ప్రపంచకప్‌లో మరో కీలక పోరుకు రంగం సిద్ధం అయ్యింది . టాస్ గెలిచిన ఆఫ్ఘాన్‌ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలని సాధించిన తో ఆఫ్ఘాన్‌ సెమీఫైనల్ కలను సజీవంగా ఉంచుకుంది. కానీ ఆస్ట్రేలియాను అధిగమించడం అఫ్గాన్‌కు పెద్ద సవాలే.

 

భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే టీమిండియాతోపాటు  దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌ చేరుకున్నాయి. ఇక మిగిలినవి రెండు స్థానాలు. ఈ రెండు స్థానాల కోసం నాలుగు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రస్తుతానికి  దాదాపుగా సెమీస్‌ చేసుకున్న ఆస్ట్రేలియా... అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ విజయం సాధించి ఎలాంటి సమీకరణాలపై ఆధారపడకుండా సెమీస్‌ చేరాలని పట్టుదలగా ఉంది. మరోవైపు ఈ ప్రపంచకప్‌లో సెమీస్‌ చేరడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న అఫ్గాన్‌ కూడా సెమీస్‌పై కన్నేసింది. ఇప్పటికే మాజీ ప్రపంచ ఛాంపియన్లు ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌, శ్రీలంకలకు షాక్‌ ఇచ్చిన అఫ్గాన్‌... రేపు జరగనున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు షాక్ ఇవ్వాలని చూస్తోంది. 

 

ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి తర్వాత కివీస్‌ చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన అఫ్గాన్‌ పుంజుకున్న తీరు అద్భుతం. వరుసగా పాకిస్థాన్‌, శ్రీలంక, నెదర్లాండ్స్‌ను మట్టికరిపించి సెమీస్‌ రేసులోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం 7 మ్యాచుల్లో నాలుగు విజయాలు, మూడు ఓటములతో 8 పాయింట్లను సాధించింది. న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌తో పోలిస్తే సెమీస్‌ అవకాశాలు అఫ్గాన్‌కే ఎక్కువగా ఉన్నాయి. కానీ, తన చివరి రెండు మ్యాచ్‌ల్లో బలమైన జట్లతో తలపడాల్సి ఉండటమే అఫ్గాన్‌కు కాస్త ఇబ్బందికరం. రేపు కీలకమైన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను  ఓడిస్తే అఫ్గాన్‌కు అవకాశాలు ఉంటాయి. దీంతో  ఇప్పటికే సంచలన విజయాలు సాధించిన అఫ్గాన్‌... ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనూ అలాంటి ప్రదర్శననే పునరావృతం చేసి సెమీస్‌ చేరాలని పట్టుదలగా ఉంది.  బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉన్న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆసిస్‌-అఫ్గాన్‌ తలపడనున్నాయి. ఆఫ్ఘానిస్తాన్ స్పిన్‌ను బలమైన బ్యాటింగ్ లైనప్‌ ఉన్న ఆస్ట్రేలియా ఎలా ఎదుర్కొంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ ప్రపంచకప్‌లో లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా కూడా ఏడు మ్యాచ్‌లలో 19 వికెట్లు తీసి అద్భుతంగా రాణిస్తున్నాడు.

 

ఆస్ట్రేలియా సెమీఫైనల్‌ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచుల్లో ఒక్క విజయం చాలు. ఆస్ట్రేలియాను ఇప్పటికీ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్‌ ఆందోళనకు గురిచేస్తోంది. కానీ వరుసగా ఐదు విజయాలు సాధించడంతో కంగారులు ఆత్మవిశ్వాసంతో  ఉన్నారు. స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్‌ కలిసి ఈ ఏడు మ్యాచ్‌లలో  కేవలం మూడు అర్ధసెంచరీలు చేశారు. ఇదే కంగారులను కంగారు పెడుతోంది. అఫ్గానిస్థాన్‌పై భారీ ఇన్నింగ్స్‌లు ఆడి సెమీస్‌కు ముందు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని లబుషేన్‌, స్మిత్‌ చూస్తున్నారు. ఇంగ్లండ్‌పై 83 బంతుల్లో 71 పరుగులు చేసి లబుషేన్‌ పర్వాలేదనిపించాడు. డేవిడ్ వార్నర్ 7 మ్యాచ్‌ల్లో 61.14 సగటుతో 428 పరుగులు చేసి భీకర ఫామ్‌లో ఉండడం ఆసిస్‌కు కలిసి రానుంది. ట్రావిస్ హెడ్ కూడా ఇప్పటికే ఒక సెంచరీ చేసి ఫామ్‌లోకి వచ్చాడు. వీరిద్దరూ నిలబడితే అఫ్గాన్‌కు తిప్పలు తప్పవు. మిచెల్ మార్ష్ తిరిగి జట్టులో చేరడంతో కంగారుల బ్యాటింగ్‌ మరింత బలోపేతం అయింది. 

 

కానీ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ (282 పరుగులు), రహమత్ షా (264), అజ్మతుల్లా ఒమ్రాజాయ్ (234), రహ్మానుల్లా గుర్బాజ్ (234), ఇబ్రహీం జద్రాన్ (232) బ్యాట్‌తో నిలకడగా రాణిస్తున్నారు. రషీద్ ఖాన్ 7 వికెట్లు తీసి పర్వాలేదనిపిస్తున్నాడు. 

 

ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్‌),  జోష్ ఇంగ్లిస్, అష్టన్ అగర్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్.

 

 

ఆఫ్ఘానిస్తాన్ జట్టు: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్‌), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా,  మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమ్రాజాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మద్, ఫ్ఫజ్ ఉర్ రహ్మద్, నవీన్ ఉల్ హక్.