి టెస్ట్ ఆగస్టు 15 నుండి గాలేలో జరగనుంది. రెండో టెస్ట్ ఆగస్టు 23 నుండి సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో నిర్వహించేందుకు షెడ్యూల్ చేశారు. ఆస్ట్రేలియా జట్టు జనవరి 2027లో భారత పర్యటనకు రానుంది. ఈ టెస్ట్ సిరీస్ పూర్తి షెడ్యూల్ చూడండి.

Continues below advertisement

నాగ్‌పూర్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మొదటి టెస్ట్

ఆస్ట్రేలియా భారత పర్యటన జనవరి 2027 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి టెస్ట్ నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జనవరి 21న ప్రారంభమవుతుంది. ఈ స్టేడియంలో భారత్ 7 టెస్టులు ఆడగా, అందులో కేవలం 1 మ్యాచ్‌లో మాత్రమే ఓడిపోయి, 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

Continues below advertisement

చెన్నైలో రెండో టెస్ట్

ఆస్ట్రేలియా జట్టు తమ పర్యటనలో రెండో టెస్ట్ చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో భారత్‌ను ఢీకొట్టనుంది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 మధ్య షెడ్యూల్ చేశారు. ఇది ఒక చారిత్రక మైదానం, ఇక్కడ భారత్ 35 టెస్టు మ్యాచ్‌లు ఆడగా.. 16 టెస్టుల్లో గెలవగా, 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 

భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ గువాహటిలోని డాక్టర్ భూపేన్ హజారికా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఫిబ్రవరి 11 నుండి 15 మధ్య టెస్ట్ షెడ్యూల్ చేశారు. ఈ వేదికలో జరిగిన ఏకైక టెస్ట్ గతేడాది దక్షిణాఫ్రికాతో జరగ్గా, అందులో భారత్ ఓటమిపాలైంది. 

రాంచీలో నాలుగో టెస్ట్..

నాలుగో టెస్ట్ జార్ఖండ్ రాజధాని రాంచీలో జరుగుతుంది. జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ ఫిబ్రవరి 19 నుంచి 23 మధ్య జరగనుంది. ఈ గ్రౌండ్‌లో భారత్ 3 టెస్టులు ఆడగా, అందులో 2 గెలిచి, ఒక మ్యాచ్ ఆస్ట్రేలియాతో డ్రా అయింది.

అహ్మదాబాద్‌లో చివరి టెస్ట్

సిరీస్‌లో చివరిదైన 5వ టెస్ట్ ఫిబ్రవరి 27 నుండి మార్చి 3 మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మైదానంలో భారత్ 16 టెస్టులు ఆడగా, అందులో 10 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. భారత్ 4 మ్యాచ్‌ల్లో గెలవగా 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

WTC 2025-27 పాయింట్స్ టేబుల్‌లో భారత్ ఎక్కడ.. 

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 పాయింట్ల పట్టికలో భారత్ 5వ స్థానంలో ఉంది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో భారత జట్టు 9 టెస్టుల్లో 4 గెలిచి, మరో 4 ఓడిపోయింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ డ్రా చేసుకుంది. శ్రీలంకతో జరగబోయే రాబోయే సిరీస్ సైతం చాలా కీలకం.  అందులోని 2 మ్యాచ్‌లను గెలిస్తే కనుక ఆ పాయింట్లతో భారత్ టాప్-4లోకి వచ్చే అవకాశం ఉంది.