ICC ODI WC 2023: ‘ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం’ అన్నట్టుగా ఉంది ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్  పరిస్థితి.  వన్డే వరల్డ్ కప్‌కు మరో ఐదు నెలలు సమయం ఉండగానే  మిచెల్ మార్ష్.. ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా - ఇండియా తలపడతాయని, తాము టీమిండియాను భారీ తేడాతో ఓడిస్తామని అంచనాలు వేస్తున్నాడు. ఫైనల్‌లో తాము 450 కొడతామని టీమిండియాను 65 పరుగులకే ఆలౌట్ చేస్తామని మార్ష్ అంచనా వేశాడు.


ఐపీఎల్-16లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న  మిచెల్ మార్ష్.. డీసీ పోడ్‌కాస్ట్‌లో పాల్గొని తన  క్రికెట్ జర్నీ, ఆస్ట్రేలియా జట్టు, ఢిల్లీ టీమ్స్ గురించి  మాట్లాడాడు.  పోడ్‌కాస్ట్ చివర్లో  యాంకర్ వన్డే వరల్డ్ కప్ గురించి ఏమైనా అంచనాలున్నాయా..? అని అడగ్గా మార్ష్ బదులిస్తూ.. ‘హా.. ఆ ప్రపంచకప్ లో మేం ఓటమి ఎరుగని టీమ్‌గా ఉంటాం.  ఫైనల్ ఆస్ట్రేలియా, టీమిండియా  తలపడతాయి. ఆ మ్యాచ్ లో  ఆసీస్  2 వికెట్లు మాత్రమే కోల్పోయి 450 పరుగులు చేస్తుంది. ఇండియా 65 పరుగులకే ఆలౌట్ అవుతుంది..’ అని  ప్రిడిక్షన్ చెప్పాడు. 


 






వన్డే వరల్డ్ కప్‌లలో ఆస్ట్రేలియాకు మంచి రికార్డు ఉంది.  1987, 1999, 2003, 2007, 2015 లలో  ఆ జట్టు ప్రపంచకప్ గెలిచింది.   2003 వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ భారత్ - ఆస్ట్రేలియా మధ్యే జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్.. 50 ఓవర్లలో 359 పరుగుల భారీ స్కోరు చేసింది. రికీ పాంటింగ్.. 121 బంతుల్లోనే 140 పరుగులు చేశాడు. ఆ తర్వాత భారత్..  39.2 ఓవర్లలో  234 పరుగులకే ఆలౌట్ అయింది.  వీరేంద్ర సెహ్వాగ్  (82)  తప్ప మిగిలినవారంతా విఫలమయ్యారు.


కాగా ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ భారత్ లోనే జరుగనుందన్న సంగతి తెలిసిందే.  అక్టోబర్  నుంచి జరుగబోయే ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్  ఇంకా విడుదల కాలేదు.  అసలు  ఎవరెవరు ఏ గ్రూప్ లో ఉంటారు..?   సెమీస్, ఫైనల్స్ కు వెళ్లేదెవరు..? చెప్పడం  అతిశయోక్తే అవుతుంది.  కానీ మార్ష్ మాత్రం  తొందరపడి ముందే  ఎవరూ ఊహించని ప్రిడిక్షన్ చెప్పడం గమనార్హం.  అయితే వన్డే వరల్డ్ కప్ సంగతి ఏమో గానీ మరో నెల రోజుల్లో ఇండియా - ఆసీస్ మధ్య  ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరుగనుంది.  దీని గురించి మార్ష్ ఏం చెప్పలేదు. 


ఐపీఎల్-16లో మార్ష్ 


ఈ ఐపీఎల్‌లో  మార్ష్ మీద భారీ ఆశలు పెట్టుకున్న ఢిల్లీకి నిరాశ తప్పలేదు.  ఈ సీజన్ లో అతడు ఆడిన ఫస్ట్ ఐదు మ్యాచ్ లలో 0, 4, 0, 2, 25 తో కలిపి  57 పరుగులు చేశాడు. హైదరాబాద్ తో మ్యాచ్ లో  63 రన్స్ చేసి ఆకట్టుకున్నా ఢిల్లీ ఆ మ్యాచ్ గెలవలేదు. మొత్తంగా ఈ సీజన్ లో  మార్ష్.. 7 మ్యాచ్ లు ఆడి  120  పరుగులు చేశాడు. బౌలింగ్ లో 9 వికెట్లు పడగొట్టాడు.